Share News

Donald Trump: సోషల్‌ ఖాతాల వివరాలివ్వండి

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:22 AM

అమెరికాలో భారతీయ వలసదారులపై ట్రంప్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. గ్రీన్‌కార్డుదారుల సామాజిక మాధ్యమ ఖాతాలను పరిశీలించడం, హెచ్‌-1బీ వీసాదారులపై విమానాశ్రయాల్లో కఠిన తనిఖీలు అమలు చేయాలని నిర్ణయించింది.

Donald Trump: సోషల్‌ ఖాతాల వివరాలివ్వండి

అమెరికాలో గ్రీన్‌కార్డుదారులను ఆదేశించే

యోచనలో డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు

తాజా ప్రతిపాదనపై మే 5 వరకూ ప్రజాభిప్రాయ సేకరణ

భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని విమర్శలు

విదేశాలకు వెళ్లొస్తే.. సమాధానం చెప్పాల్సిందే

సుదీర్ఘ ప్రశ్నలకు సిద్ధంగా ఉండాలని భారతీయ

గ్రీన్‌కార్డు, హెచ్‌-1బీ వీసాదారులకు అమెరికా హెచ్చరిక

న్యూఢిల్లీ, మార్చి 25: అమెరికాలో భారతీయ వలసదారులపై ఉక్కుపాదం మోపడానికి ట్రంప్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా గ్రీన్‌కార్డుదారుల ప్రతి కదలికను నిశితంగా పరిశీలించాలని నిర్ణయించింది. ట్రంప్‌ సన్నిహితుడు, ‘ఎక్స్‌’ అధినేత ఎలాన్‌ మస్క్‌ సహకారంతో వారి సామాజిక మాధ్యమ ఖాతాలను వడపోయడం ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించేవారిపై నిఘా పెట్టనుంది. మరోవైపు వలస చట్టాలకు పదును పెడుతూ ఇతర దేశాలకు వెళ్లి అమెరికాకు తిరిగొచ్చే హెచ్‌-1బీ వీసాదారులను విమానాశ్రయాల్లోనే అడ్డుకొని, కఠినమైన తనిఖీలతో పాటు వారిపై ప్రశ్నల వర్షం కురిపించనుంది. గ్రీన్‌కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా నివసించడానికి హక్కు ఉండదని దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే తీవ్ర ఆందోళన చెందుతున్న వలసదారులు... తాజాగా ట్రంప్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో బెంబేలెత్తుతున్నారు. అమెరికాలో నివసించే గ్రీన్‌కార్డుదారులు తమ సోషల్‌ మీడియా ఖాతాల వివరాలను సమర్పించాలని ట్రంప్‌ యంత్రాంగం త్వరలోనే ఆదేశించే అవకాశం ఉంది. ఈ మేరకు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఇతర దేశాలకు చెందిన పౌరులు అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసేటప్పుడే తమ సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలు వెల్లడించడం తప్పనిసరి. ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్న వలసదారులకూ ఈ నిబంధనను వర్తింపజేయాలని భావిస్తున్నారు.

gb.gif

అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ... భారత్‌, అమెరికా రాజకీయ చర్చల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న పలువురు భారతీయులపై ఈ ప్రతిపాదనలు ప్రభావం చూపుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పర్యవసానాలపై ఆందోళనతో రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను ఆన్‌లైన్‌లో స్వేచ్ఛగా వ్యక్తం చేసే పరిస్థితి లేకుండా పోతుందని,ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై మే 5వ తేదీ వరకూ యూఎ్‌ససీఐఎస్‌ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది.


విదేశాలకు వెళ్తొస్తే... సమాధానం చెప్పాల్సిందే

గ్రీన్‌కార్డు, హెచ్‌-1బీ, ఎఫ్‌-1 వీసాలు కలిగిన భారతీయ వలసదారులు విదేశాలకు వెళ్లి, వచ్చే సమయంలో భద్రతాపరమైన తనిఖీలతో అప్రమత్తంగా ఉండాలని యూఎస్‌ ఇమిగ్రేషన్‌ అటార్నీ అధికారులు సూచించారు. ఈ మేరకు ట్రావెల్‌ రిస్క్‌ అడ్వైజరీ జారీ చేశారు. పాకిస్థాన్‌, భూటాన్‌, అఫ్ఘానిస్థాన్‌ సహా 43 దేశాల పౌరుల ప్రయాణాలను పరిమితం చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ జాబితాలో భారత్‌ లేకపోయినా కూడా అమెరికా వెలుపల ప్రయాణాలు చేసే భారతీయులు కఠినమైన తనిఖీలతో వీసా స్టాంపింగ్‌లో జాప్యంతో పాటు విమానాశ్రయాల్లో అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగం, వీసా పునరుద్ధరణ కోసం బయటి దేశాలకు వెళ్లేవారు ఊహించని అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 06:01 AM