Rat Control: ఎలుకల బాధతో విసిగిపోయారా.. ఇలా చేస్తే చంపకుండానే ఇంట్లో నుంచి మాయమవుతాయి..
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:30 PM
Tips For Rats Problem : ఇంట్లో ఎలుకల బాధ తట్టుకోలేకపోతున్నాయి. ఎన్ని విధాలుగా ప్రయత్నించిన ఎలుకల సమస్య వదలట్లేదా. అయితే ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి. ఇలా చేస్తే వాటంతట అవే పారిపోతాయి.

Home Remedies for Rats Problem : ఎలా వస్తాయో తెలీదు.. ఇంట్లో ఏ విలువైన వస్తువునూ వదలిపెట్టవు. పండ్లు, కూరగాయలు, బట్టలు,పుస్తకాలు, వైర్లు, ఆఫీసు ఫైళ్లు ఇలా కనిపించిన ప్రతి వస్తువునూ కొరికి పడేస్తూ నానా బీభత్సం సృష్టిస్తుంటాయి ఎలుకలు. ఇంట్లో ఎక్కడపడితే ఎక్కడ పడితే అక్కడ దూరేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తాయి. ఇళ్లు శుభ్రంగా వీటి బెడద నుంచి తప్పించుకోలేక ఇబ్బందులు పడుతుంటారు ప్రజలు. ట్రాప్, మందులు ఇలా ఎన్ని మార్గాల్లో ఎలుకలను తరిమికొట్టేందుకు ప్రయత్నించినా సమస్య పూర్తిగా పోదు. కానీ, ఈ 5 పద్ధతులు పాటిస్తే ఎలుకల్ని చంపకుండానే ఇంటి నుంచి తరిమేయవచ్చు. శాశ్వతంగా ఎలుకల సమస్య తప్పిపోతుంది.
మనం నిద్రకు ఉపక్రమించగానే వంటగదిలో దూరిపోయి పాత్రలపై తిరుగాడుతూ శబ్దాలతో హోరెత్తిస్తుంటాయి ఎలుకలు. అల్మారా తెరవగానే మన కళ్లెదుటే దూకి పారిపోతాయి. ఆహారపదార్థాలను కొరికి తినేస్తూ నానా రచ్చ చేస్తాయి. ఉచ్చులు, విషం పెట్టడం ఇలా రకరకాల పద్ధతుల ద్వారా వీటిని తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, వీటిని హింసించకుండానే ఇంటి నుంచి బయటకు తరిమేందుకు 5 సులభమైన చిట్కాలు మీకోసం..
పుదీనా
ఎలుకలు ఘాటైన వాసన వచ్చే వస్తువులను అస్సలు ఇష్టపడవు. పుదీనా వాసన వాటికి బద్ధ శత్రువు. అందుకే కాటన్ బాల్స్‌పై కొన్ని చుక్కల పుదీనా ఆయిల్ వేసి ఎలుకల వచ్చే మార్గాల్లో, తలుపుల దగ్గర లేదా అల్మారాల్లో ఉంచండి. వీలైతే నీటిలో కొన్ని చుక్కల పుదీనా నూనెను కలిపి ఇంటి మూలల్లో స్ప్రే చేయండి. ఈ ద్రావణం ఎలుకలను దూరంగా ఉంచడమే కాకుండా ఇంటికి తాజా వాసనను కూడా ఇస్తుంది.
ఎర్ర మిరపకాయ
ఎర్ర మిరపకాయల ఘాటుకు ఎలుకలు ఎంతగా భయపడతాయో మీకు తెలుసా. వీటి వాసనకు ముక్కుకు తగలగానే మనకు కళ్ళలో మంటలు, ముక్కులో చికాకు ఎలా వస్తాయో ఎలుకలకూ అంతే. అందుకే అవి ఉండే చోట్ల ఎర్ర కారం పొడి చల్లండి లేదా నీటిలో కలిపి స్ప్రే తయారు చేసి ఎలుకలు వచ్చి వెళ్ళే ప్రదేశాలలో చల్లవచ్చు. కానీ, పిల్లలు లేదా పెంపుడు జంతువులు మీ ఇంట్లో ఉంటే జాగ్రత్త. వారిని దూరంగా పెట్టాకే ఈ రెమెడీ ప్రయోగించండి.
కర్పూరం
కర్పూరం బలమైన వాసన పర్యావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా ఎలుకలను కూడా తరిమికొడుతుంది. కొంత కర్పూరం తీసుకొని ఇంటి మూలల్లో ఉంచండి లేదా నీటిలో వేసి పిచికారీ చేయండి. కర్పూరం పొగ ఇంట్లో వ్యాపింపచేయడం ద్వారా కూడా ఎలుకలను తరిమికొట్టవచ్చు. కానీ ఈ పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
నిమ్మ, నారింజ తొక్కలు
ఎలుకలు సిట్రస్ పండ్ల వాసనను అస్సలు ఇష్టపడవు. కాబట్టి వాటిని తరిమికొట్టేందుకు ఇది మంచి మార్గం. ముందుగా నిమ్మకాయ, నారింజ తొక్కలను ఎండబెట్టి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఎలుకల స్థావరాల వద్ద ఉంచండి. దెబ్బకు ఎలుకలు ఇంట్లో నుంచి ఎలుకలు పారిపోతాయి.
అమ్మోనియా
అమ్మోనియా వాసన ఎలుకలకు సరిపడదు. కాబట్టి నీటిలో కొద్ది మొత్తంలో అమ్మోనియా కలిపి స్ప్రే తయారుచేసుకోండి. ఈ ద్రవాన్ని బాటిల్‌లో నింపి ఎలుకల దాగి ఉన్న ప్రదేశాల దగ్గర పిచికారీ చేయాలి. అమ్మోనియా ఘాటుగా ఉంటుంది కాబట్టి దానిని ఉపయోగిస్తున్నప్పుడు కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి.
Read Also : Benefits with Rice water: వావ్.. గంజి నీళ్లతో ఇన్ని ఉపయోగాలున్నాయా.. మొహానికి రాసుకుంటే ఎన్ని ప్రయోజనాలంటే..
Relaxation tips: ఎంత ఒత్తిడిలో ఉన్నా ఈ టిప్స్‌తో ఈజీగా రిలాక్స్ అయిపోవచ్చు
Health Benefits: ఓ గిన్నె పెరుగు తీసుకుంటే చాలు..ఈ వ్యాధులు మటుమాయం..