Deep Fried Foods: డీప్ ఫ్రై ఫుడ్స్ అంటే ఇష్టమా.. ఇలా చేసుకుని తిన్నా ఏం కాదంట..
ABN , Publish Date - Mar 28 , 2025 | 06:43 PM
Healthy Deep Fried Foods: ఫ్రై చేసిన ఆహారపదార్థాలంటే చాలామంది ఇష్టపడతారు. కానీ, నూనెల వేయించిన పదార్థాలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదని తినాలనే కోరిక ఉన్నా దూరం పెడుతుంటారు. ఇక నుంచి అలాంటి భయం లేదంటున్నారు పోషకాహార నిపుణులు. మరి, హెల్తీ డీప్ ఫ్రై ఫుడ్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి..

Healthy Deep Fried Foods: నూనెలో వేయించిన ఆలూ, బెండకాయ లాంటి కూరగాయలతో చేసిన వేపుళ్లు, సమెసాలు, చిప్స్ లాంటివి ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇలాంటి పదార్థాల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయనే ఒకే ఒక్క కారణంతో ఎక్కువమంది డీప్-ఫ్రై చేసిన వంటకాలను తినడానికి ఇష్టపడరు. కానీ, ఆహారపదార్థాలను సరైన పద్ధతిలో డీప్ ఫ్రై చేసుకుని తింటే ఆరోగ్యానికి ఏ హాని జరగదంటున్నారు పోషకాహార నిపుణులు. కింద చెప్పిన 5 రకాల చిట్కాలను పాటిస్తూ వేపుళ్లను ఆరోగ్యకరమైన రీతిలో ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం..
సరైన కడాయి ఎంచుకోండి..
ప్రతి ఇంట్లో కనీసం మూడు రకాల ఇనుప కడాయిలు ఉంటే మంచిది. చిన్నవి, మధ్యస్థమైనవి, పెద్దవి కొని ఉంచుకోవాలి. ఎంతమంది కోసం ప్రిపేర్ చేస్తున్నాం అన్నదాన్ని బట్టి కడాయిని ఎంచుకోవాలి. ఉదాహరణకు ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల కోసం డీప్-ఫ్రైయింగ్ చేసేటప్పుడు పెద్దది ఉపయోగిస్తే నూనె పెద్ద మొత్తంలో మిగిలిపోతుంది. అలాంటప్పుడు ఎక్కడ వేస్ట్ అయిపోతుందోనని ఈ నూనెను పదేపదే వాడుతుంటారు. దీనివల్లే నూనె విషపూరితంగా మారి ఆరోగ్యానికి చేటు చేస్తుంది. అందుకే సందర్భాన్ని బట్టి వీలైనంత తక్కువ నూనె వాడుకునేలా కడాయిని ఎంచుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడదు.
తగిన మొత్తంలో నూనె వాడండి
కడాయిలో తగినంత నూనె ఉండేలా చూసుకోండి. పకోడీలు లాంటివి చేసేటప్పుడు మునిగేంత లోతు ఉంటే చాలు. అప్పుడు పదార్థాలు ఎక్కువ నూనెను పీల్చుకోవడానికి ఆస్కారం ఉండదు.
పరిమితంగా తినండి
ఫ్రై చేసిన ఆహారాలు వేడిగా ఉన్నప్పుడు మరింత రుచిగా ఉంటాయి. ఇక వీటిని ఇష్టపడేవారు అప్పుడు అస్సలు నోరు కట్టేసుకోలేరు. ఆ సమయంలోనే మీరు అలర్ట్ అవ్వాలి. తక్కువ తినాలనే విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుని శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం మానుకోవాలి.
నూనె ఎంపిక
ఆహారపదార్థాలను డీప్-ఫ్రై చేసేందుకు నాణ్యమైన, ఆరోగ్యానికి హాని చేయని నూనెలనే ఎంచుకోవాలి. ఉదాహరణకు, కేరళలో అరటిపండు చిప్స్‌ను ఫ్రై చేయడానికి కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు. సామాన్యులకు అందుబాటు ధరలో లభించే వేరుశనగనూనె వేపుళ్లకు అత్యుత్తమ ఎంపిక. వీటన్నిటి కంటే బెస్ట్ అంటే మాత్రం నెయ్యి అనే చెప్పాలి.
మిగిలిపోయిన నూనెను ఇలా వాడండి.
మీరు గమనిస్తే నెయ్యి త్వరగా ఆవిరి అయిపోతుంది. అందుకే గోధుమపిండి కలుపుకోవడానికి రోటీ, చపాతీలు లాంటివి చేయడానికి నెయ్యి బెస్ట్ ఛాయిస్. ఇక అరిసెలు, గారెలు, పూరీలు లాంటివి చేయడం పూర్తయ్యాక మిగిలిపోయిన నూనెను ఎట్టి పరిస్థితుల్లో వేరే రకం వంటనూనెతో కలిపి వాడకండి. వీలైనంత వరకూ ఫ్రై తర్వాత నూనె మిగలకుండా ఉండేలా చూసుకోండి. సరైన మొత్తంలో కడాయిలో నూనె వేసుకుంటే అదనపు నూనె సమస్య రాదు.
Read Also: Coriander Leaves: కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి..
Buying Water Melon: పుచ్చకాయ కొంటున్నారా..తియ్యగా, జ్యూసీగా
Summer Tips: ఎండవేడికి అరచేతుల్లో చెమట పడుతున్నాయా.. ఈ చిట్కాలతో