Chhattisgarh: మళ్లీ నెత్తురోడిన దండకారణ్యం
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:38 AM
చనిపోయిన నక్సల్స్ నుంచి భద్రతాబలగాలు పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గంగలూరు డీవీసీఎం సభ్యుడు ఎం.దినేశ్ పోలీసులకు లొంగిపోయిన వారంలోనే భారీ ఎన్‌కౌంటర్లు జరగడం గమనార్హం..! బస్తర్ ఐజీ సుందర్‌దాస్ కథనం ప్రకారం.. బీజాపూర్ జిల్లా గంగలూరు సమీపంలోని బైలాదియ కొండకు అవతల..

ఛత్తీ్‌సగఢ్‌లో 30 మంది నక్సల్స్ ఎన్‌కౌంటర్
బీజాపూర్, కాంకేర్‌లలో వేర్వేరు ఆపరేషన్లు.. గంగలూరు అడవుల్లో 26 మంది మృతి
మృతుల్లో ఎనిమిది మంది మహిళా నక్సల్స్.. డీఆర్‌జీకి చెందిన ఓ కానిస్టేబుల్ కూడా..
అబూజ్‌మఢ్‌లో నలుగురు మావోయిస్టుల మృతి.. ముమ్మరంగా ‘ఆపరేషన్ హిడ్మా’..!
చర్ల, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): నెలరోజులపాటు ప్రశాంతంగా ఉన్న దండకారణ్యం గురువారం మరోమారు నెత్తురోడింది. బీజాపూర్‌లోని గంగలూరు, కాంకేర్ జిల్లాలోని అబూజ్‌మఢ్ అడవుల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 30 మంది నక్సలైట్లు, ఒక డీఆర్జీ జవాను మృతిచెందారు. చనిపోయిన నక్సల్స్ నుంచి భద్రతాబలగాలు పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గంగలూరు డీవీసీఎం సభ్యుడు ఎం.దినేశ్ పోలీసులకు లొంగిపోయిన వారంలోనే భారీ ఎన్‌కౌంటర్లు జరగడం గమనార్హం..! బస్తర్ ఐజీ సుందర్‌దాస్ కథనం ప్రకారం.. బీజాపూర్ జిల్లా గంగలూరు సమీపంలోని బైలాదియ కొండకు అవతల.. ట్రయాంగిల్ అడవుల్లో నక్సల్స్ సంచారం ఉన్నట్లు ఉప్పందుకున్న పోలీసులు.. సుమారు 1,500 మంది బలగాలు బుధవారం కూంబింగ్ ప్రారంభించారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో మావోయిస్టులు తారసపడడంతో.. ఇరువైపులా కాల్పులు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు ఐదు విడతలుగా భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ తర్వాత నక్సల్స్ వైపు కాల్పులు నిలిచిపోవడంతో.. కూంబింగ్ బలగాలు ముందుకు సాగాయి. అక్కడ 26 మంది నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో 8 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు.
నక్సల్స్ జరిపిన కాల్పుల్లో డీఆర్జీ జవాను రాజు మృతిచెందగా.. మరో ఇద్దరు జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. ‘‘చనిపోయిన నక్సల్స్‌ను ఇంకా గుర్తించాల్సి ఉంది’’ అని బస్తర్ ఐజీ వెల్లడించారు. మరో ఘటనలో.. కాంకేర్-నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అబూజ్‌మఢ్ అడవుల్లో గురువారం కూంబింగ్‌లో ఉన్న భద్రతాబలగాలపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు.ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సల్స్ మృతిచెందారు. ఈ మార్గంలో పోలీసులే టార్గెట్‌గా మావోయిస్టులు మందుపాతరను పేల్చడంతో.. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ రెండు ఎన్‌కౌంటర్లలో మృతిచెందిన మావోయిస్టుల్లో తెలంగాణకు చెందిన వారు కూడా ఉండి ఉంటారని ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.
78 రోజుల్లో.. 97 మంది నక్సల్స్
గత ఏడాది 190 మంది ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లగా.. ఈ ఏడాది తొలి 78 రోజుల్లోనే 97 మంది నక్సలైట్లు చనిపోయారు. గురువారం నాటి ఎన్‌కౌంటర్ ఈ ఏడాదిలో రెండో అతిపెద్దది కావడం గమనార్హం..! జనవరిలో నేషనల్ పార్క్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది చనిపోగా.. తాజా ఎన్‌కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతిచెందారు.
హిడ్మా కోసం థర్మల్ ఇమేజింగ్
పీఎల్‌జీఏ-1 కమాండర్, మావోయిస్టు గెరిల్లా యుద్ధాల వ్యూహకర్త మాడ్వీ హిడ్మా కోసం భద్రతాబలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. వేర్వేరు బృందాలు ఛత్తీ్‌సగఢ్-ఒడిసా, ఛత్తీ్‌సగఢ్-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని 125 గ్రామాల్లో బలగాలు కూంబింగ్ చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీని వినియోగించుకుంటున్నాయి. నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌టీఆర్‌ఐ) సాంకేతిక సిబ్బంది సహకారంతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం.
దండకారణ్యంలో బలగాల క్యాంపులు పెరగడం.. కూంబింగ్ ముమ్మరమవ్వడంతో నక్సల్స్ అగ్రనేతలు కుల్హారిఘాట్ అడవుల మీదుగా ఆంధ్ర-ఒడిసా సరిహద్దులు(ఏవోబీ) వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జనవరి 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత చలపతి సహా.. 16 మంది మావోయిస్టులు చెందిన విషయం తెలిసిందే..!
నక్సలైట్లను కనికరించేది లేదు
నక్సలైట్లపై తమ సర్కారుకు కనికరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు. ఛత్తీ్‌సగఢ్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఆయన జవాన్ల సాహసాన్ని అభినందిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. మావోయిస్టుల పట్ల మోదీ సర్కారు నిర్దాక్షిణ్య వైఖరితో ముందుకు వెళ్తోందని, వచ్చే ఏడాది మార్చి 31కల్లా నక్సల్స్ రహిత భారత్‌ను సాధిస్తామని పునరుద్ఘాటించారు. ఛత్తీ్‌సగఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి కూడా ఎక్స్‌లో ఈ ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. జవాన్ల విజయాన్ని కొనియాడుతూ.. 2026 నాటికి బస్తర్‌లో భయరహిత వాతావరణాన్ని నెలకొల్పుతామని ధీమా వ్యక్తం చేశారు. బస్తర్ అభివృద్ధి ప్రణాళిక కోసం రెండ్రోజుల క్రితమే ప్రధాని మోదీని కలిసిన విషయాన్ని గుర్తుచేశారు
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..