Revenue Department: రెవెన్యూ శాఖలో 10,954 కొత్త పోస్టులు
ABN , Publish Date - Mar 23 , 2025 | 05:01 AM
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని విధుల్లోకి తిరిగి తీసుకుంటామని హామీ ఇచ్చి వివిధ శాఖల్లో నియమించింది. అయితే... అర్హతలు ఉన్నవారిని రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలంటూ పలు సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.

గ్రామ పాలనాధికారులుగా నామకరణం
వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలకు శుభవార్త
హైదరాబాద్, మార్చి22(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖలో గ్రామ స్థాయిలోని పాత పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేయడానికి మార్గం సుగమమైంది. ప్రజలకు అందుబాటులో ఉండి, భూవ్యవహారాలను చూసిన గ్రామ రెవెన్యూ అధికారులు(బీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ)లో కొంత మందిని మళ్లీ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థలో 10,954 కొత్త పోస్టులను సృష్టించింది. ఈ పోస్టులకు ‘గ్రామ పాలనాధికారులుగా(జీపీఓ) నామకరణం చేసింది. ఈ పోస్టులను మంజూరు చేస్తూ శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా ఉత్తర్వులను జారీ చేశారు.
అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని విధుల్లోకి తిరిగి తీసుకుంటామని హామీ ఇచ్చి వివిధ శాఖల్లో నియమించింది. అయితే... అర్హతలు ఉన్నవారిని రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలంటూ పలు సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. దాంతో ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలోనే 10,954 పోస్టులను సృష్టించి అర్హత గల వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలలో కొంత మందిని తీసుకోనుంది. దాదాపు 6000 మందిని ఈ రకంగా నియమించనున్నట్లు తెలిసింది. మిగతా పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిన భర్తీ చేయనుంది.