Share News

Phone Tapping Case: ఏ తప్పూ చేయలేదు

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:56 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని తెలిపారు.

Phone Tapping Case: ఏ తప్పూ చేయలేదు

  • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వండి

  • హైకోర్టులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు పిటిషన్‌

  • నాకు వ్యతిరేకంగా పనికివచ్చే ఒక్క సాక్ష్యం కూడా లేదు

  • పోలీసు అధికారిగా అంకితభావంతో విధులు నిర్వర్తించా

  • వామపక్ష తీవ్రవాదం.. టెర్రరిజంను నియంత్రించాను

  • నా ప్రతిభను రాష్ట్రంతోపాటు కేంద్ర ఏజెన్సీలు శ్లాఘించాయి

  • క్యాన్సర్‌, కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నా: ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని తెలిపారు. 30 ఏళ్లకు పైగా పోలీసు అధికారిగా వివిధ హోదాల్లో అత్యంత అంకితభావంతో పనిచేశానని, చట్టవిరుద్ధంగా ఏ పనీ చేయలేదని పేర్కొన్నారు. వామపక్ష తీవ్రవాదం, ఇస్లామిక్‌ టెర్రరిజంను కట్టడి చేయడంలో తాను కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. తన సర్వీసు మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలుమార్లు ప్రశంసలు అందుకోవడమే కాకుండా తన ప్రతిభను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు సైతం శ్లాఘించాయని పేర్కొన్నారు. తాను క్యాన్సర్‌తోపాటు కొవిడ్‌ కారణంగా గొంతు, ఊపిరితిత్తులకు సోకిన ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో తనకు వ్యతిరేకంగా పనికివచ్చే ఒక్క సాక్ష్యం కూడా లేదని, కేవలం ఇతర నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలు తప్ప పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన తొలిసారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


వైద్య పరీక్షల కోసమే అమెరికాకు..

‘‘ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నన్ను అక్రమంగా ఇరికించారని తెలియగానే న్యాయవాది ద్వారా ట్రయల్‌ కోర్టులో మెమో దాఖలు చేసి.. అమెరికాకు ఏ పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చిందో వివరించాను. కేసు నమోదుకు చాలా కాలం ముందే అమెరికాకు వైద్య పరీక్షల కోసం టికెట్లు బుక్‌ చేసుకున్నాను. దర్యాప్తు అధికారిని సంప్రదించి ఫోన్‌ నంబర్‌ ఇవ్వడంతోపాటు దర్యాప్తునకు అన్నిరకాలుగా సహకరిస్తానని చెప్పాను. అయినా.. తప్పించుకొని పారిపోయాడనే ముద్ర వేయడం సమంజసం కాదు. ఈ విషయాన్ని ట్రయల్‌ కోర్టు దృష్టికి సైతం తీసుకెళ్లాను. నా ఇంట్లో తనిఖీలు చేసినా ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఫోన్‌ నంబర్‌ ఇచ్చినప్పటికీ పోలీసులు నా నుంచి ఏ వివరాలూ కోరలేదు. 2023 డిసెంబరులో రాజీనామా చేసిన మూడు నెలల తర్వాత అమెరికా వచ్చాను. ఇండియాలో ఉన్నప్పుడు ఎవరూ ఫోన్‌ ట్యాపింగ్‌ గురించి నన్ను ప్రశ్నించలేదు. రాజకీయ అధికార మార్పిడి వల్లే ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. అప్పటి అధికార పార్టీకి సహాయం చేయడానికి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశాననేది కేవలం అబద్ధం మాత్రమే. నాకు ఏ రాజకీయ ఆసక్తులు, వివక్ష లేవు. దశాబ్దాలుగా సేకరించిన డేటా పోయిందనడం, ఏ-2 ప్రణీత్‌రావుకు ఎక్కువ ప్రమోషన్లు ఇచ్చారనడం పూర్తిగా తప్పు’’ అని పిటిషన్‌లో ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ ఈ నెల 24న జస్టిస్‌ జె.శ్రీనివాసరావు ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది.

Updated Date - Mar 23 , 2025 | 04:56 AM