Delhi High Court: జస్టిస్ వర్మపై విచారణ
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:38 AM
ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ డీకే ఉపాధ్యాయ్ శుక్రవారం ఇచ్చిన అంతర్గత విచారణ నివేదిక మేరకు.. శనివారం త్రిసభ్య కమిటీని నియమించారు. సమగ్ర విచారణ జరపనున్న ఈ కమిటీలో పంజాబ్-హరియాణా హైకోర్టు సీజే జస్టిస్ శీల్‌నాగు

ఆదేశాలు జారీ చేసిన సీజేఐ సంజీవ్ ఖన్నా.. సమగ్ర విచారణకు త్రిసభ్య కమిటీ
కమిటీలో పంజాబ్, హిమాచల్ సీజేలు, కర్ణాటక న్యాయమూర్తి
సుప్రీం వెబ్‌సైట్‌లో అంతర్గత కమిటీ నివేదిక, వర్మ వివరణ.. వీడియోలోని ఫొటోలు
2018లోనే వర్మపై ఆర్థిక కేసు.. రూ.97.85 కోట్ల రుణం దుర్వినియోగం
న్యూఢిల్లీ, మార్చి 22: అగ్నిప్రమాదంతో వెలుగులోకి వచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల ఉదంతంపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా విచారణకు ఆదేశించారు. ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ డీకే ఉపాధ్యాయ్ శుక్రవారం ఇచ్చిన అంతర్గత విచారణ నివేదిక మేరకు.. శనివారం త్రిసభ్య కమిటీని నియమించారు. సమగ్ర విచారణ జరపనున్న ఈ కమిటీలో పంజాబ్-హరియాణా హైకోర్టు సీజే జస్టిస్ శీల్‌నాగు, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జీఎస్ సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ ఉన్నారు. వర్మ అంశంపై సుప్రీంకోర్టు ఓ ప్రకటనను విడుదల చేస్తూ.. ‘‘జస్టిస్ యశ్వంత్ వర్మపై తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి’’ అని పేర్కొంది.
ఢిల్లీ హైకోర్టు సీజే ఇచ్చిన నివేదిక, జస్టిస్ వర్మ వివరణ, ఫొటోలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు తెలిపింది.
సుప్రీంకోర్టు ఇలా ఆధారాలను అప్‌లోడ్ చేయడం మొదటిసారి కాగా.. పూర్తి పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో వివరించింది. జస్టిస్ వర్మ వివరణలో.. తాను ఆ క్లిప్పింగ్‌లను చూసి, షాక్‌కు గురైనట్లు తెలిపారు. ‘‘ఆ దృశ్యాలు మా ఇంటి వద్ద జరిగిన ప్రమాదానివి కాదు. నాపై కుట్ర జరిగినట్లు స్పష్టమవుతోంది’’ అని వివరణ ఇచ్చారు. కాగా.. ఈ ఉదంతం వెలుగులోకి రాగానే సీజేఐ కొలీజియం భేటీని ఏర్పాటు చేయడానికి ఓ వీడియో క్లిప్పింగ్ ప్రధాన కారణం అని తెలుస్తోంది. ఈనెల 14న వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వీడియోను చిత్రీకరించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆ క్లిప్పింగ్‌ను ఉన్నతాధికారులకు పంపగా.. వారు సీజేఐకి చేరవేశారు. ఆ క్లిప్పింగ్ ఆధారంగానే వర్మ బదిలీ, అంతర్గత విచారణకు కొలీజియం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలా ప్రకటించలేదు: ఫైర్స్ డీజీ
జస్టిస్ వర్మ ఇంట్లో ఎలాంటి నోట్లకట్టలు లభించలేదని తాను ప్రకటన చేసినట్లు పలు మీడియాల్లో కథనాలు వచ్చాయని, అవి అసత్యమని ఢిల్లీ అగ్నిమాపక విభాగం డైరెక్టర్ జనరల్ అతుల్ గర్గ్ స్పష్టంచేశారు. తాను అలా చెప్పలేదని వివరించారు.
సింభోలీ షుగర్ మిల్స్ కేసులో వర్మ
2018లోనే ఓ ఆర్థిక వ్యవహారంలో వర్మ నిందితుడిగా ఉండగా.. గత ఏడాది ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఉన్న సింభోలీ షుగర్ మిల్స్(ఎ్‌సఎ్‌సఎం)కు వర్మ 2012 వరకు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించేవారు. పరికరాలు, పనిముట్లు అందించే ఉద్దేశంతో చెరుకు రైతులకు నగదు పంపిణీ చేస్తామని పేర్కొంటూ ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వద్ద ఎస్‌ఎ్‌సఎం రూ.97.85 కోట్ల రుణం తీసుకుంది. ఆ మొత్తాన్ని రైతులకు ఇవ్వకుండా.. ఇతర ఖాతాలకు బదిలీ చేసింది. రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో.. 2012లోనే ఈ ఎస్‌ఎ్‌సఎం బ్యాంకు ఖాతాను నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్(ఎన్‌పీఏ) ఆర్‌బీఐ ప్రకటించింది. దీనిపై 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసులో వర్మను పదో నిందితుడిగా సీబీఐ పేర్కొంది. ఆ తర్వాత దర్యాప్తు మందకొడిగా సాగి.. కేసు మూతపడింది. 2024 ఫిబ్రవరిలో ఆ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆ ఆదేశాలను కొట్టివేసింది. దీంతో.. సీబీఐ దర్యాప్తు నిలిచిపోయింది.
ఇదీ.. వర్మ నేపథ్యం..
ప్రయాగ్‌రాజ్‌లో 1969 జన్మించిన యశ్వంత్ వర్మ మధ్యప్రదేశ్‌లోని లా యూనివర్సిటీ నుంచి 1992లో న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. అదే సంవత్సరం అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2006 వరకు అక్కడే ప్రత్యేక న్యాయవాదిగా పనిచేశారు. 2012-13లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు. 2014లో అదనపు న్యాయమూర్తిగా నియమితులై.. 2016లో అలహాబాద్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. 2021 అక్టోబరు 11 నుంచి ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్నారు. కాగా.. శుక్రవారం నుంచి వర్మ సెలవులో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన ఢిల్లీ హైకోర్టులో సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ, కంపెనీ అప్పీళ్లు వంటి కేసులను విచారించే కీలక ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..
WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News