Share News

Mumbai: సైఫ్‌ అలీఖాన్‌కు కత్తిపోట్లు

ABN , Publish Date - Jan 17 , 2025 | 04:42 AM

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై ఓ గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఆరు కత్తిపోట్లకు గురైన సైఫ్‌.. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Mumbai: సైఫ్‌ అలీఖాన్‌కు కత్తిపోట్లు

  • ముంబైలోని ఇంట్లోకి చొరబడి దుండగుడి దాడి

  • మొత్తం 6 చోట్ల కత్తిపోట్లు.. పనిమనిషికీ గాయాలు

  • కారు సిద్ధంగా లేక.. ఆటోలో ఆస్పత్రికి నటుడి తరలింపు

  • వెన్నెముక నుంచి 2.5 అంగుళాల కత్తి అంచు తొలగింపు

  • లీలావతి ఆస్పత్రిలో శస్త్రచికిత్స.. నిలకడగా ఆరోగ్యం

ముంబై, జనవరి 16: బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై ఓ గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఆరు కత్తిపోట్లకు గురైన సైఫ్‌.. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు అత్యవసర శస్త్రచికిత్సలు చేశామని, ప్రాణాపాయం ఏమీ లేదని, రెండ్రోజుల్లో నాన్‌-ఐసీయూ విభాగానికి మారుస్తామని వైద్యులు తెలిపారు. దొంగతనానికి వచ్చిన దుండగుడి ప్రయత్నాన్ని సైఫ్‌ అడ్డుకోవడంతో జరిగిన పెనుగులాటలో కత్తితో దాడి చేసినట్లు ఆ ఇంటి పనిమనిషి చెబుతోంది. ఆమెకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. సైఫ్‌ అలీఖాన్‌ ఇంటి పనిమనిషి ఫిర్యాదు, పోలీసుల కథనం ప్రకారం.. గురుగ్రామ్‌లోని పటౌడీ సంస్థాన వారసుడు, బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ముంబైలోని బాంద్రాలో 12 అంతస్తులు ఉన్న సత్‌గురు శరణ్‌ అపార్ట్‌మెంట్‌లో.. చివరి నాలుగు అంతస్తుల్లో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి ఆయన భార్య, బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌, కుమారులు జహంగీర్‌ అలీఖాన్‌, తైమూర్‌ అలీఖాన్‌తో నిద్రకు ఉపక్రమించారు. వీరు ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది.


అయితే.. రాత్రి 2 గంటల సమయంలో ఓ దుండగుడు అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు కిందకు దిగేందుకు ఉపకరించే ఎమర్జెన్సీ మార్గం నుంచి సైఫ్‌ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ మార్గం సైఫ్‌ కుమారుడు జహంగీర్‌ గదికి అనుసంధానమై ఉంటుంది. జహంగీర్‌ తన తల్లిదండ్రుల వద్దే ఉండడం.. ఆ గదిలో అలికిడి రావడంతో పనిమనిషి నిద్రలేచి, అక్కడికి వెళ్లింది. జహంగీర్‌ గదిలో దుండగుడు నక్కి ఉండడంతో.. ‘‘దొంగ.. దొంగ..’’ అంటూ గట్టిగా కేకలు వేసింది. దాంతో నిద్ర లేచిన సైఫ్‌.. ఆ గదికి చేరుకున్నాడు. అప్పటికే ఆ దుండుగు పనిమనిషిని గట్టిగా పట్టుకుని, మెడపై కత్తి పెట్టి సైఫ్‌ను బెదిరించాడు. ‘‘రూ. కోటిన్నర ఇస్తేనే ఆమెను వదులుతాను’’ అంటూ హెచ్చరించాడు. దీంతో సైఫ్‌ దుండగుడితో తలపడ్డారు. ఈ క్రమంలో పెనుగులాట జరిగింది. తేరుకున్న దుండగుడు కత్తితో సైఫ్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ అలికిడితో కరీనా, ఇద్దరు పిల్లలు, మరో పనిమనిషి అక్కడికి వచ్చేసరికి దుండగుడు వచ్చిన మార్గంలోనే పరారవ్వగా.. సైఫ్‌ రక్తమోడుతూ కనిపించారు.


సైఫ్‌ వెన్నెముక, మెడ భాగంలో లోతుగా కత్తిపోట్లు కాగా.. చేతిపై, భుజంపై మరో నాలుగు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే సైఫ్‌ను లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో కారు సిద్ధంగా లేకపోవడంతో లేకపోవడంతో.. సైఫ్‌ను ఆటోలో తీసుకెళ్లారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు భారత న్యాయ సంహిత(బీఎన్‌ఎ్‌స)లోని సెక్షన్లు 311(దోపిడీ యత్నం, హత్యాయత్నం, తీవ్రంగా గాయపరచడం), 331(4) (అనుమతి లేకుండా ఇంట్లోకి చొరబాటు, చోరీ యత్నం) కింద కేసు నమోదు చేశారు. ఆ వెంటనే కేసును ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌కి బదిలీ చేశారు. సైఫ్‌ ఉంటున్న సద్గురు శరణ్‌ అపార్ట్‌మెంట్‌ సీసీకెమెరాల ఫుటేజీని జల్లెడపట్టిన పోలీసులు.. నిందితుడి ఫొటోను మీడియాకు విడుదల చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్లూస్‌టీమ్‌ కీలక ఆధారాలను సేకరించగా.. స్నిఫర్‌ డాగ్స్‌తో దర్యాప్తు కొనసాగించారు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా పేరున్న దయానాయక్‌ కూడా సైఫ్‌ ఇంటిని పరిశీలించారు. ఈ దర్యాప్తులో ఆయన కూడా పాలుపంచుకుంటారని తెలుస్తోంది. కొంతకాలంగా అపార్ట్‌మెంట్‌ ఉన్న హౌసింగ్‌ సొసైటీలో పలు ఇళ్లకు మరమ్మతులు జరుగుతున్నాయని, అక్కడ పనిచేస్తున్న కార్మికులను కూడా ప్రశ్నిస్తున్నామని పోలీసులు వివరించారు.


రాజకీయ రచ్చ?

సైఫ్‌ అలీఖాన్‌పై దాడి ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ముంబైలో సెలబ్రిటీలకే భద్ర త లేకుంటే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఎన్‌సీపీ(ఎ్‌సపీ) చీఫ్‌ శరద్‌పవార్‌ ప్రశ్నించారు. శాంతిభద్రతలు అదుపుతప్పాయని విమర్శించారు. గత ఏడాది బాంద్రాలోనే ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్యకు గురైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం సీఎం ఫడణవీస్‌ వద్దే హోం శాఖ ఉన్న విషయం తెలిసిందే..! ముంబైలో ఎవరూ సురక్షితంగా లేరని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్‌రౌత్‌ ఆరోపించారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోలే కూడా హోంశాఖను తనవద్ద పెట్టుకున్న ముఖ్యమంత్రి ఫడణవీస్‌ శాంతిభద్రతల విషయంలో దారుణంగా విఫలమయ్యారంటూ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఈ ఘటనపై విస్మయం వ్యక్తం చేశా రు. సైఫ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


సైఫ్‌ క్షేమం

తీవ్ర గాయాలపాలైన సైఫ్‌ అలీఖాన్‌కు లీలావతి ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ నితిన్‌ డాంగే(న్యూరో సర్జన్‌), డాక్టర్‌ లీనా జైన్‌(కాస్మెటిక్‌ సర్జన్‌), డాక్టర్‌ నిషా గాంధీ(అనస్థీషియాలజిస్టు) రెండున్నర గంటల పాటు శ్రమించి, శస్త్రచికిత్స చేశారు. 2.5 అంగుళాల పొడవున్న కత్తి ముక్కను సైఫ్‌ వెన్నెముఖ నుంచి తొలగించామని వైద్యులు పేర్కొన్నారు. ‘‘తెల్లవారుజామున 3 గంటల సమయంలో సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. రెండ్రోజుల్లో కోలుకుంటారు. ఆ తర్వాత ఆయనను నాన్‌-ఐసీయూ వార్డుకు తరలిస్తాం’’ అని లీలావతి ఆస్పత్రి సీవోవో డాక్టర్‌ నీరజ్‌ వెల్లడించారు. వెన్నెముక గాయాన్ని సరిచేసి, లీకైన ఫ్లూయిడ్లను సరిచేశామన్నారు. చేతికి, మెడకు ప్లాస్టిక్‌ సర్జరీలు చేశామని తెలిపారు. కాగా.. ఆస్పత్రి వద్ద సైఫ్‌, కరీనా టీమ్‌లు మీడియాతో మాట్లాడాయి. ఈ దాడి విషయంలో మీడి యా సంయమనం పాటించాలని కోరాయి. సైఫ్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తామన్నాయి.

Updated Date - Jan 17 , 2025 | 04:43 AM