Legal Controversy: అలహాబాద్ హైకోర్టు తీర్పు ఆందోళనకరం
ABN , Publish Date - Mar 22 , 2025 | 05:47 AM
మైనర్ బాలిక ఛాతీపై చేయి వేసినా, ఆమె ధరించిన పైజామా తాడు లాగినా దానిని రేప్, అత్యాచార యత్నంగా పరిగణించబోరంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.

బాలిక పైజామా తాడు లాగినా రేప్ కిందికి రాదనడం సరికాదు
సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి
న్యూఢిల్లీ, మార్చి 21: మైనర్ బాలిక ఛాతీపై చేయి వేసినా, ఆమె ధరించిన పైజామా తాడు లాగినా దానిని రేప్, అత్యాచార యత్నంగా పరిగణించబోరంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రమైన ప్రభావం చూపే ఈ తీర్పులో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును కోరింది. శుక్రవారం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పును తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. నాగరిక సమాజంలో ఇలాంటి తీర్పులకు చోటు లేదని అన్నారు. 2011లో 11 ఏళ్ల బాలికను ఇద్దరు యువకులు (21 ఏళ్లు) వంతెన కిందికి తీసుకెళ్లి ఆమె ఛాతీపై చేయి వేయడంతో పాటు, ఆమె ధరించిన పైజామా తాడును లాగారు. అదే సమయంలో ఎవరో వస్తుండడాన్ని చూసి పారిపోయారు.
పోలీసులు వారిద్దరిపై ఐపీసీలోని సెక్షన్ 376 (రేప్), పోక్సో చట్టంలోని సెక్షన్ 18 (నేరం చేసేందుకు ప్రయత్నించడం) కింద కేసులు పెట్టారు. కానీ, అలహాబాద్ హైకోర్టు.. వారు అత్యాచారం చేయడానికి ప్రయత్నించినట్టు కనిపించడం లేదని భావించి.. తక్కువ శిక్షలు పడే ఐపీసీ సెక్షన్ 354బీ(దుస్తులు లాగేందుకు బలవంతంగా ప్రయత్నించడం), పోక్సో చట్టంలోని సెక్షన్ 9/10 (లైంగికదాడికి పాల్పడడం) కింద మళ్లీ కేసు పెట్టాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.