Share News

US layoffs: కొలువు కష్టాలు

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:49 AM

అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయి భారత్‌కు వచ్చిన ఎన్నారైల‌కు ఇక్కడ సరైన అవకాశాలు దొరకడం లేదు. భారతీయ కంపెనీలు వారిని అధిక జీతాలతో నియమించడానికి ఇష్టపడకపోవడంతో, వారిని తక్కువ జీతాలతో స్థానిక అభ్యర్థులతో భర్తీ చేస్తున్నాయి.

US layoffs: కొలువు కష్టాలు

అమెరికా పొమ్మంటోంది..

భారత్‌లో భరోసా లేదు!

అమెరికా నుంచి తిరిగొస్తున్నవారికి ఇక్కడ ఉద్యోగాలు రావడం కష్టంగా మారిన వైనం

ఐటీ సంబంధిత రంగాల్లో కాస్తంత మెరుగు

మెకానికల్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌లో కష్టమే!

ఉద్యోగం వచ్చినా.. జీతం తక్కువని ఆవేదన

కొలువులున్నాయి గానీ.. వారే డాలర్ల లెక్కలో జీతాలు ఆశిస్తున్నారు: హెచ్‌ఆర్‌ మేనేజర్లు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక మాంద్యం కారణంగా అమెరికాలో కొలువుల కోతతో రెండేళ్లుగా కుదేలవుతున్న మనోళ్లకు.. ట్రంప్‌ రాకతో మరింత గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి! అక్కడ ఉంటే ఏ క్షణంలో ఉద్యోగం పోతుందో తెలియక.. అలాగని ధైర్యం చేసి భారత్‌కు రాలేక అక్కడే సర్దుకుపోతున్నవారు కొందరు! ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదని వాపోతున్నవారు మరికొందరు!! ఉద్యోగం కోల్పోయి తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌కు వచ్చి ఉద్యోగాల వేట మొదలుపెడుతున్నవారు ఇంకొందరు!! ఉదాహరణకు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజ్‌ (పేరు మార్పు) ఎంఎస్‌ చేయడానికి ఏడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. మాస్టర్స్‌ డిగ్రీ పూర్తయిన వెంటనే ఓ కంపెనీలో ఉద్యోగం కూడా చేరాడు. అతడి నెల సంపాదన మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే ఆరు లక్షల రూపాయలకు పై మాటే! కానీ, ఆర్థిక మాంద్యం కారణంగా గత ఏడాది అతడి ఉద్యోగం పోయింది.

fgjh.gif

ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడికి వచ్చాక.. గత ఆరు నెలలుగా అతడు హైదరాబాద్‌, బెంగళూరు, గుర్‌గావ్‌ లాంటి ప్రాంతాలలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, ఇప్పటిదాకా అతణ్ని ఇంటర్వ్యూకు పిలిచిన వారి సంఖ్య కేవలం ఐదు లోపే. ఆ ఇంటర్వ్యూలకు వెళ్లినా ఉద్యోగం రాలేదు.


నెలకు రూ.లక్ష ఇచ్చినా చాలంటున్నా తనకు ఉద్యోగం ఇచ్చేవారే కరవయ్యారని అతడు వాపోతున్నాడు. ఇలాంటి వారు ప్రస్తుతం మన దేశంలో చాలా మందే ఉన్నారు. ‘‘యూఎ్‌సలో ఎంఎస్‌ చేశాం. ఫలానా దిగ్గజ సంస్థలో అమెరికాలో ఉద్యోగం చేశాం’’ అని రెజ్యూమ్‌లో ఉంటే, వారిని అసలు ఇంటర్వ్యూకే పిలవని పరిస్థితి ఉంది. అలాగే.. ఉద్యోగంలో భాగంగా ఇక్కణ్నుంచీ మనోళ్లను అమెరికాకు తీసుకెళ్లిన సంస్థలు.. హెచ్‌1బీ వీసా గడువు ముగిసిన వారిని అక్కడ కొనసాగించడానికి ఇష్టపడట్లేదు. దీనితో తప్పనిసరి పరిస్థితిల్లో ఇండియాకు వచ్చిన వారు అదే కంపెనీ భారతీయ శాఖలో కొనసాగడం ఇష్టం లేకపోతే ఇతర కంపెనీల వైపు దృష్టి సారిస్తున్నారు. అలాంటివారందరికీఇప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయంటున్నారు హెచ్‌ఆర్‌ మేనేజర్లు. ఈ సమస్యను ఎదుర్కొంటున్న వందలాది మంది.. రెడిట్‌, లింక్డిన్‌ లాంటి వెబ్‌సైట్లలో ఏకరువు పెడుతున్న కష్టాలే ఇందుకు నిదర్శనం.

డాలర్లలో అడిగితే ఎలా?

ఇండియాస్‌ గ్రాడ్యుయేట్‌ స్కిల్స్‌ ఇండెక్స్‌ 2025 నివేదిక ప్రకారం.. మన పట్టభద్రుల్లో కేవలం 42.6శాతం మంది మాత్రమే ఉద్యోగార్హత (అంటే డిగ్రీతోపాటు.. ఆ ఉద్యోగానికి కావాల్సిన అన్ని నైపుణ్యాలూ కలిగి ఉండడం) కలిగి ఉన్నారు. ఏఐ, డేటా ఎనలిటిక్స్‌ వంటి అంశాల్లో నైపుణ్యం సంపాదించినవారికి ఇప్పుడు డిమాండ్‌ అధికంగా ఉన్నప్పటికీ, వాటిని కలిగి ఉన్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. దీనికి తోడు.. సమస్యలను నేర్పుగా పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకత వంటి విషయాల్లో కూడా మనవాళ్లు వెనకబడి ఉంటున్నారని హెచ్‌ఆర్‌ మేనేజర్లు చెబుతున్నారు. విదేశాల నుంచి వస్తున్నవారిలోనూ ఈ నైపుణ్యాల కొరత ఉంటోందని.. వారికి అధిక జీతాలిచ్చే బదులు ఇక్కడి ఔత్సాహికులకు అందులో 50ు జీతం ఇచ్చి, తగిన శిక్షణ ఇస్తే వారితో సమర్థంగా పనిచేయించుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ‘‘విదేశాల నుంచి వచ్చేవారు.. భారతీయ కంపెనీలకు ఏం కావాలో అర్ధం చేసుకోవాలి. అలాగే తాము పనిచేయాలనుకుంటున్న రంగం గురించి కొంత పరిశోధన చేస్తే తమకు ఉన్న అవకాశాలు, తమ నైపుణ్యం, అనుభవానికి తగిన ఉద్యోగం లభిస్తుంది. దురదృష్టవశాత్తు చాలామంది ఇవేవీ చేయట్లేదు.


అందుకే వారికి ఉద్యోగం లభించడం కాస్త కష్టంగా మారుతోంది’’ అని మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థకు చెందిన హెచ్‌ఆర్‌ మేనేజర్‌ దినేష్‌ సూచించారు. అయితే ఆ వాదనలో వాస్తవం కొంత మేర మాత్రమే ఉందంటున్నారు ఉద్యోగార్థులు. ఉదాహరణకు.. బయోటెక్నాలజీ రంగానికి సంబంధించి యూఎస్‌, ఆస్ట్రేలియా దేశాల్లో పలు పరిశోధనలు చేసిన తాను ఆ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతున్న నేపథ్యంలో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చానని, ఇక్కడ పేరొందిన కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థల్లో శిక్షణ కూడా పొందానని.. కానీ ఇక్కడ తనకు సరైన అవకాశాలే రాలేదని, జీతం కూడా చాలా తక్కువగా ఆఫర్‌ చేశారని అను (పేరు మార్చాం) అనే యువతి వివరించారు. అయితే.. ఇలా విదేశాల నుంచి వచ్చేవారు డాలర్ల లెక్కలు వేసి, ఆ స్థాయిలో జీతం కావాలని కోరుకుంటారని.. అందుకే వారికి ఉద్యోగాలు రావడం కష్టమవుతోందని.. ఒక ఫార్మా కంపెనీలో సీనియర్‌ లెవల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న నారాయణ వివరించారు. ఐటీ, బీటీ (బయోటెక్నాలజీ) పరిస్థితి ఇలా ఉంటే.. మెకానికల్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌ వంటి రంగాల్లో అయితే అసలు అవకాశాలే తక్కువగా ఉన్నాయని మరికొందరు వాపోతున్నారు. ఉదాహరణకు.. మెకానికల్‌ ఇంజినీరింగ్‌తోపాటు పీహెచ్‌డీ కూడా పూర్తి చేసి అమెరికాలో ఎనిమిదేళ్లు ఉద్యోగం చేసిన ఒక వ్యక్తి.. భారత్‌లో ఐఐటీలు సహా పలు సంస్ధలలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినా ఆయన్ను పట్టించుకున్నవారే లేరు.


నెట్‌వర్క్‌ పెంచుకోవాలి

ఐటీ సంబంధిత రంగాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ తదితర నైపుణ్యాలు కలిగి ఉండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. కాబట్టి అభ్యర్థులు తమ నైపుణ్యాలకు పదునుపెట్టాలి. డిమాండ్‌లో ఉన్న నైపుణ్యాలను పొందడానికి ప్రయత్నించాలి.

చాలావరకూ ఉద్యోగాలు మనం పెంచుకునే నెట్‌వర్క్‌ ద్వారానే వస్తాయి. మరీ ముఖ్యంగా ఐటీ, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో పరిచయాలు బాగా పనిచేస్తాయి. కాబట్టి ఆ దిశగా దృష్టి సారించడం మంచిది.

ప్రత్యేకంగా ఎన్‌ఆర్‌ఐల కోసమే కొన్ని ఉద్యోగ వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా ప్రయత్నించాలి. అలాగే రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీల ద్వారా ప్రయత్నించవచ్చు.

ఇండియాలో స్టార్టప్‌ సంస్కృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. విదేశాల్లో అపార అనుభవం సంపాదించి ఇక్కడికి వచ్చినవారు ఉద్యోగాలకు ప్రయత్నించేబదులు స్టార్టప్‌ ఆలోచనలు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ

Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు

For National News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 02:50 AM