Delhi Assembly Elections: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం
ABN , Publish Date - Jan 28 , 2025 | 04:46 PM
Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వరుసగా మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని ఆప్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక ఆప్ పాలనకు గండి కొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుంది.

న్యూఢిల్లీ, జనవరి 28: మరికొద్ది రోజుల్లో న్యూఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఆయితే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు మద్దతుగా సమాజ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌తోపాటు ఆ పార్టీ ఎంపీలు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించారు.
జనవరి 30వ తేదీన తాను రితాలలో రోడ్ షో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోడ్ షోలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొంటారని చెప్పారు. అలాగే ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు.. ఈ ఎన్నికల్లో ఆప్‌కి మద్దతుగా ప్రచారం చేస్తారని వివరించారు. మరోవైపు ఆమ్ ఆద్మీ, సమాజ వాదీ, కాంగ్రెస్‌లు ఇండియా కూటమిలో భాగస్వామి పార్టీలుగా ఉన్నాయి. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఎస్పీ నేతలు ఆప్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
గతేడాది లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7 లోక్ సభ స్థానాల్లో ఆప్ నలుగురు, కాంగ్రెస్ పార్టీ ముగ్గురు అభ్యర్థులను బరిలో నిలిపింది. అయితే ఈ ఎన్నికల్లో ఈ మొత్తం స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తూ.. అభ్యర్థులను రంగంలోకి దింపాయి.
Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..
ఇండియా కూటమికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వం వహించాలని ఆ భాగస్వామ్యంలోని పలు పార్టీల నేతలు సూచించారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో చీలికలు ఏర్పడ్డిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీకి అరవింద్ కేజ్రీవాల్ తన మద్దతు తెలుప లేదు.
అయితే చర్చల అనంతరం ఇండియా బ్లాక్ నాయకులు ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకోవచ్చని కేజ్రీవాల్ గతంలో అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఇక ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రముఖ నటుడు శతృఘ్న సిన్హా ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 1, 2వ తేదీల్లో ఆప్ అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ సిన్హా ప్రచారం నిర్వహించనున్నారు.
70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన వెలువడనున్నాయి. అయితే 2013 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఢిల్లీ ఓటరు పట్టం కట్టనున్నాడనేది సర్వత్ర తీవ్ర ఆసక్తి రేపుతోంది.
For National News And Telugu News