Love Marriage: ప్రేమ కోసం ఇంటి నుంచి పారిపోయారు.. కట్ చేస్తే 64 ఏళ్ల తర్వాత
ABN , Publish Date - Mar 27 , 2025 | 07:17 AM
ప్రేమ, పెద్దలు కుదిర్చిన వివాహం.. ఏదైనా సరే.. చాలా చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. సర్దుకుపోదాం.. బంధాన్ని నిలుపుకుందాం అనే ఆలోచన కనుమరుగువుతుంది.. కనీసం పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా.. విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అదుగో అలాంటి వారందరూ ఈ దంపతుల గురించి తెలుసుకోవాలి. వారి జీవతం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి.

ప్రేమ, పెళ్లి అనే బంధాలు కూడా నేటి కాలంలో చాలా కమర్షియల్ అయ్యాయి. లెక్కలు చూసుకుని మరి ప్రేమించేవారి సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుత కాలంలో ప్రేమ కోసం.. అయితే చనిపోతున్నారు.. లేదంటే చంపేస్తున్నారు తప్ప కలిసి బతికే ప్రయత్నం చేస్తున్నవారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు . పెద్దలను ఒప్పించి, ఎదిరించి పెళ్లి చేసుకున్న వారు సైతం ఆ బంధాన్ని కలకలం నిలబెట్టుకోలేకపోతున్నారు. అలాంటి వారందరూ ఈ దంపతుల ప్రేమ కథ గురించి తెలుసుకోవాలి. సుమారు 64 ఏళ్ల క్రితమే తమ ప్రేమను బతికించుకోవడం కోసం ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరి చేయి ఒకరు విడవలేదు. పిల్లలు, వారి పిల్లలతో ఎంతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఎవరూ లేకుండా.. తామిద్దరే పెళ్లి చేసుకున్న ఆ జంటకు.. నేడు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి మరోసారి ఘనంగా పెళ్లి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
ఈ అందమైన పెళ్లి వేడుక గుజరాత్‌లో చోటు చేసుకుంది. వీరి ముచ్చటైన ప్రేమ కథ 1961లో మొదలైంది. జైన కుటుంబానికి చెందిన హర్ష్, బ్రాహ్మిణ సమాజానికి వర్గానికి చెందిన మృదు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. సెలఫోన్స్ లేని కాలంలో.. ఉత్తరాలతో ఊసులాడుకున్నారు. కళ్లతోనే కబుర్లు చెప్పుకున్నారు. 1961 కాలం అంటే సమాజంలో ఎంతటి కఠినమైన ఆంక్షలు ఉండేవో అర్థం చేసుకోవచ్చు.
కానీ ఆ పరిస్థితులు ఏవి వారిని భయపెట్టలేదు. ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి ఉండాలని భావించారు. అయితే ఇరు కుటుంబాలు తమ ప్రేమను అంగీకరిస్తాయని వారికి ఏమాత్రం నమ్మకం లేదు. కానీ వారి బాధ్యతగా తమ ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పారు. ముందుగా ఊహించినట్లే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
పెద్దలు తమ ప్రేమను అంగీకరించరు అని భావించిన దంపతులు.. తమ ప్రేమను బతికించుకవడం కోసం ఇంటి నుంచి పారిపోయారు. వారికి వారే పెళ్లి పెద్దలుగా మారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ సమయంలో మృదు ధరించిన పెళ్లి చీర ఖరీదు కేవలం 10 రూపాయలు. అంత సింపుల్‌గా వారి పెళ్లి జరిగింది.
వివాహం చేసుకున్న తర్వాత జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. ఒకరి చేయి ఒకరు విడవకూడదని పెళ్లి నాడే ప్రమాణం చేసుకున్నారు. అలా మొదలైన వారి వైవాహిక బంధం.. 64 ఏళ్ల పాటు ఆనందంగా కొనసాగింది. ఎన్ని కష్టాలు వచ్చినా వారు విడిపోలేదు. పిల్లలను కని, పెంచి పెద్ద చేసి వారికి మంచి జీవితాన్ని అందించారు. ఇద్దరుగా మొదలైన వారి కుటుంబం.. కొడుకులు, కోడళ్లు, బిడ్డలు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లతో పెద్ద కుటుంబంగా మారింది.
హర్ష్, మృదుల వివాహం అయ్యి 64 ఏళ్లు పూర్తయ్యాయి. ఒకప్పుడు వారి పెళ్లి ఎంత సింపుల్‌గా జరిగిందో కుటుంబంలోని అందరికి తెలుసు. అందుకే షష్టిపూర్తి ఘనంగా చేయాలని భావించారు. పెళ్లి గురించి ప్రతి ఒక్కరు ఎలాంటి కలలు కంటారో.. అంతే ఘనంగా తమ తల్లిదండ్రులకు పెళ్లి చేయాలని భావించిన కుటుంబ సభ్యులు.. అంగరంగ వైభవంగా వారి వివాహ వేడుకను జరిపించారు. ఒకప్పుడు తామిద్దరే పాల్గొన్న పెళ్లి వేడుకలో.. నేడు కుటుంబం అంతా కలిసి దగ్గరుండి వారికి మరోసారి పెళ్లి చేసి.. ఆ దంపతులకు జీవితంలో మరపురాని బహుమతిని అందించారు. ఇక వీరి అందమైన వివాహ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. హర్ష్, మృదుల లవ్ స్టోరీ తెలుసుకున్న ప్రతి ఒక్కరు.. మాటలు లేవు.. మీరు ఈతరానికి ఆదర్శం అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:
ఎట్టకేలకు ఆమె ఆట కట్టించేశారుగా. ఏం జరిగిందంటే...
శబరిమలలో పూజ.. వివాదంలో మలయాళ సూపర్ స్టార్స్..