Justice Yashwant Verma: నోట్ల కట్టల వీడియోలు డిలీట్ చేయండి!
ABN , Publish Date - Mar 27 , 2025 | 05:18 AM
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తీసిన వీడియోలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగించారని వార్తలు వెలువడ్డాయి. న్యాయ నిపుణులు దీన్ని సాక్ష్యాధారాల ధ్వంసంగా చూస్తున్నారు. meanwhile, జడ్జి బదిలీని వ్యతిరేకిస్తూ అలహాబాద్ హైకోర్ట్ బార్ అసోసియేషన్ నిరవధిక సమ్మె చేపట్టింది.

ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశం?
ప్రమాదం జరిగిన రోజు నన్ను లోపలికి రానివ్వలేదు
నాడు అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం
జస్టిస్ వర్మ ఇంటికెళ్లి పరిశీలించిన ఢిల్లీ పోలీసులు
ఆయనపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలంటూ వేసిన
పిల్‌పై అత్యవసర విచారణకు నో అన్న సుప్రీంకోర్టు
రిజిజును కలిసిన అలహాబాద్ హైకోర్టు లాయర్లు
న్యూఢిల్లీ, మార్చి 26: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం వార్త తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు.. సగం కాలిన నోట్ల కట్టలకు సంబంధించి పలు వీడియోలు తీశారని, కానీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని తమ ఫోన్లలోంచి డిలీట్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ రిపబ్లిక్ వార్తాసంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. ఆ వీడియోల తాలూకు కాపీలు తీయొద్దని, వాటిని ఎవరికీ పంపించొద్దని పై అధికారుల నుంచి వారికి కఠిన ఆదేశాలు వచ్చినట్టు అందులో పేర్కొంది. నిజంగానే ఉన్నతాధికారులు అలా డిలీట్ చేయాలని ఆదేశించి ఉంటే అది సాక్ష్యాధారాల ధ్వంసం కిందికే వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు.. అగ్నిప్రమాదం జరిగిన రోజు తనను స్టోర్‌రూమ్‌లోకి రాకుండా అడ్డుకున్నారని నాడు జడ్జి ఇంటి వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం ప్రజల అనుమానాలను మరింతగా పెంచుతోంది. ఆరోజు అగ్నిమాపక శాఖకు చెందిన ఆరుగురు అధికారులను, ఐదుగురు పోలీసు అధికారులను మాత్రమే స్టోర్‌రూమ్‌లోకి అనుమతించారని ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆ కానిస్టేబుల్ పేర్కొన్నట్టు సమాచారం.
కాగా, ఢిల్లీ పోలీసులు బుధవారం జడ్జి ఇంటికి వెళ్లి, ఘటనాస్థలిని పరిశీలించారు. అక్కడ కొన్ని ఫొటోలు తీసుకుని.. ప్రమాదం జరిగినరోజు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలు సేకరించారు. మరోవైపు.. జస్టిస్ వర్మపై ఎఫ్‌ఐఆర్ దాఖలుకు అనుమతివ్వాలంటూ తాను దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలంటూ న్యాయవాది మాథ్యూస్ జె నెడుంపర చేసిన విజ్ఞప్తిని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. బుధవారం సుప్రీంకోర్టులో ధర్మాసనం ముందు నెడుంపర ఈ అంశం గురించి ప్రస్తావించారు. జడ్జి ఇంటి ప్రాంగణంలో నోట్లకట్టల వ్యవహారంపై 25 పేజీల సమగ్ర డాక్యుమెంట్‌ను ప్రజాబాహుళ్యానికి అందుబాటులోకి తేవడం ద్వారా సుప్రీంకోర్టు అద్భుతమైన పనిచేసిందని.. అయితే, ఈ అంశం విస్తృత ప్రజాప్రయోజనాలతో ముడిపడి ఉన్నందున తన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని కోరారు. దీనికి సీజేఐ ‘‘బహిరంగ ప్రకటనలు చేయొద్దు’’ అని వారించారు. ఈ వ్యాజ్యంలో సహ పిటిషనర్‌గా ఉన్న ఒక మహిళ.. ‘‘ఇదే ఒక సాధారణ పౌరుడిపై కేసు నమోదై ఉంటే సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు అతడి వెంటపడేవి’’ అని చెబుతుండగా సీజేఐ మధ్యలో జోక్యం చేసుకుని ఆపేశారు. నిర్ణీత విధానం ప్రకారమే ఆ పిల్ విచారణకు వస్తుందని స్పష్టం చేశారు. ఇక.. జస్టిస్ వర్మ బదిలీని నిరసిస్తూ నిరవధిక సమ్మెకు దిగిన అలహాబాద్ హైకోర్ట్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం కేంద్ర న్యాయమంత్రి కిరెన్ రిజిజును కలిశారు. దాదాపు రెండు గంటలపాటు ఆయనతో సమావేశమయ్యారు.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..