Share News

UPI : యూపీఐ సేవల్లో అంతరాయం

ABN , Publish Date - Mar 27 , 2025 | 05:15 AM

బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు యూపీఐ సేవలు సర్వర్‌ సమస్య వల్ల నిలిచిపోయాయి. చెల్లింపులు నిలిచిపోవడంతో ప్రజలు ఏటీఎంలకు పరుగులు తీశారు. సమస్య పరిష్కరించామని ఎన్‌పీసీఐ తెలిపింది.

UPI : యూపీఐ సేవల్లో అంతరాయం

దేశవ్యాప్తంగా కొన్ని గంటలపాటు నిలిచిన లావాదేవీలు

పేమెంట్‌ యాప్స్‌ పనిచేయక తీవ్రంగా ఇబ్బందిపడ్డ ప్రజలు

డబ్బు కోసం ఏటీఎంల వద్దకు పరుగులు.. వ్యాపారాలపై దెబ్బ

హైదరాబాద్‌ సిటీ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి దాదాపు రాత్రి 8.30 గంటల దాకా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సర్వర్‌ డౌన్‌ కావడంతో చెల్లింపులు జరగక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిరాక్స్‌ దుకాణాల్లో రూ.2 చెల్లించడానికి సైతం ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి పేమెంట్‌ యాప్స్‌పై ఆధారపడుతూ, వాటికి అలవాటుపడిపోయిన ప్రజలు.. కొంతసేపు అవి పనిచేయకపోవడంతో డబ్బుల కోసం ఏటీఎంల వద్దకు పరుగులు తీశారు. కొవిడ్‌ సమయంలో పెరగడం మొదలైన యూపీఐ చెల్లింపులు ఆ తర్వాత కాలంలో బాగా ఊపందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో ప్రజలు దాదాపు 90 శాతం చెల్లింపులు పేమెంట్‌ యాప్స్‌ ద్వారానే చేస్తున్నారు. అంతటి కీలకమైన యూపీఐ సేవలకు అంతరాయం.. అందునా వ్యాపారాలు జోరుగా సాగే సాయంత్రం సమయంలో కలగడంతో.. హోటళ్లు, కిరాణాషాపులు, షాపింగ్‌ మాల్స్‌, చిరువ్యాపారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ సమస్యపై సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. దీంతో ఎక్స్‌లో ‘యూపీఐడౌన్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ వైరల్‌ అయ్యింది. ఔటేజ్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ డౌన్‌డిటెక్టర్‌ ప్రకారం రాత్రి 7.40 గంటల సమయంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.అయితే.. ఈ సమస్యను పరిష్కరించామని, సేవల్లో అంతరాయానికి చింతిస్తున్నామని ఎన్‌పీసీఐ బుధవారం రాత్రి 8.42 గంటల సమయంలో ఎక్స్‌ ద్వారా తెలిపింది.

Updated Date - Mar 27 , 2025 | 05:15 AM