Maha Kumbh culmination today: కుంభమేళా చివరి రోజు.. అమృత స్నానం కోసం పోటెత్తుతున్న భక్తులు
ABN , Publish Date - Feb 26 , 2025 | 09:40 AM
నేటితో మహాకుంభమేళా ముగియనుండటంతో భక్తులు చివరి అమృతస్నానం కోసం ప్రయాగ్‌రాజ్‌కు పోటెత్తుతున్నారు. మహా శివరాత్రి రోజున పుణ్యస్నానం ఆచరించి తరిస్తున్నారు.

శివరాత్రితో (Maha shivarathri మహాకుంభమేళా ముగియనున్న నేపథ్యంలో భక్తులు చివరి అమృత స్నానం కోసం త్రివేణీ సంగమానికి పోటెత్తుతున్నారు. వేల కొద్దీ భక్తులు పుణ్య స్నానం కోసం బారులు తీరారు. కుంభమేళాలో మహాశివరాత్రి పర్వదినానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజున పుణ్య స్నానంతో మోక్షం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. హిందూ పురాణాల ప్రకారం, సముద్ర మథనం సందర్భంగా జనించిన హాలాహలాన్ని పరమశివుడు స్వీకరించి గరళ కంఠుడిగా మరాడు. ఇక సముద్రగర్భం నుంచి ఉద్భవించిన అమృతభాండం నుంచి చిలికిన బిందులు త్రివేణీ సంగమంలో పడ్డాయని భక్తులు నమ్ముతారు (Maha Kumbh culmination today).
ఇక కుంభమేళా చివరి రోజున త్రివేణి సంగమనంలో ఇప్పటివరకూ 41.11 లక్షల మంది పుణ్యస్నానం ఆచరించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం మొత్తం కోటి మంచి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానంతో తరిస్తారని అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ అమృత స్నానానికి విచ్చేస్తున్న భక్తులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. పరమశివుడి దీవెనలు భక్తులందరికీ అందాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇక బ్రహ్మ ముహుర్తంలో స్నానం కోసం అర్ధరాత్రి నుంచే భక్తులు త్రివేణి సంగమానికి చేరుకున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముహూర్తం సమీపించే వరకూ ఓపిగ్గా వేచి చూశారని తెలిపాయి. కొందరు ముహూర్తానికంటే ముందే పుణ్య స్నానం చేశారని కూడా వెల్లడించాయి. మహాకుంభమేళాలో ఇప్పటివరకూ ఆరు ప్రత్యేక పుణ్య స్నానాల తిథులు వచ్చి వెళ్లాయి. పుష్య పౌర్ణమి (జనవరి 13), మకర సంక్రాంతి (జనవరి 14), మౌనీ అమావాస్య (జనవరి 29), వసంత పంచమి (ఫిబ్రవరి 3), మాఘ పూర్ణిమ (ఫిబ్రవరి 12), మహా శివరాత్రి (ఫివ్రవరి 26). వీటిల్లో సగాన్ని షాహీ స్నానాలు (రాజ స్నానాలు), మిగతా వాటిని అమృత స్నానాలు అని పిలుస్తారు.
The Fertility Shiva Temple: ఈ శివాలయాన్ని దర్శిస్తే పిల్లలు పుడతారంట.. ఎక్కడుందో తెలుసా..
ఇక మంగళవారం త్రివేణి సంగమంతో పాటు ఇతర ఘాట్‌లల్లో దాదాపు 1.33 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. దీంతో, ఈసారి కుంభమేళాను సదర్శించిన వారి సంఖ్య 65 కోట్లు దాటే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక చివరి రోజున భక్త జన సందోహం పోటెత్తే అవకాశం ఉండటంతో ప్రయాగ్‌రాజ్‌లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాత్రంతా అధికారులు హైలర్ట్‌లో ఉన్నారు. పోలీసులు, పారామిలిటరీ దళాలు, విపత్తు నిర్వహణ దళాలను భారీగా మోహరించారు. రద్దీపై పటిష్ఠ నిఘా కోసం ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. అత్యవసర సందర్భాల్లో తక్షణం స్పందించేందుకు వీలుగా మెడికల్ టీమ్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు వ్యూహాత్మక ప్రదేశాల్లో రెడీగా ఉంచారు. నేటి రద్దీ దృష్ట్యా ప్రయాగ్‌రాజ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో అధికారులు వాహనాలను అనుమతించట్లేదు. ఇక రద్దీని తట్టుకునే విధంగా నార్త్‌ఈస్ట్ రైల్వే అదనపు రైళ్లను నడుపుతోంది. రైల్వే స్టేషన్లలో భారీగా సెక్యూరిటీ సిబ్బందిని మోహరించింది.