Coldplay Ahmedabad Concert: అహ్మదాబాద్‌లో కోల్డ్‌ప్లే కచేరీ.. 3,800 మంది పోలీసులు.. 400 CCTVలతో భారీ భద్రత..
ABN , Publish Date - Jan 25 , 2025 | 09:31 AM
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్డ్‌ప్లే కచేరీ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం గుజరాత్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Coldplay Ahmedabad Concert: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్రిటిష్ రాక్ బ్యాండ్ కోసం గుజరాత్ పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో కోల్డ్‌ప్లే కచేరీను తిలకించేందుకు లక్ష మంది వరకు వచ్చే అవకాశం ఉంది. 3,800 మంది పోలీసులు.. 400 CCTVలతో అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మహిళా పోలీసు అధికారులు, సిబ్బందితో సహా సాధారణ దుస్తులలో ఉన్న అధికారులను కేటాయించారు. కోల్డ్‌ప్లేను చూసేందుకు వచ్చే ప్రతి వ్యక్తిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. ప్రత్యేక బారికేడింగ్ ఏర్పాట్లు చేస్తారు.
స్పెషల్ ఆపరేషన్స్ బృందాలు
నేషనల్ సెక్యూరిటీ గార్డ్, స్పెషల్ ఫోర్స్ యూనిట్, అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ బృందాలు మెట్రో స్టేషన్లతో సహా వ్యూహాత్మక ప్రదేశాలపై నిఘా ఉంచుతాయి. మూడు క్విక్ రెస్పాన్స్ టీమ్‌లతో పాటు ఎన్‌ఎస్‌జికి చెందిన ఒక టీమ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు చెందిన ఒక టీమ్, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌కి చెందిన పది బృందాలు కీలక ప్రదేశాల్లో మోహరిస్తారు.
వైద్య, పారామెడికల్ బృందాలు కూడా సిద్ధంగా ఉంటాయని అధికారులు తెలిపారు. ఏదైనా ఊహించని పరిస్థితిని ఎదుర్కొనేందుకు గుజరాత్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సమన్వయంతో అత్యవసర తరలింపు ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సిసిటివి కంట్రోల్ రూమ్, పోలీసు కంట్రోల్ రూమ్‌తో సహా పలు కీలక ప్రాంతాలను సందర్శించారు.
ప్రపంచవ్యాప్తంగా..
"మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ వరల్డ్ టూర్"లో భాగమైన కోల్డ్‌ప్లే భారతదేశ పర్యటన ఇప్పటికే జనవరి 19, 21 తేదీలలో ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో మొదటి సంగీత కచేరీ నిర్వహించింది. DY పాటిల్ స్టేడియంలో జరిగిన సంగీత కచేరీకి ప్రముఖ భారతీయ గాయని శ్రేయా ఘోషల్, ఆమె భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ, ఆమె 70 ఏళ్ల తండ్రి బిశ్వజిత్ ఘోషల్ హాజరయ్యారు. రెండవ సంగీత కచేరీ మోటేరా ప్రాంతంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, VVIPలు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు.