Allahabad High Court: అమ్మాయిని అక్కడ తాకడం అత్యాచారం కాదు.. అలహాబాద్ హైకోర్ట్ సంచలన తీర్పు..
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:23 PM
మైనర్ బాలిక వక్షోజాలను తాకడం, ఆమె పైజామా తాడును తెంపడాన్ని అత్యాచార నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రామ్ మనోహర్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఈ చర్యలు తీవ్రమైన లైంగిక దాడి కిందకు వస్తాయని, ఆ చర్యను అత్యాచారంగా పరిగణించలేమని అన్నారు.

ఓ మైనర్ బాలికపై (Minor Girl) జరిగిన అత్యాచారం కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రామ్ మనోహర్ మిశ్రా (Ram Manohar Mishra) సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనర్ బాలిక వక్షోజాలను తాకడం, ఆమె పైజామా తాడును తెంపడాన్ని అత్యాచార నేరంగా పరిగణించలేమని వ్యాఖ్యానించారు. ఈ చర్యలు తీవ్రమైన లైంగిక దాడి కిందకు వస్తాయని, ఆ చర్యను అత్యాచారంగా పరిగణించలేమని అన్నారు. ఉత్తరప్రదేశ్ (UttarPradesh)లోని కాస్‌గంజ్‌లో పవన్, ఆకాష్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ పదకొండేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు (Allahabad High Court).
2021 సంవత్సరంలో పవన్, ఆకాష్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెళ్తూ 11 ఏళ్ల బాలికకు లిఫ్ట్ ఇచ్చారు. మార్గమధ్యంలో ఆమెపై దాడికి పాల్పడారు. బాధితురాలి వక్షోజాలను పట్టుకుని, ఆమె పైజామా తాడును తెంపేశారు. తర్వాత ఆమెను కల్వర్టు కిందకు లాగడానికి ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్లేవారు జోక్యం చేసుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాస్‌గంజ్ ట్రయల్ కోర్టు ఆదేశాలతో పవన్, ఆకాష్‌పై పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కింద సమన్లు జారీ చేశారు.
ట్రయల్ కోర్టు ఆదేశాలను నిందితులు అలహాబాద్ హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు న్యాయమూర్తి రామ్ మనోహర్ మిశ్రా సమన్లలోని సెక్షన్లను సవరిస్తూ సంచలన తీర్పు వెలువరించారు. మైనర్ బాలిక వక్షోజాలను తాకడం, ఆమె పైజామా తాడును తెంపడం, కల్వర్టు కిందకు తీసుకెళ్లడాన్ని అత్యాచారంగా, అత్యాచార యత్నంగా పరిగణించలేమని అన్నారు. నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని స్పష్టం చేశారు. నిందితులపై పోక్సో చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354-బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
Bank Holidays: నాలుగురోజులు నిలిచిపోనున్న బ్యాంకు సేవలు.. ఎందుకంటే
Harish Rao Big Relief: హరీష్‌రావుకు భారీ ఊరట.. కేసు కొట్టివేత
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి