Peace of Mind : మనసు నిర్మలం కావాలంటే..
ABN , Publish Date - Mar 21 , 2025 | 03:17 AM
భారత దేశం నుంచి బౌద్ధ మతాన్ని చైనాలోకి తీసుకువెళ్ళిన ప్రముఖ బౌద్ద గురువు బోధిధర్మ. ఆ కాలంలో ‘వు’ అనే వ్యక్తి చైనా చక్రవర్తిగా ఉండేవాడు. అతను బోధిధర్మ బోధల పట్ల చాలా ఆకర్షితుడయ్యాడు.

సద్బోధ
భారత దేశం నుంచి బౌద్ధ మతాన్ని చైనాలోకి తీసుకువెళ్ళిన ప్రముఖ బౌద్ద గురువు బోధిధర్మ. ఆ కాలంలో ‘వు’ అనే వ్యక్తి చైనా చక్రవర్తిగా ఉండేవాడు. అతను బోధిధర్మ బోధల పట్ల చాలా ఆకర్షితుడయ్యాడు. ఒక రోజు అతను బోధిధర్మతో ‘‘నా మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉండడానికి దయచేసి ఏదైనా చేయండి’’ అని కోరాడు. తప్పకుండా చేస్తాను. ‘‘రేపు తెల్లవారుజామున రండి. వస్తూ వస్తూ మీ మనసును తీసుకురండి. రాజమందిరంలో మరచిపోయి రాకండి’’ అన్నాడు బోధిధర్మ. ‘ఇదేమిటి? మనసును మరచిపోయి రావద్దంటున్నాడేమిటి? ఈయనకేమైనా పిచ్చి పట్టిందా?’ అనుకున్నాడు. కానీ బోధిధర్మతో ‘‘సరే! వస్తాను’’ అని చెప్పి వెళ్ళిపోయాడు.
రాజమందిరానికి వచ్చిన తరువాత... ‘బోధిధర్మ దగ్గరకు రేపు వెళ్ళాలా? వద్దా?’ అని చక్రవర్తి చాలాసేపు ఆలోచించాడు. బోధిధర్మ మాటలే అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ‘ఆ పిచ్చివాడు ఏం చేస్తాడో? వెళ్ళకపోవడమే మంచిది’ అనిపిస్తోంది. మరోవైపు ‘బోధిధర్మ సామాన్యమైన గురువు కాదు. వెళ్ళినట్టయితే ఏదో శ్రేయస్సు కలుగుతుంది’ అనిపించింది. బోధిధర్మ ముఖవర్చస్సు, కళ్ళలో వెలుగు, బుద్ధికుశలత చక్రవర్తికి గుర్తుకువచ్చాయి. తెల్లవారకముందే బయలుదేరి బోధిధర్మ దగ్గరకు వెళ్ళాడు. అతని రాకకోసం ఎదురుచూస్తున్నట్టు తన కుటీరం ముందే బోధిధర్మ కూర్చొని ఉన్నాడు. ..రండి మహారాజా! రండి. నా ముందు కూర్చోండి. కళ్ళు మూసుకోండి. మీ చంచలమైన మనసు ఎక్కడుందో బాగా వెతికి నాకు చెప్పండి. దాని కథ నేను చూసుకుంటాను’’ అంటూ తన చేతిలో ఉన్న కర్రను (దండాన్ని) చక్రవర్తి కళ్ళముందు ఊపాడు. ‘‘కళ్ళు మూసుకోండి’’ అన్నాడు.
చక్రవర్తి మరో మాట చెప్పలేక కళ్ళు మూసుకొని, తన మనసు తనలో ఎక్కడుందో వెతకడం ప్రారంభించాడు. క్షణాలు గడిచేకొద్దీ... నిశ్శబ్దమైన, ప్రశాంతమైన ఆ వాతావరణంలో... చక్రవర్తి ప్రశాంతత క్రమంగా వృద్ధి చెంది, స్థిరపడింది. అతనికి కళ్ళు తెరవాలనిపించలేదు. అలాగే ఉండిపోవాలనిపించింది. అలా రెండుగంటలు గడిచాయి. సూర్యోదయం అయింది. సూర్యకిరణాలు వారిపై పడుతున్నాయి.
‘‘ఇక చాలు! కళ్ళు తెరవండి’’ అన్నాడు బోధిధర్మ. చక్రవర్తి మెల్లగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఉన్న బోధిధర్మ పాదాలపై తల ఉంచాడు. ప్రశాంతవదనంతో లేచి నిలబడి, చేతులు జోడించి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాడు. ఆ తరువాత ఏమీ మాట్లాడకుండా... నడుస్తూ తన భవనం వైపు వెళ్ళిపోయాడు. సద్గురువులపట్ల నమ్మకం, జ్ఞానం పొందాలనే కోరిక, అంతరంగంలోకి వెళ్ళడానికి దోహదడే ప్రశాంతతలతో మనసు నిర్మలం కాగలదనే సూచన ఓషో చెప్పిన ఈ కథలో ఉంది. మహనీయుల సామీప్యంలో మాటలతో చెప్పలేని ప్రశాంతత లభిస్తుందని, సందేహాలు తీరుతాయనీ రమణ మహర్షిని దర్శించిన ఎందరో ప్రముఖులు పేర్కొన్నారు.
-రాచమడుగు శ్రీనివాసులు