Share News

Sridhar Babu: మహిళలను కోటీశ్వరులను చేస్తాం

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:43 AM

రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. తెలంగాణ రైజింగ్‌లో మహిళలకు అవకాశం ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Sridhar Babu: మహిళలను కోటీశ్వరులను చేస్తాం

  • 500 ఎస్‌హెచ్‌జీలకు ఫ్యాక్టరీలను అందిస్తాం: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. తెలంగాణ రైజింగ్‌లో మహిళలకు అవకాశం ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శనివారం శాసనసభలో మహిళా పారిశ్రామికవేత్తలపై జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు చెప్పారు. సూక్ష్మ పరిశ్రమలను చిన్న పరిశ్రమలుగా, చిన్న పరిశ్రమలను మధ్యతరహా పరిశ్రమలుగా, మధ్య తరహా పరిశ్రమలను భారీ పరిశ్రమల స్థాయికి తీసుకెళతామని చెప్పారు. ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీని సాధించాలనేది కష్టతరమైన సాధన, కానీ అది తమ ప్రభుత్వ కల అని పేర్కొన్నారు.


ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రీయల్‌ పార్కులు ఏర్పాటు చేస్తామని, తొలి విడతలో 20 పార్కులు పెడతామని, రెండు, మూడేళ్లలో వీటి ఏర్పాటు పూర్తవుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో 500 స్వయం సహాయక సంఘా(ఎ్‌సహెచ్‌జీ)లకు ప్లాట్‌ ఆన్‌ కాంప్లెక్స్‌ విధానంలో ఫ్యాక్టరీలు కట్టి, వారి చేతికి ఇవ్వనున్నామని ఆయన పేర్కొన్నారు. ఫ్యాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో 18-21 ఏళ్లలోపు అవివాహితులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే నిబంధన ఉందని, దీన్ని సడలించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి కోరారు. ఫ్యూచర్‌ సిటీలోనూ 100 ఎకరాలు మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయించాలన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 04:43 AM