Share News

స్వాతంత్ర్య సమరంలో యువవీరులు

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:43 AM

షహీద్ దివస్.. నేడు భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ల అమర త్యాగాలకు దేశం గర్విస్తోంది. భరతమాతను దాస్యశృంఖ‌లాల‌ నుంచి విడిపించడానికి అసమాన పోరాటం చేసిన ఆ ముగ్గురు వీరులను నాటి...

స్వాతంత్ర్య సమరంలో యువవీరులు

షహీద్ దివస్.. నేడు భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ల అమర త్యాగాలకు దేశం గర్విస్తోంది. భరతమాతను దాస్యశృంఖ‌లాల‌ నుంచి విడిపించడానికి అసమాన పోరాటం చేసిన ఆ ముగ్గురు వీరులను నాటి వలస పాలకులు అన్యాయంగా ఉరికంబం ఎక్కించారు. చిన్న వయసులోనే ఆ ముగ్గురు వీరులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఉరిని కూడా ఆనందంగా స్వీకరించి బలిదానం చేసిన రోజు మార్చి 23. ఆ వీరులు ప్రాణత్యాగం చేసిన నాటి రోజునే వారి జ్ఞాపకార్ధం షహీద్ దివస్‌గా జరుపుకుంటున్నాం. ఆ ముగ్గురూ భగత్‌సింగ్, సుఖ్‌దేవ్ థాపర్, శివ్‌రామ్ రాజ్‌గురులు. బ్రిటిష్ పాలన అంతంకావాలని పరాయి పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టి 23 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన ఈ ముగ్గురు వీరులు నాటి తరానికే కాదు, నేటి యువతకు కూడా ఆదర్శం. ఉరికంబం ఎక్కడానికి ముందు కూడా తమ ముఖంలో చిరునవ్వు చెరగనివ్వని ఈ యోధులు, చావును కూడా ఎంతో ఆనందంగా స్వీకరించారు. 1931 మార్చి 23న ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్ హుస్సైన్‌వాలా ప్రావిన్స్‌ జైల్లో ఈ వీరులను ఉరికంబానికి బలిచ్చారు. భరతమాతను బ్రిటిషర్ల చెర నుంచి విడిపించి, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారుల్లో భగత్‌సింగ్ ఒకరు. అందుకే ఆ విప్లవ వీరుడ్ని షహీద్ భగత్‌సింగ్‌గా పిలుస్తారు. 1907 సెప్టెంబరు 28న ప్రస్తుత పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జన్మించిన భగత్‌సింగ్ చిన్న వయసులోనే జాతీయోద్యమంలో పాల్గొన్నారు. తనకు వివాహం చేయాలన్న తల్లిదండ్రుల నిర్ణయం తెలుసుకున్న భగత్‌, ఆ ప్రయత్నాన్ని మానుకోమని ఉత్తరం రాసిపెట్టి ఢిల్లీకి చేరారు.


దైనిక్‌ అర్జున్‌, ప్రతాప్‌ లాంటి పత్రికల్లో కొంతకాలం పనిచేసిన భగత్‌సింగ్‌‌కు ఆ సమయంలోనే గణేశ్‌ విద్యార్థి, బటుకేశ్వరదత్‌ లాంటి విప్లవకారుల సహచర్యం లభించింది. విప్లవం ద్వారా మాత్రమే స్వాతంత్ర్యం సిద్ధించగలదని భావించిన భగత్‌సింగ్‌ ‘నౌ జవాన్‌ భారత్‌ సభ’ను 1924లో స్థాపించారు. భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, భగవతీచరణ్‌లు ఆ సమయంలో తమ రక్తంతో ప్రమాణపత్రంపై సంతకం చేశారు. అప్పుడే కాన్పూర్‌లో వరదలు రావడంతో, సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్న భగత్‌సింగ్‌కు చంద్రశేఖర్‌ ఆజాద్‌‌తో పరిచయం ఏర్పడింది. తరువాతి కాలంలో వారు ప్రాణస్నేహితులుగా మారారు. నౌ జవాన్ భారత సభ ద్వారా యువతను ఆకర్షించడమే కాకుండా వారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించారు. చిన్నతనంలో ఐరోపా విప్లవ ఉద్యమాల గురించి చదివి అరాజకవాదం, సామ్యవాదాలకు ఆకర్షితుడయ్యాడు. ఈ స్ఫూర్తితో హిందూస్థాన్ గణతంత్ర సంఘంలో ముఖ్య నాయకుల్లో ఒకడుగా ఎదిగారు. ఆ తర్వాత ఈ సంస్థను హిందూస్థాన్ సామ్యవాద గణతంత్ర సంఘంగా మార్చారు. రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల నిరాహారదీక్షను చేపట్టడం ద్వారా భగత్‌సింగ్‌ అఖండ భారతావని మద్దతును కూడగట్టుకున్నాడు. పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మరణానికి కారణమైన పోలీస్ అధికారి స్కాట్స్ హత్యకు భగత్‌సింగ్ వేసిన పథకం విఫలమైంది. స్కాట్స్ అనుకుని మరో ఎస్‌ఐ సాండర్స్‌ను హత్య చేశారు. 1929 ఏప్రిల్ 8న పార్లమెంట్‌‌ హాల్‌లో పొగ బాంబు విసరడంతో భగత్‌సింగ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.


తమ స్వాతంత్ర్య కాంక్షను తెలియజేయడానికే బాంబు వేశాం తప్ప, ఎవరినీ హత్య చేయడానికి కాదంటూ ధైర్యంగా న్యాయస్థానంలోనే ఆయన ప్రకటించారు. భగత్‌సింగ్‌తో పాటు సుఖదేవ్, రాజ్‌గురులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. పార్లమెంట్‌ హాల్లో మనుషులు లేని ప్రదేశంలో బాంబు విసిరి భారతీయుల మనోగతాన్ని తెలియజేయాలన్నదే ఈ వీరుల ప్రధానోద్దేశం. అయితే దీన్ని మాత్రం తీవ్రంగా పరిగణించిన బ్రిటిష్ ప్రభుత్వం విచారణ త్వరగా పూర్తిచేసి ఉరిశిక్షను అమలు చేసింది. తన కొడుకును కేసు నుంచి బయటపడేయడానికి భగత్‌సింగ్ తండ్రి చాలా ప్రయత్నించారు. అయితే తండ్రి ప్రయత్నాలను వారించిన భగత్‌సింగ్‌ దాని వల్ల ప్రయోజనం ఉండదని ఖండితంగా చెప్పాడు. మమ్మల్ని విడిచిపెట్టే ఉద్దేశం బ్రిటిష్ ప్రభుత్వానికి లేదు కాబట్టి దీనిపై దొంగ సాక్ష్యాలను సృష్టించి విచారణను వేగంగా పూర్తిచేయడానికి ఏర్పాటు చేస్తుందంటూ తెల్లదొరల అంతరంగాన్ని ముందే పసిగట్టి తండ్రికి తెలియజేశారు భగత్‌సింగ్. అనుకున్నట్టుగానే ఈ ముగ్గురు వీరుల్ని బ్రిటిష్ ప్రభుత్వం దోషులుగా నిర్ధారించి ఉరికంబం ఎక్కించింది. మార్చి 23న సెంట్రల్ జైలులో సాయంకాలం 7.33 గంటలకు విప్లవ వీరులను ఉరి తీశారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఉరితాడును ముద్దాడి, ప్రాణత్యాగం చేశారు. నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరి శిక్ష అమలు చేయకూడదు. అందుకే వారి మృతదేహాలను జైలు వెనుక గోడలు పగులగొట్టి రహస్యంగా తీసుకెళ్లి సట్లెజ్ నది తీరాన దహనం చేశారు. మృతదేహాలు ప్రజల కంటబడితే ఉపద్రవం ముంచుకొస్తుందనే ఇలా చేశారు. ఈ యువకిశోరాల త్యాగం ఎప్పటికీ వృధా కాదు. అమరవీరుల్లారా, ఎల్లవేళలా మీరు ప్రతి భారతీయ గుండెల్లో ఉంటారు.

నరేష్ జాటోత్

(నేడు షహీద్ దివస్‌)

Updated Date - Mar 23 , 2025 | 04:44 AM