Share News

అపరాధా? బాధితురాలా?

ABN , Publish Date - Mar 20 , 2025 | 03:27 AM

ఉగ్రవాద సానుభూతిపరురాలిగా ముద్ర, వీసా రద్దు, వెంటపడుతున్న ప్రభుత్వ ఏజెన్సీలు... ఊపిరి సలపనివ్వనంత వేగంగా తరుముతున్న సంఘటనల నేపథ్యంలో... భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్‌...

అపరాధా? బాధితురాలా?

ఉగ్రవాద సానుభూతిపరురాలిగా ముద్ర, వీసా రద్దు, వెంటపడుతున్న ప్రభుత్వ ఏజెన్సీలు... ఊపిరి సలపనివ్వనంత వేగంగా తరుముతున్న సంఘటనల నేపథ్యంలో... భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్‌ స్వీయ బహిష్కరణ విధించుకొని, అమెరికా నుంచి కెనడాకు పరుగులెత్తారు. ఆమె అపరాధి అని చట్ట సంస్థలు చెబుతూంటే... తను బాధితురాలినంటున్నారు రంజని. వీటిలో నిజం ఏదైనా... ప్రస్తుతం ఆమె భవిష్యత్తు అనిశ్చితిలో ఉంది.

థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్న రంజనీ శ్రీనివాసన్‌ కథలో తాజా పరిణామాల వెనుక... ఓ ఫ్లాష్‌బ్యాక్‌ ఉంది. పాలస్తీనాకు అనుకూలంగా న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులు కొందరు నిరుడు ఏప్రిల్‌లో ఆందోళనలు చేపట్టి, క్యాంప్‌సలోని హామిల్టన్‌ హాల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తమతో ఘర్షణకు దిగిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రంజనిని కూడా యూనివర్సిటీ మైదానం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ‘‘నేను ఆ ఆందోళనలో పాల్గొనలేదు. క్యాంప్‌సలోని నా స్నేహితులను కలుసుకొని, తిరిగి నా అపార్ట్‌మెంట్‌కు వెళ్తూ వీధుల్లో ఉన్న నిరసనకారుల మధ్య చిక్కుకున్నాను. నన్ను అన్యాయంగా అరెస్ట్‌ చేశారు. ఆ నిరసనలకు నాకు ఏ సంబంధం లేదు’’ అని ఆమె స్పష్టం చేశారు. కాగా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని, సంఘటన స్థలం నుంచి వెళ్ళిపోవాలని హెచ్చరించినా పట్టించుకోలేదనీ ఆరోపిస్తూ రెండు సమన్లను పోలీసులు ఆమెకు జారీ చేశారు. అయితే ఆ కేసును న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది. క్రిమినల్‌ రికార్డుల్లో కూడా ఆ వివరాలు నమోదు కాలేదని రంజని చెబుతున్నారు. హామిల్టన్‌ హాల్‌ను విద్యార్థులు ఆక్రమించిన సంఘటనతో రంజనికి సంబంధం లేకపోవచ్చు కానీ... అంతకుముందు కొన్ని ఆందోళనల్లో ఆమె పాల్గొన్నారు. గాజాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ సోషల్‌ మీడియాలో వచ్చిన కొన్ని పోస్టుల్ని షేర్‌ చెయ్యడం, లైక్‌ చెయ్యడంతో పాటు... 2023లో పాలస్తీనా విముక్తికి మద్దతుగా ‘సొసైటీ ఆఫ్‌ ఆర్కిటెక్చరల్‌ హిస్టారియన్స్‌’ విడుదల చేసిన బహిరంగ లేఖ మీద సంతకం కూడా చేశారు. ఈ విషయాలను ఆమె తరఫు న్యాయవాదులు సైతం ధ్రువీకరించారు.


ఆ వివరాలు దాచినందుకు...

తమిళనాడుకు చెందిన రంజని 2016లో హార్వర్డ్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌ విద్యార్థిగా ఎఫ్‌-1 వీసాపై అమెరికాకు వచ్చారు. ప్రస్తుతం కొలంబియా యూనివర్సిటీలో... అర్బన్‌ ప్లానింగ్‌లో డాక్టోరల్‌ డిగ్రీ చేస్తున్నారు. హామిల్టన్‌ హాల్‌ కేసు నుంచి తనకు విముక్తి లభించిన కొద్ది రోజులకు స్టూడెంట్‌ వీసాను ఆమె పునరుద్ధరించుకున్నారు. తదనంతరం అధికారంలోకి వచ్చిన ట్రంప్‌ ప్రభుత్వం... కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల విద్యార్థుల మీద చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది మార్చి 5న రంజని వీసాను ‘యుఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌’ రద్దు చేసింది. ‘‘చెన్నైలోని యుఎస్‌ కాన్సులేట్‌ నుంచి నాకు ఒక ఇ-మెయిల్‌ వచ్చింది. నా వీసా రద్దు గురించి తెలియజేస్తూ నన్ను ‘వీసాకు అనర్హురాలుగా చేసే కొత్త సమాచారం’ వెలుగులోకి వచ్చిందని తెలిపింది’’ అని చెప్పారు రంజని. తన స్టూడెంట్‌ వీసాను పునరుద్ధరించుకొనే సమయంలో... పాత అరెస్టు, రెండు సమన్ల గురించి ప్రస్తావించకుండా దాచినందుకు, హింసను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ఆమె వీసాను రద్దు చేస్తున్నట్టు ‘యుఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ’ ఒక ప్రకటన జారీ చేసింది. ఆమెపై ఉగ్రవాదులకు అనుకూలవాదిగా ముద్ర వేస్తూ, నిషేధిత ఉగ్రవాద సంస్థ హమా్‌సకు మద్దతుగా కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు పేర్కొంది. గందరగోళానికి గురైన రంజని... యూనివర్సిటీలోని అంతర్జాతీయ విద్యార్థుల కేంద్రం ప్రతినిధులను కలిశారు. ఆమె అమెరికాలో ఉన్నంతకాలం విద్యను కొనసాగించవచ్చని వారు తెలిపారు. రెండు రోజుల అనంతరం... కొలంబియా యూనివర్సిటీ నుంచి ఆమెకు ఒక ఇ-మెయిల్‌ వచ్చింది. ఆమె వీసాను రద్దు చేసినట్టు అధికారిక సమాచారం అందిందనీ, ఈ క్రమంలో యూనివర్సిటీ నుంచి ఆమెను తొలగిస్తున్నామనీ, విద్యార్థినిగా ఆమెకు ఇచ్చిన వసతిని ఖాళీ చేయాలని అందులో పేర్కొన్నారు.


జీవితం తల్లకిందులు...

ఒకవైపు ఇవి కొనసాగుతూండగా.. మరోవైపు మార్చి 7న రంజని నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌కు ముగ్గురు ఫెడరల్‌ ఇమ్మిగ్రేషన్‌ ఏజెంట్లు వచ్చారు. రంజనితో కలిసి అక్కడ నివసిస్తున్న మరో విద్యార్థినితో తాము పోలీసులమని చెప్పారు. గుర్తింపు కార్డులు చూపించాలని ఆమె కోరడంతో వాళ్ళు కొద్దిసేపు వాదించి వెళ్ళిపోయారు. ఆ సమయంలో రంజని ఆ అపార్ట్‌మెంట్‌లోనే ఉన్నారు. పరిస్థితి అర్థం చేసుకున్న ఆమె తక్షణం ఆ నివాసాన్ని ఖాళీ చేసి, వేరే మిత్రుల దగ్గర తలదాచుకున్నారు. మరికొన్ని గంటల్లోనే హమాస్‌ మద్దతుదారుడిగా పేరుపడిన మరో విద్యార్థి మహమ్మద్‌ ఖలీల్‌ను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. పలుసార్లు రంజని అపార్ట్‌మెంట్‌కు ఫెడరల్‌ ఏజెంట్లు వస్తూనే ఉన్నారు. తదుపరి వంతు తనదేనని గ్రహించిన రంజని... ప్రభుత్వం రూపొందించిన ‘సిబిపి యాప్‌’ను ఆశ్రయించారు. అమెరికాలో అనుమతి లేకుండా ఉంటున్నవారు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడానికి ముందే... స్వీయ బహిష్కరణ (సెల్ఫ్‌ డిపోర్ట్‌)ను ఎంచుకొని, స్వచ్ఛందంగా అమెరికా వదిలి వెళ్ళడానికి ఈ యాప్‌ వీలు కలిగిస్తుంది. దాన్ని ఉపయోగించుకున్న రంజని... కెనడాకు పయనమయ్యారు. జ్యుడీషియల్‌ వారెంట్‌తో ఆమె అపార్ట్‌మెంట్‌కు వెళ్ళిన అధికారులకు ఈ సంగతి ఆలస్యంగా తెలిసింది.


ఆ తరువాత... న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయం నుంచి ఆమె నిష్క్రమిస్తున్న దృశ్యాలను అధికారులు మీడియాకు విడుదల చేశారు. ఇది జరిగిన రెండు రోజుల తరువాత ఒక ఆంగ్ల పత్రికకు రంజని ఇంటర్వ్యూ ఇస్తూ ‘‘అక్కడ వాతావరణం చాలా ఉద్రిక్తంగా, ప్రమాదకరంగా కనిపించింది. అందుకే వేగంగా నిర్ణయం తీసుకున్నాను. అయిదేళ్ళ నుంచి కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్నాను. ఈ ఏడాది డిగ్రీ పూర్తి చెయ్యాల్సి ఉంది. ఇదంతా నేను తప్పు చెయ్యడంవల్ల జరిగింది కాదు, నా అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కును ఉపయోగించుకోవడం వల్ల జరిగింది.

ఇప్పుడు నేను బాధితురాలిని. నా వీసాను రద్దు చెయ్యడంతో నా జీవితం తల్లకిందులయింది. డిగ్రీ పూర్తి చేస్తాననే ఆశ కనిపించడం లేదు. అంతా అనిశ్చితిగా ఉంది’’ అని చెప్పారు. ‘37 ఏళ్ళ రంజని భవిష్యత్తులో ఏం చెయ్యబోతున్నారు? స్వదేశానికి తిరిగి వస్తారా?’ అనే ప్రశ్నలకు... ప్రస్తుతానికి ఆమె దగ్గర కూడా స్పష్టమైన సమాధానాలు లేవు.

Updated Date - Mar 20 , 2025 | 03:27 AM