Spiritual Reflection : వరాల వసంతం... రంజాన్
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:52 AM
రంజాన్ నెల ప్రధానంగా ఆత్మప్రక్షాళన మాసం. విశ్వాసులు తమ జీవితాలను ఆధ్యాత్మికతకు పునరంకితం చేసే మాసం.

సందేశం
రంజాన్ నెల ప్రధానంగా ఆత్మప్రక్షాళన మాసం. విశ్వాసులు తమ జీవితాలను ఆధ్యాత్మికతకు పునరంకితం చేసే మాసం. వ్యక్తి జీవన విధానంలో చైతన్యాన్ని ప్రేరేపించే మాసం. క్రమశిక్షణను నేర్పి, దైవ సేవలో నిమగ్నమయ్యేలా చేసే మాసం. దైవం కరుణా కటాక్షాలను, ప్రసన్నతను పొందే మాసం. సౌభ్రాతృత్వానికి అద్దం పట్టే మాసం. పరస్పర ఆత్మీయతా భావాన్ని అనుసంధానించే ఈ మాసం ఒక సత్కార్యానికి పదిరెట్లు పుణ్య ఫలాలను అందిస్తుంది.
ఈ నెలలో స్వర్గద్వారాలు పూర్తిగా తెరిచి ఉంటాయి, నరక ద్వారాలు మూతపడతాయి. వయసుతో నిమిత్తం లేకుండా విశ్వాసులు ఇంటిల్లిపాదీ రాత్రింబవళ్ళు ఆధ్యాత్మికతలో మునిగి తేలుతారు. దైవం పట్ల విశ్వాసాన్ని పటిష్టపరచుకుంటారు. పుణ్యకార్యాలపట్ల ఆకాంక్షను, పాపకార్యాల పట్ల విముఖతను పెంచుకుంటారు. అల్లాహ్ తన బోధనామృతాన్ని ప్రజలకు అందజేసిన మాసం ఇది. ఆయన తన అపార అనుగ్రహాన్ని వర్షిస్తాడు. ధనవంతులకు పేదల హక్కును గుర్తు చేసి, జకాత్ ఫిత్రా లాంటి ధర్మాలను నిర్వర్తించడాన్ని విధిగా నిర్దేశించిన రంజాన్ నెల... ఉపవాసాల ద్వారా... ఆర్తుల ఆకలిదప్పులను సంపన్నులకు అనుభవపూర్వకంగా తెలియజేస్తుంది.
ఖుర్‌ఆన్ అవతరించిన మాసం
ఈ మాసం పేరిట ఉన్న పర్వదినాన్ని ‘ఈద్-ఉల్-ఫితర్’ అని కూడా వ్యవహరిస్తారు. రంజాన్ మాసం... ఖుర్‌ఆన్ అవతరించిన నెల. ‘‘ఈ దివ్య గ్రంథం మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతో పాటు సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఇందులో ఉన్నాయి. ఈ నెలను ఎవరు చూస్తారో వారు ఉపవాసాలు ఉండాలి’’ అని దివ్య ఖుర్‌ఆన్ చెబుతోంది. ‘‘వెయ్యి నెలలకన్నా శ్రేష్టమైన రాత్రి ఒకటి ఈ మాసంలోనే ఉంది. దాని శుభాలను కోల్పోయినవారు దౌర్భాగ్యులు. స్వర్గానికి ఎనిమిది ద్వారాలు ఉన్నాయి. వాటిలో ఒక ద్వారాన్ని కేవలం ఉపవాసులకే ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది’’ అని పేర్కొంది.
రంజాన్ మాసంలోనే ఇబ్రహీమ్ ప్రవక్త ‘సహీఫాల’ను, మూసా ప్రవక్త ‘తౌరాత్’ గ్రంథాన్ని, దావూద్ ప్రవక్త ‘జబూర్’ గ్రంథాన్ని, ఈసా ప్రవక్త ‘ఇంజీల్’ గ్రంథాన్ని దైవ కృపతో అందుకున్నారు. ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా మసీదులు కళకళలాడతాయి. దానధర్మాలకు సంబంధించిన కార్యాలు ముమ్మరం అవుతాయి. సోదరభావం పరస్పరం బలపడుతుంది. శాంతియుత వాతావరణంలో... విశ్వాసులు భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు చేస్తారు. యంత్రాలు ఎడతెరిపి లేకుండా కొంతకాలం పని చేసిన తరువాత... వాటికి విశ్రాంతి కావాలి. వాటి భాగాలను ఊడదీసి శుభ్రం చేయాలి. అప్పుడే మలినాలన్నీ పోతాయి. మళ్ళీ సమర్థమైన విధి నిర్వహణకు సిద్ధమవుతుంది. అలాగే మన జీర్ణ వ్యవస్థకు విశ్రాంతిని ఇచ్చి, దానికి క్రమబద్ధతను చేకూర్చే ఆరాధనే... రోజా (ఉపవాసం).