అంతరిక్షంలో సునీత భారతీయత
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:32 AM
సునీతా విలియమ్స్... ప్రస్తుతం ప్రపంచమంతా మారుమోగుతున్న పేరు. భారతీయ మూలాలున్న సునీత... తొమ్మిది నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో పరిశోధనలు చేసి బుధవారం ఉదయం భూమిపైకి...

సునీతా విలియమ్స్... ప్రస్తుతం ప్రపంచమంతా మారుమోగుతున్న పేరు. భారతీయ మూలాలున్న సునీత... తొమ్మిది నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో పరిశోధనలు చేసి బుధవారం ఉదయం భూమిపైకి వచ్చారు. అంతరిక్షంలో అతి ఎక్కువ రోజులు ఉన్న వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన సునీతకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అంటే చాలా ఇష్టం. తనకున్న ఈ ఇష్టాన్ని అంతరిక్షం కేంద్రంలో ఉన్నప్పుడు కూడా ప్రదర్శిస్తూనే వచ్చారు. ఆ సందర్భాలేమిటో చూద్దాం..
సమోసా
అంతరిక్షంలో నివసించే వ్యోమగాములు తమకు నచ్చిన ఆహారాన్ని అంతరిక్షంలోకి పట్టుకువెళ్లవచ్చు. సునీత భారతదేశ ఆహార సంస్కృతికి గుర్తుగా సమోసాను అంతరిక్షంలోకి తీసుకువెళ్లారు. సునీతకు చిన్నప్పటి నుంచి భారతీయ ఆహారమంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆమె అనేకసార్లు ఇంటర్వ్యూలలో కూడా పేర్కొన్నారు. సమోసా కేవలం ఆమెకు ఒక చిరుతిండి మాత్రమే కాదు.. భారత దేశాన్ని ప్రతిరోజూ తలుచుకోవటానికి ఒక అవకాశం కూడా!
దీపావళి
సునీత తండ్రి భారత దేశం నుంచి అమెరికాకు వలస వెళ్లారు. అమెరికాలో కూడా భారతీయ పండుగలు జరుపుకుంటూ ఉండేవారు. అంతరిక్షంలో వ్యోమగాములు తమకు నచ్చిన పండుగ జరుపుకొనే అవకాశముంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సునీత అంతరిక్షంలో దీపావళి జరుపుకున్నారు. ‘‘దీపావళి జరుపుకుంటుంటే నాన్నగారు గుర్తుకువస్తున్నారు’’ అన్న ఆమె మాటలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయ్యాయి.
భగవద్గీత
అంతరిక్షానికి సునీత తనతో పాటుగా భగవద్గీత, ఉపనిషత్‌లను తీసుకువెళ్లారు. ‘‘నాకు మార్గదర్శకత్వం కావాల్సి వచ్చినప్పుడు.. ఆత్మసైర్థ్యం కావాల్సినప్పుడు ఈ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే వీటిని అంతరిక్షంలోకి తీసుకు వెళ్తున్నాను’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ పుస్తకాలను తనతో తీసుకువెళ్లటం- భారతీయ సంస్కృతి మూలాలపై ఆమెకు ఉన్న అభిమానాన్ని తెలియజేస్తోంది.
గణేశుడు కూడా...
సునీత తనతో పాటుగా గణేశ విగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లారు. గతంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో ఆమె తన ఆధ్యాత్మిక జీవితంలో గణేశుడు ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తాడని పేర్కొన్నారు. అంతరిక్షంలోకి ఒక హిందూ దేవుడి విగ్రహాన్ని తీసుకువెళ్లిన వ్యోమగామి సునీతే కావటం విశేషం.
యువతకు స్ఫూర్తిగా...
సునీత చాలాకాలంగా భారతీయ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కృషి, పట్టుదల ఉంటే ఎంతటి ఎత్తుకైన ఎదగవచ్చనటానికి ఆమె ఒక ఉదాహరణ. ఈ విషయాన్నే ఆమె 2013లో భారత దేశానికి చెందిన కొద్దిమంది పిల్లలతో పంచుకున్నారు. ‘‘ఈ ప్రపంచం మీకు ఆహ్వానం పలుకుతోంది. నేనూ మీలాంటిదానినే’’ అని సునీత ఇచ్చిన సందేశం అనేక మందిలో స్ఫూర్తి రగిలించింది.