Organ Transplant: అవయవ మార్పిడి అక్రమాలపై ఉక్కుపాదం!
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:36 AM
మానవ అవయవ మార్పిడిలో అక్రమాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం ఇక ఉక్కుపాదం మోపనుంది. నిబంధనలకు విరుద్ధంగా అవయవ మార్పిడులకు పాల్పడితే భారీ జరిమానాతోపాటు పదేళ్ల జైలుశిక్ష కూడా విధించనుంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
10 ఏళ్ల జైలుశిక్ష.. 12 లక్షల జరిమానా
తప్పుడు ధ్రువపత్రాలు సమర్పిస్తే..
రూ.20 లక్షల నుంచి కోటి వరకు ఫైన్
టీహెచ్‌వోటీఏ-2011 సవరణ చట్టాన్ని
అమలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
నేడు శాసనసభలో తీర్మానం
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): మానవ అవయవ మార్పిడిలో అక్రమాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం ఇక ఉక్కుపాదం మోపనుంది. నిబంధనలకు విరుద్ధంగా అవయవ మార్పిడులకు పాల్పడితే భారీ జరిమానాతోపాటు పదేళ్ల జైలుశిక్ష కూడా విధించనుంది. ఈ మేరకు కేంద్ర మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టం-2011ను తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసుకోనుంది. ఇందుకు సంబంధించి సోమవారం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఈ చట్టాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. శాసనసభ ఆమోదం తర్వాత దీనిని గవర్నర్‌కు పంపనున్నారు. గవర్నర్ ఆమోదముద్ర పడగానే అధికారికంగా గెజిట్ విడుదల చేయనున్నారు. దీంతో అవయవ మార్పిడిలో నిబంధనలు ఉల్లంఘించినా, అక్రమాలకు పాల్పడినా శిక్షలు చాలా కఠినంగా ఉండనున్నాయి. అలాగే అవయవాల లభ్యత పెరగడంతోపాటు ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. ఇప్పటిదాకా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సజీవ అవయవ దాన పరిధి విస్తృతమవుతుంది. అమ్మమ్మ, తాతయ్య సైతం తమ మనవళ్లు, మనవరాళ్లకు అవయవ దానం చేసే వెసులుబాటు కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 1994లో తొలిసారిగా.. కేంద్ర మానవ అవయవ మార్పిడి చట్టం-1994 (ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యుమన్ ఆర్గాన్స్ యాక్ట్ -టీహెచ్‌వోఏ)ను తీసుకువచ్చింది. దానిని ఉమ్మడి రాష్ట్రంలో అడాప్ట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ మానవ అవయవ మార్పిడి చట్టం-1995ను అమలు చేశారు. అనంతరం 2011లో కేంద్రం టీహెచ్‌వోఏ చట్టానికి సవరణలు చేసి మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టం(ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యుమన్ ఆర్గాన్స్ టిష్యూ యాక్ట్- టీహెచ్‌వోటీఏ)ను తీసుకువచ్చింది. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2011 సవరణ చట్టాన్ని కాకుండా.. ఉమ్మడి రాష్ట్ర చట్టమైన టీహెచ్‌వోఏనే అడాప్ట్ చేసుకుంది. తాజాగా దీనిపై కసరత్తు చేసిన ప్రభుత్వం.. 2011 (టీహెచ్‌వోటీఏ) చట్టాన్నే అడాప్ట్ చేసుకోవాలని నిర్ణయించింది.
పాత చట్టంలో ఏమున్నాయంటే..
టీహెచ్‌వోఏలో కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల మార్పిడినే చేర్చారు. ఇది అవయవ వ్యాపారాన్ని నియంత్రిస్తుంది. అయితే అవయవ మార్పిడి తర్వాత దాత, స్వీకర్త ఆరోగ్యాన్ని పర్యవేక్షించే విధానం ఇందులో లేదు. లైవ్ ఆర్గాన్ డొనేషన్స్ ఆమోదం కోసం ఒక అధికారిక కమిటీని ప్రభుత్వం నియమిస్తుంది. వైద్య విద్య సంచాలకుల ఆధ్వర్యంలో అవయవ మార్పిడి జరిగే ఆస్పత్రులను రిజిస్టర్ చేస్తారు. నిబంధనలు ఉల్లంఘించే వాటిపై డీఎంఈ చర్యలు తీసుకుంటారు. టీహెచ్‌వోఏ చట్టం ప్రకారం భార్య, భర్త, కుమారుడు, కుమార్తె, తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి అవయవ దానం చేసేందుకు అర్హులవుతారు. సంబంధం లేని దాతలు అవయవం ఇవ్వాలంటే కమిటీ నుంచి ఆమోదం తీసుకోవాలి. బ్రెయిన్ డెడ్ ప్రకటించిన తర్వాతే కుటుంబ సభ్యుల అంగీకారంతో మృతదేహ అవయవాలను తీయవచ్చు. గుర్తుతెలియని మృతదేహాల నుంచి48 గంటల్లోపు అవయవాన్ని తీసుకోవచ్చు. ఉల్లంఘనలకు పాల్పడితే రూ.10వేల జరిమానా, గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. లాభాపేక్ష లావాదేవీలకు 2 ఏళ్ల నుంచి 7ఏళ్ల జైలుశిక్ష, రూ.10-20వేల జరిమానా విధిస్తారు. ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌లో ఉల్లంఘనలకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలుశిక్ష, వైద్యులు తప్పు చేస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేసే అవకాశం ఉంది.
కొత్తచట్టంతో ప్రయోజనాలెన్నో..
పాత చట్టం ప్రకారం గరిష్ఠంగా ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా మాత్రమే ఉంది. తక్కువ శిక్షలుండటంతో అక్రమార్కులు యథేచ్చగా అక్రమ అవయవ మార్పిడి చేసేస్తున్నారు. అలాగే పాత చట్టంలో టిష్యూలైన చర్మం, ఎముక మజ్జ, గుండె కవాటాలు లాంటివి చేర్చలేదు. కొత్త చట్టం (టీహెచ్‌వోటీఏ)తో సన్నిహిత బంధువుల నిర్వచనాన్ని విస్తరించడంతోపాటు ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి సమన్వయకర్తల నియామకం, బ్రెయిన్‌డెడ్‌లో ఫిజిషియన్, సర్జన్, అనస్తీషియా నిపుణులను చేర్చడం, నోటో, సోటో నెట్‌వర్క్ ఏర్పాటు, ఆస్పత్రులకు టిష్యూ బ్యాంకుల నమోదును తప్పనిసరి చేయడం వంటి వాటిని చేర్చారు. అలాగే అనుమతి లేకుండా అవయవాన్ని తొలగిస్తే పదేళ్ల జైలుశిక్ష, రూ.12 లక్షల జరిమానా విధిస్తారు. తప్పుడు ధ్రువపత్రాలు సమర్పిస్తే 5-10 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు జరిమానా ఉంటుంది. ఇక టిష్యూ అక్రమ వ్యాపారం చేస్తే ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష, రూ5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు జరిమానా వేస్తారు. ఇతర ఉల్లంఘనలకు పాల్పడితే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20 లక్షల జరిమానా విధిస్తారు. పైగా ఈ చట్టాన్ని అన్వయం చేసుకోవడం వల్ల అవయవాల లభ్యత పెరుగుతుంది.