Share News

వర్ధిల్లు .. నిండు నూరేళ్లు..

ABN , Publish Date - Mar 23 , 2025 | 10:04 AM

వివిధ దేశాల్లోని ఐదు ప్రాంతాల్లో నివసిస్తున్న ఆ ప్రజల జీవనవిధానం మనకిప్పుడు కొత్త పాఠం.. సంపూర్ణ ఆయుష్షుకు జీవన మార్గం.. ప్రతి దేశానికీ ఒక రాజ్యాంగం ఉంటుంది.. ప్రతి మతానికి ఒక పవిత్రగ్రంథం ఉంటుంది..

వర్ధిల్లు .. నిండు నూరేళ్లు..

ప్రతి దేశానికీ ఒక రాజ్యాంగం ఉంటుంది.. ప్రతి మతానికి ఒక పవిత్రగ్రంథం ఉంటుంది.. కానీ మనిషి నిండు నూరేళ్లు జీవించడానికి ఒక మ్యానిఫెస్టో ఏదైనా ఉందా? ఇప్పుడున్న కాలంలో సంపూర్ణ ఆయుర్దాయంతో బతకడం సాధ్యమా? ప్రపంచాన్ని వేధించే ఈ ప్రశ్నకు చక్కటి సమాధానం బ్లూజోన్స్‌. వివిధ దేశాల్లోని ఐదు ప్రాంతాల్లో నివసిస్తున్న ఆ ప్రజల జీవనవిధానం మనకిప్పుడు కొత్త పాఠం.. సంపూర్ణ ఆయుష్షుకు జీవన మార్గం..

‘‘స్వామీ.. ఐశ్వర్యం - ఆరోగ్యం రెండింటిలో ఏది గొప్పది? ఒక్కముక్కలో తేల్చిచెప్పండి...’’ అనడిగాడు భక్తుడు.

‘‘నువ్వడిగిన ప్రశ్న కొత్తదేం కాదు నాయనా.. మన పూర్వీకులు ఎప్పుడో తేల్చారు.. మనమే మరిచిపోయాం...’’ అన్నాడు స్వామి.

‘‘ఆ సత్యమేంటో మీ నోటి నుండే వినాలనుంది స్వామీ’’ మళ్లీ అడిగాడు భక్తుడు.

‘‘నువ్వడిగిన ప్రశ్నకు జవాబు మీ అందరికీ తెలిసిందే! జీవితంలో ఒక్కసారైనా కచ్చితంగా వినే ఉంటారు..’’ అంటూ స్వామీజీ ఇలా ఉపదేశించాడు.

‘‘మన పెద్దలు తమకంటే చిన్నవాళ్లను ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని దీవిస్తారు కదా! అదే నీ ప్రశ్నకు జవాబు. అందులో ‘ఆయుర్‌’ అంటే ఆయుష్షు, ‘ఆరోగ్య’ అంటే ఎలాంటి రోగాలు లేకుండా.. మూడోది ‘ఐశ్వర్య’ అనగా సంపద..’’ చెప్పాడు స్వామీజి.

‘ఆరోగ్యముంటే పేదరికాన్ని భరించైనా సంతోషంగా బతకొచ్చు.. అదే అనారోగ్యమొస్తే ధనికులైనా నరకం అనుభవించాల్సిందే’ నని అర్థమైంది భక్తునికి!.


book4.2.jpg

గూగుల్‌సెర్చ్‌ దగ్గర నుంచి చాట్‌జీపీటీ వరకు అనారోగ్య ప్రపంచమంతా ఇప్పుడు ఇవే ప్రశ్నలు అడుగుతోంది. ఫిట్‌నెస్‌ కోసం ఏం చేయాలి? యోగా బెటరా.. జిమ్‌కు వెళ్లాలా? వృద్ధాప్యాన్ని జయించడం ఎలా? దీర్ఘాయుష్షును పొందడం ఎలా? బీపీ షుగర్‌లను కట్టడిచేసే డైట్‌ ఉందా? మొండి వ్యాధులకు కల్లెం వేయడం సాధ్యమా? సమతుల ఆహారానికి చార్ట్‌ ఇవ్వండి..? ఇలా అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. నిపుణులు సైతం అన్నేసి సమాధానాలతో పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నారు. ‘ఒక మనిషి నిండు నూరేళ్లు జీవించడం సాధ్యమా?’ ఎప్పటికీ ఇదొక శేషప్రశ్నగానే మిగిలిపోయింది. ఆ నిగూఢ రహస్యాన్ని ఛేదించేందుకు నేటికీ అన్వేషణ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే.. ప్రపంచ చిత్రపటంలో అక్కడక్కడ విసిరేసినట్లుండే కొన్ని చిన్న చిన్న దీవుల్లోని ప్రజలు ఆయురారోగ్య రహస్యాన్ని ఎప్పుడో కనిపెట్టారు. వారు అనుసరిస్తున్న ఆదర్శ ఆరోగ్య జీవన విధానమే దానికి సరైన సమాధానం. భూగోళంపై అత్యధిక జీవితకాలం బతికే దీర్ఘాయుష్మంతులుగా రికార్డుల్లోకి ఎక్కారు. ఆ సంపూర్ణ ఆరోగ్యవంతుల అద్భుత స్వర్గధామాలే ‘బ్లూజోన్స్‌.’


వెలుగులోకి తెచ్చాడిలా..

జపాన్‌లోని ఒకినవా. చుట్టూ సముద్రం. మధ్యలో దీవుల సమూహం. ఏ ఇంట్లో చూసినా వృద్ధులే!. తోట పని చేస్తూనో, చేపలు పడుతూనో, ఇంటిని శుభ్రం చేస్తూనో చాలా చురుగ్గా కనిపిస్తున్నారు. అందరూ అరవై నుంచి తొంభై ఏళ్ల పైచిలుకు వయసున్న పెద్దలే!. నేషనల్‌ జియోగ్రఫిక్‌ ఛానల్‌ తరఫున ఆ ప్రాంతం గురించి ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి వెళ్లాడు డాన్‌ బ్యూట్నర్‌. ఆయన సీనియర్‌ పాత్రికేయుడు. వందేళ్లు బతికిన వృద్ధులు కూడా కనిపించారక్కడ. ఆయన టీవీ బృందం ఆశ్చర్యపోయింది. ‘మా ప్రాంతంలో వందేళ్లు బతకడం సహజం’ అన్నారు స్థానికులు. అత్యధిక ఆయుర్దాయం కలిగిన ఒకినవియన్లపై మరిన్ని కార్యక్రమాలను రూపొందించి ప్రచారం చేశాడాయన.

book4.3.jpg

ఆకలిగొన్న ప్రపంచానికి పరమాన్నంలా అనిపించాయా కార్యక్రమాలు. ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇంకా ఏయే దేశాల్లో ఎక్కువ కాలం జీవించిన ప్రజలు ఉన్నారన్న అన్వేషణ మొదలుపెట్టింది టీవీ బృందం. జపాన్‌లోని ఒకినవా, గ్రీస్‌లోని ఇకారియా, కాలిఫోర్నియాలోని లోమా లిండా, కోస్టారికాలోని నికోయా, ఇటలీలోని సార్డీనియాలను గుర్తించారు. ఇవన్నీ సముద్రతీర ప్రాంతాలు కావడంతో బ్లూజోన్స్‌ అనే పేరు పెట్టాడు బ్యూట్నర్‌. ఇక్కడి ప్రజల జీవన విధానంపైన పాతికేళ్లపాటు పరిశోధనలు చేశాడాయన. అనేక అధ్యయనాలు, పుస్తకాలు, ప్రసంగాలు వెలువరించాడు. ప్రత్యేకించి బ్లూజోన్స్‌పైన చిత్రీకరించిన డాక్యుమెంటరీ సిరీస్‌ (నెట్‌ఫ్లిక్స్‌) తనకెంతో పేరుతెచ్చింది. అలా బ్లూజోన్స్‌ ప్రజల జీవనశైలి ప్రాచుర్యం పొందింది.


ఒక్కో చోట ఒక్కో ప్రత్యేకత..

గ్రీస్‌లోని ఏజియన్‌ సముద్రపు చిన్న దీవి.. ఇకారియా. ఇదొక బ్లూజోన్‌. అమెరికన్ల కంటే ఎనిమిదేళ్ల ఆయుర్దాయం ఎక్కువ. యాభైశాతం హృద్రోగాలు, ఇరవై శాతం క్యాన్సర్లు కూడా తక్కువ. వీరు మెడిటేరియన్‌ డైట్‌ను అనుసరిస్తారు. ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్‌, బంగాళదుంపలను తింటారు. వంటనూనెల్లో రాజీ పడరు. ఖరీదైనా సరే ఆలివ్‌నూనెను మాత్రమే వాడతారు. ఆవు, గేదెల కంటే మేక పాలు అంటే ఇష్టం. సగటు ప్రపంచ భోజనప్రియుడు తినే ఆహారం కంటే ముప్పయి శాతం తక్కువ క్యాలరీలున్న తిండినే తింటారు ఇకారియన్లు. అందులోనూ వీళ్లు గ్రీకు ఆర్థడాక్స్‌ క్రైస్తవులు కాబట్టి.. ఏడాది పొడవునా ఉపవాసంలోనే ఉంటారు. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడానికి ఇదొక కాయకల్ప చికిత్సలా ఉపకరిస్తుందట. జీవితంలో ఎంతటి కష్టమొచ్చినా ఎలాంటి ఒత్తిడికి లోనవ్వరు. ఉత్పాతాలు సైతం జీవితంలో భాగమని ఆమోదిస్తారు. కూర్చున్న చోటే కూర్చోరు. కాళ్లు చేతులు కదిలిస్తూనే ఉంటారు. ఉదయం పనిలో భాగంగా కి.మీ. దూరం నడుస్తారు తప్పిస్తే.. రొటీన్‌ వాకింగ్‌ చేయరు. తోటల్లో గంటల తరబడి పనిచేయడం వారికిష్టం. మధ్యాహ్నం కచ్చితంగా అరగంటైనా కునుకుతీస్తారు. ఇరుగుపొరుగుతో స్నేహం చెడనివ్వరు. ఒక చోట పదిమంది పోగై ఆయుర్వేద తేనీటిని సేవిస్తూ.. ముచ్చట్లలో మునిగిపోతారు. 70 ఏళ్లు దాటిన ఇకారియన్లలో మచ్చుకైనా మతిమరుపు కనిపించదు.


కొండ కోనల్లో..

ఇటలీలోని సర్డానియా మరో బ్లూజోన్‌. భౌగోళికంగా పర్వత ప్రాంతం కావడంతో.. పుట్టుకతోనే ట్రెక్కింగ్‌ అలవాటైంది. ప్రతీ ఒక్కరు రోజుకు కనీసం అయిదుమైళ్ల దూరం నడవాల్సిన పరిస్థితి. తృణధాన్యాలతో చేసిన బ్రెడ్డు, బీన్స్‌, పెరటి కూరగాయలు, పండ్లు తింటుంటారు. పచ్చగడ్డి మేసే గొర్రె పాలతో పులియబెట్టిన పెకరినో చీజ్‌ సర్డానియన్ల ఆహారంలో ప్రధానమైనది. ఇందులో ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్‌ అధికం. కేవలం ఆదివారాలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే మాంసాహారం భుజిస్తారు. వారానికి రెండుమూడుసార్లు రెడ్‌వైన్‌ (రెండు పెగ్గులు) సేవిస్తారు. ఇకారియన్ల మాదిరే వీళ్లు కూడా మేక పాలు తాగుతారు. ఈ పాలు తాగడం వల్ల శరీరంలో వాపు లక్షణాలు తగ్గిపోతాయి.

book4.4.jpg

హృద్రోగాలు రావు, వృద్ధాప్యంలో అల్జీమర్స్‌ నుంచి తప్పించుకోవచ్చు. సర్డానియన్లు హాస్యప్రియులు. సాయంత్రం అయితే చాలు. అందరూ ఒకచోట గుమిగూడి రచ్చబండ కబుర్లతో హాస్యచలోక్తులు విసురుకుంటూ చక్కటి కాలక్షేపం చేస్తారు. వీళ్ల జీవితంలో నవ్వులు లేని రోజులు ఉండవు. కుటుంబ పెద్దలంటే గౌరవం. అమ్మమ్మలు, తాతయ్యలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తారు. తమ జీవిత అనుభవాలను, కష్టసుఖాలను పిల్లలతో పంచుకుంటారు. అవసరమైనప్పుడు తాము దాచుకున్న డబ్బులిచ్చి పిల్లలను సంతోషపెడతారు.


అమృత ఆహారం..

బ్లూజోన్స్‌ అన్నింటిలో బాగా ప్రాచుర్యం పొందిన దీర్ఘాయుష్మంతులు జపాన్‌లోని ఒకినావన్లు. వీరి జీవన విధానాన్ని తెలిపే పుస్తకమే ఇకిగయ్‌. సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవడం.. ఆ రోజుకు ఒక పరమార్థముందని విశ్వసించడం.. అర్థవంతంగా రోజును ముగించడం.. ఇదే వీరి జీవనశైలి సారాంశం. ఒకినావాలో వందేళ్లు జీవించిన పెద్దలు చాలామందే ఉన్నారు. ప్రత్యేకమైన వ్యాయామాలేవీ చేయరు కానీ.. శారీరక కష్టం తప్పనిసరిగా చేస్తుంటారు. వయసును లెక్కచేయని వృద్ధులు సైతం నిత్యం ఏదోఒక పనిలో నిమగ్నమై ఉంటారు. జంతు ఆధారిత ప్రొటీన్లను కాకుండా వృక్ష సంబంఽధిత ప్రొటీన్లను స్వీకరిస్తారు. దోరగా వేయించిన కూరగాయలు, చిలగడదుంపలు, టోపు వంటివన్నీ వీరి ఆహారంలో ప్రధానమైనవి. సోయా ఉత్పత్తులు ఎక్కువగా తింటారు. కడుపు నిండా భోజనం చేయరు. పొట్ట ఇంకా ఇరవై శాతం ఖాళీగా ఉందనుకున్నప్పుడే తినడం ఆపేస్తారు. ఒకినావన్లకు కష్టం వచ్చినప్పుడు ఆపన్నహస్తం అందించేందుకు.. సంతోషం కలిగినప్పుడు పంచుకునేందుకు మోఅయ్‌ అనే ఆత్మీయమిత్ర మండలి అండగా నిలుస్తుంది. తామెవరకూ ఒంటరి కాదన్న భరోసా కల్పిస్తుందీ నెట్‌వర్క్‌. ఇక ఒకినావన్ల ఇళ్లలో అవసరానికి మించిన సామగ్రిని ఉంచుకోరు. పరిమితమైన కుర్చీలు, బల్లలు ఉంటాయి. వరిగడ్డితో అల్లిన చాపలను పరుచుకుని కూర్చుంటారు. అర్థవంతమైన జీవనసూత్రమే వీరిని నడిపించే ఆరోగ్యరహస్యం.


ఆధ్యాత్మిక చింతన..

సెంట్రల్‌ అమెరికాలోని కోస్టారికా ద్వీపకల్పం నికోయా మరో అద్భుత బ్లూజోన్‌. జపాన్‌లోని ఒకినావన్లు ఎలాగైతే ఇకిగయ్‌ని అనుసరిస్తారో.. వీరు కూడా ‘ప్లాన్‌ దె విదా‘ అనే జీవనసూత్రాన్ని నమ్ముతారు. రెండింటి అర్థం ఒక్కటే.. మనమెందుకు జీవిస్తున్నాం? అన్నది. ఎంత వయసొచ్చినా సరే.. మరణభయంతో జీవించరు. సానుకూల దృక్పథంతోనే, రేపటి పట్ల విశ్వాసంతోనే నిద్రలేస్తారు. ఆ మనోబలమే వీరి ఆయుష్షును పెంచుతోందంటున్నారు అధ్యయనకారులు. కుటుంబసభ్యులు, బంధు, మిత్రుల నైతిక మద్దతు ప్రతి ఒక్కరికీ లభిస్తుంది.

book4.5.jpg

ఆ అనుబంధాలను పదిలంగా ఉంచే సంస్కృతి నికోయన్ల జీవితాల్లో వేళ్లూనుకుంది. ఈ ప్రాంతపు నీళ్లలో అత్యధిక క్యాల్షియం ఉన్నప్పటికీ హృద్రోగాలు తక్కువ. వృద్ధాప్యంలో ఎముకలు విరిగే సంఘటనలు అరుదని వైద్యులు చెబుతున్నారు. వీరి ఆహారపు అలవాట్లలో ప్రత్యేకమైనది.. రాత్రి భోజనాన్ని సూర్యాస్తమయంలోపే ముగించడం. అదీ తేలిగ్గా జీర్ణమయ్యేదే తింటారు. సొరకాయలాంటి స్క్వాష్‌, మొక్కజొన్న, బీన్స్‌ ప్రధాన పంటలు. నికోయన్లు సైతం సోషల్‌నెట్‌వర్క్‌ (ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా కాదు)లకు అత్యధిక ప్రాధాన్యమిస్తారు. బంధుమిత్రుల బృందాలన్న మాట. చిన్న శుభకార్యం జరిగినా.. విషాదాలు ఎదురైనా హాజరవుతారు. సుఖదుఃఖాలలో పాలుపంచుకోవడం వీరి సంస్కృతి.


ఇక, అమెరికాలోని ఏకైక బ్లూజోన్‌.. కాలిఫోర్నియాలోని లోమా లిండా. సగటు అమెరికన్ల కంటే వీరి జీవితకాలం అధికం. అత్యధికులు శాకాహారులు. వ్యాయామం తప్పనిసరి. మద్యం సేవించరు. జీవనశైలి వ్యాధులైన అధిక రక్తపోటు, మధుమేహం ఎక్కువ మందికి లేవు. కొలెస్ట్రాల్‌తో వచ్చే హృద్రోగాలు అరుదు. అమెరికాలో ఊబకాయులు ఎక్కువైనప్పటికీ లోమా లిండాలో మాత్రం లేరు. వారాంతపు సెలవుల్లో మరో పని పెట్టుకోరు. పూర్తి సమయాన్ని కుటుంబానికే వెచ్చిస్తారు. ఆహ్లాదంగా గడుపుతారు. ఆధ్యాత్మికత, ప్రకృతి ఆరాధన వంటివన్నీ వీరి జీవనంలో భాగం. దేవునిపై విశ్వాసం, ప్రార్థనలు, చింతన వంటివన్నీ తమను ప్రశాంతంగా ఉంచుతాయని నమ్ముతారు. సాధారణ అమెరికన్లలా ఉరుకులు పరుగులు పెట్టరు. తమ ప్రాంతాన్ని వీడి మరో చోటకు వెళ్లేందుకు ఇష్టపడరు. ఉన్నచోటే ప్రశాంతంగా జీవించడానికి ప్రాధాన్యమిస్తారు.


మనం ఏం నేర్చుకోవాలి?

ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదు బ్లూజోన్స్‌ ప్రజలపై పాతికేళ్లు అధ్యయనం చేసిన డాన్‌ బ్యూట్నర్‌.. ఒక మేనిఫెస్టోను రూపొందించాడు. ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, రాతల ద్వారా... ఆయురారోగ్యాలకు కొన్ని జీవనసూత్రాలను రూపొందించాడు. బ్లూజోన్స్‌ ప్రజలను చూసి మనమేం నేర్చుకోవాలి? అనే అంశంపైన ఆయన ప్రతిపాదించిన సూత్రాలు కచ్చితంగా మన ఆయుర్దాయాన్ని పెంచుతాయి. అవేంటో చూద్దాం. అందరిలా బ్లూజోన్స్‌ వాసులు ప్రత్యేకించి వ్యాయామాలు, జిమ్‌లు, వాకింగ్‌లు చేయరు. వారికి ఇల్లే వ్యాయామశాల. తోటలే వాకింగ్‌ జోన్‌లు. ఆ పనులన్నీ వదిలేసి వెళ్లక్కర్లేదు. ఇల్లు శుభ్రం చేస్తే చాలు. మొక్కల సంరక్షణ చూస్తే మేలు. అదే పెద్ద వ్యాయామం అంటారు బ్లూజోన్స్‌ ప్రజలు. నేచర్‌క్యూర్‌లలో చికిత్సల కంటే.. ఉదయాన్నే నిద్రలేచి, రాత్రిళ్లు త్వరగా నిద్రపోతే..


అదే చక్కటి హీలింగ్‌ అన్నది వారి అభిప్రాయం. జీవితమంటే రోజుకొకటి వినడం, మొదలుపెట్టడం, మానేయడం.. ఈ గందరగోళం కాదు. అర్థం పర్థం లేకుండా జీవించడం అసలే కాదు.. ఎవరికి వారే తమ జీవితానికి అర్థాన్ని నిర్వచించుకోవాలి. ఆ దిశగా ప్రయాణం చేయాలంటారు ఒకినావన్లు. ప్లాన్‌ దె విదా పాటించే నికొయన్స్‌ తత్వదృక్పథం కూడా ఇదే! ఒక్కమాటలో చెప్పాలంటే పర్పస్‌ఫుల్‌ లైఫ్‌ (అర్థవంతమైన జీవితం) ఉండాలన్నది బ్లూజోన్స్‌ ప్రజలు చెప్పే సందేశం. అందుకే ప్రతి ఉదయాన్నీ దృఢసంకల్పంతో మొదలుపెడతారు. ఆ శక్తి సానుకూల దృక్పథాన్ని ప్రోది చేస్తుంది. ఇక, నేటితరం తినే మితిమీరిన తిండి వల్ల కూడా అనేక జబ్బులొస్తున్నాయి. ఒకినావన్లు హర హచి బు అనే పద్ధతిలో భోజనం చేస్తారు. ఇంకా కడుపు నిండకముందే ముగించడం అన్నమాట.


ఇలాచేస్తే జీర్ణశక్తి అంత త్వరగా దెబ్బతినదు. ముందస్తు వృద్ధాప్యమూ రాదు. బ్లూజోన్స్‌లలో హాస్యప్రియత్వం ఎక్కువ. పదిమంది ఒక చోట పోగై మనసారా నవ్వుకుంటారు. ఫలితంగా హ్యాపీహార్మోన్లు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. అమ్మమ్మలు, తాతయ్యలకు మలివయసులో కుటుంబాలు అండగా నిలుస్తున్నాయి. పెద్దల అనుభవాలు పిల్లలకు పాఠాలు అవుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన ప్రశాంతతను కలిగిస్తోంది. అన్నింటికీ మించి డాన్‌ బ్యూట్నర్‌ అన్నట్లు నీలిసముద్రతీర వాసులు... బయటి ప్రపంచంలా బిహేవియరల్‌ ఎకనామిక్స్‌లో కొట్టుకుపోవడం లేదు. ఇక్కడ పోటీలేదు, పరుగులు లేవు, గెలుపోటముల ఫార్ములాలేవీ లేనేలేవు. ఐశ్వర్యం కంటే ఆయురారోగ్యాలే విలువైనవంటున్న బ్లూజోన్స్‌ .. నిండు నూరేళ్లు వర్ధిల్లుతున్నదందుకే!.

- మల్లెంపూటి ఆదినారాయణ

Updated Date - Mar 23 , 2025 | 10:04 AM