Share News

Sougat-e-Modi: ముస్లింలకు మోదీ రంజాన్‌ తోఫా

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:18 AM

బీజేపీ మైనార్టీలను చేరుకునేందుకు ‘సౌగాత్‌ ఎ మోదీ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రంజాన్‌ సందర్భంగా పేద ముస్లింలకు ప్రత్యేక కిట్‌లు పంపిణీ చేసింది. విపక్షాలు దీన్ని ఎన్నికల రాజకీయంగా విమర్శించాయి.

Sougat-e-Modi: ముస్లింలకు మోదీ రంజాన్‌ తోఫా

పండగ రోజుల్లో దుస్తులు, ఆహార పదార్థాల కిట్‌ అందజేత

రంజాన్‌లో 32 లక్షల మంది ముస్లింలకు బహుమతి

బీజేపీ నూతన కార్యక్రమం

బిహార్‌ ఎన్నికల కోసమేనని విపక్షాల విమర్శ

న్యూఢిల్లీ, మార్చి 25: మైనార్టీలకు చేరువ కావడం కోసం బీజేపీ ఓ ప్రత్యేక మెగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘సౌగాత్‌ ఎ మోదీ’ పేరుతో పండగ రోజుల్లో మైనార్టీలకు వివిధ వస్తువులను కానుకగా ఇవ్వాలని నిర్ణయించింది. తొలుత రంజాన్‌ సందర్భంగా ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మంగళవారం వీటిని ముస్లిం మైనార్టీలకు అందజేసింది. ‘సౌగాత్‌ కిట్‌’లో ఆహార పదార్థాలు, సేమియా, ఖర్జూరం, డ్రైఫ్రూట్స్‌, పంచదార; పురుషులు, స్త్రీల కోసం అవసరమయ్యే రూ.500-600 విలువ చేసే కుర్తా-పైజామా/ సల్వార్‌-కమీజ్‌ వంటి దుస్తులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు జమాల్‌ సిద్దికీ వివరించారు. రంజాన్‌ సందర్భంగా దేశం మొత్తం మీద 32 లక్షల మంది పేద ముస్లింలకు ఈ కిట్‌లను అందజేస్తామని తెలిపారు. దేశంలోని 32వేల మసీదుల సహకారంతో మైనార్టీ మోర్చాకు చెందిన 32 వేల మంది కార్యకర్తలు వీటిని పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రతి మసీదు పరిఽధిలో 100 మంది నిరుపేద ముస్లింలను గుర్తించి ఈ గిఫ్ట్‌ ప్యాకెట్లను అందజేయనున్నారు. మసీదు కమిటీ సహాయంతోనే లబ్ధిదారులను గుర్తించనున్నారు. మొట్టమొదటగా ముంబయిలోని పార్టీ మైనార్టీ మోర్చా చొరవ తీసుకొని నవీ ముంబయిలో 200 మంది పేదలను గుర్తించి ఈ సౌగత్‌ కిట్లను అందజేసింది. అది జాతీయ కార్యక్రమంగా రూపుదిద్దుకొంది. రంజాన్‌తో పాటు గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌, నౌరోజ్‌, నూతన సంవత్సర దినోత్సవాలు, ఇతర పర్వదినాల్లో అందజేస్తామని సిద్దికీ తెలిపారు.


ఓట్ల కోసమే సౌగత్‌ కిట్లు

బిహార్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే బీజేపీ ఈ పథకానికి రూపకల్పన చేసిందని విపక్షాలు ఆరోపించాయి. కాంగ్రెస్‌ ఎంపీ రాజీవ్‌ రంజన్‌ తన అభిప్రాయాన్ని చెబుతూ బిహార్‌లో 16-17 శాతం ముస్లింలు ఉన్నారని, కొన్ని జిల్లాలో చాలా ప్రభావం చూపుతారని అన్నారు. వారి ఓట్ల కోసమే బీజేపీ సౌగత్‌ కిట్లను తీసుకొచ్చిందని విమర్శించారు. బిహార్‌కు నిజంగా సౌగాత్‌ (బహుమతి) ఇవ్వాలనుకుంటే తొలుత వలసలు నివారించడం కోసం ఉద్యోగాలను కల్పించాల్సి ఉందని అన్నారు. శివసేన (ఠాక్రే) యువనేత ఆదిత్య ఠాక్రే సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడుతూ బీజీపీ కపటబుద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. వారు చేసేదంతా మంచి, ఇతరులు చేసేదంతా చెడ్డ అన్న రీతిలో వ్యవహరిస్తుందని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 04:18 AM