Share News

IPL 2025 : ఢిల్లీ వదల్లేదు

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:17 AM

ఐపీఎల్‌-18లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అదిరే బోణీ చేసింది. సోమవారం సాగర తీరాన అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌పై వికెట్‌ తేడాతో ఢిల్లీ నెగ్గింది....

IPL 2025 :  ఢిల్లీ వదల్లేదు

నేటి మ్యాచ్‌

వేదిక అహ్మదాబాద్‌

గుజరాత్‌ X పంజాబ్‌ రా.7.30 నుంచి

  • లఖ్‌నవూపై ఉత్కంఠ విజయం

  • పూరన్‌, మార్ష్‌ అర్ధ సెంచరీలు

అశుతోష్‌, విప్రజ్‌ మెరుపు ఇన్నింగ్స్‌

ఢిల్లీ ముందు 210 పరుగుల లక్ష్యం.. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు ఫట్‌.. ఓ దశలో స్కోరు 65/5. ఇంకేం.. లఖ్‌నవూ విజయం నల్లేరుపై నడకే అనుకున్నారంతా. కానీ మిడిలార్డర్‌ పట్టు వదల్లేదు. ఆశలు లేని స్థితిలో అరంగేట్ర బ్యాటర్‌ విప్రజ్‌ నిగమ్‌ అనూహ్య ఆటతీరుతో ఢిల్లీ అనూహ్యంగా పోటీలోకొచ్చింది. కీలక దశలో అతను నిష్క్రమించినా చివర్లో అశుతోష్‌ విధ్వంసానికి విశాఖ స్టేడియం హోరెత్తింది. దీంతో ఆఖరి ఓవర్‌లో మరో మూడు బంతులుండగానే మ్యాచ్‌కు ఢిల్లీ అద్భుతమైన ముగింపునిచ్చింది. అటు లఖ్‌నవూకు మాత్రం నిరాశే మిగిలింది.


విశాఖపట్నం: ఐపీఎల్‌-18లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అదిరే బోణీ చేసింది. సోమవారం సాగర తీరాన అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌పై వికెట్‌ తేడాతో ఢిల్లీ నెగ్గింది. చివర్లో ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడినా అశుతోష్‌ శర్మ (31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 నాటౌట్‌) తుదికంటా నిలిచి ఢిల్లీని గట్టెక్కించాడు. అతడికి విప్రజ్‌ నిగమ్‌ (15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39), స్టబ్స్‌ (22 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 34) సహకరించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌ (30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 75), మిచెల్‌ మార్ష్‌ (36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 72) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. స్టార్క్‌కు మూడు, కుల్దీ్‌పనకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ 19.3 ఓవర్లలో 9 వికెట్లకు 211 పరుగులు చేసి నెగ్గింది. శార్దూల్‌, సిద్దార్థ్‌, దిగ్వేష్‌, బిష్ణోయ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా అశుతోష్‌ నిలిచాడు. కాగా, ఐపీఎల్‌లో ఢిల్లీకిదే అత్యధిక ఛేదన కావడం విశేషం.


దంచేసిన ‘మిడిల్‌’: భారీ ఛేదనలో ఢిల్లీని ఓటమి అంచుల నుంచి మిడిలార్డర్‌ బ్యాటర్లు విజయతీరాలకు చేర్చారు. విప్రజ్‌, అశుతోష్‌ అదుర్స్‌ ఆటతీరుతో ఎల్‌ఎ్‌సజీ బౌలర్లను ఆడేసుకున్నారు. అయితే తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ మెక్‌గుర్క్‌ (1), అభిషేక్‌ పోరెల్‌ (0)లను పేసర్‌ శార్దూల్‌ పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాతి ఓవర్‌లోనే సమీర్‌ రిజ్వీ (4)ని స్పిన్నర్‌ సిద్దార్థ్‌ అవుట్‌ చేయడంతో 7 పరుగులకు ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అక్షర్‌ (22), డుప్లెసి (29) నాలుగో వికెట్‌కు 43 పరుగులు జత చేశారు. స్వల్ప వ్యవధిలోనే ఈ ఇద్దరూ పెవిలియన్‌కు చేరడంతో 65/5 స్కోరుతో ఢిల్లీ మరింత ఇబ్బందుల్లో పడింది. కానీ ఆ తర్వాత బ్యాటర్లు ఎదురుదాడికి దిగి లఖ్‌నవూకు ఓటమి భయాన్ని రుచి చూపించారు. ముందుగా స్టబ్స్‌ భారీ షాట్లతో చెలరేగి ఆరో వికెట్‌కు అశుతో్‌షతో కలిసి 48 పరుగులు జత చేశాడు. 13వ ఓవర్‌లో స్టబ్స్‌ రెండు సిక్సర్లు బాది వెంటనే అవుటయ్యాడు. అనంతరం అశుతో్‌షకు జత కలిసిన విప్రజ్‌ అనూహ్య రీతిలో చెలరేగాడు. ప్రతీ బంతిని బాదేస్తూ వేగంగా పరుగులు రాబట్టాడు. 14వ ఓవర్‌లో 4,4,6తో 17 రన్స్‌ అందించాడు. 16వ ఓవర్‌లో అశుతోష్‌ 6,4.. విప్రజ్‌ 4,4తో 20 రన్స్‌ వచ్చాయి. దీంతో ఒక్కసారిగా లఖ్‌నవూ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే 4 ఓవర్లలో 42 పరుగులు కావాల్సి ఉన్న దశలో విప్రజ్‌ వెనుదిరగడంతో లఖ్‌నవూ పోటీలోకొచ్చింది. కానీ అశుతోష్‌ 18వ ఓవర్‌లో 6,4,6తో 17 రన్స్‌ అందించడంతో మళ్లీ సీన్‌ మారింది. 19వ ఓవర్‌లో కుల్దీప్‌ (5) రనౌటైనా అశుతోష్‌ 6,4తో 16 రన్స్‌ వచ్చాయి. ఇక ఆరు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన వేళ అశుతోష్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.


ఆరంభం బాగున్నా..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ ఆరంభంలో మెరుపు బ్యాటింగ్‌ కనబర్చగా.. డెత్‌ ఓవర్లలో తడబడింది. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌, నికోలస్‌ పూరన్‌ల విధ్వంసానికి 250+ స్కోరు ఖాయమనుకున్న చోట అతికష్టంగా 200 రన్స్‌ చేరగలిగింది. మూడో ఓవర్‌లోనే మార్ష్‌ 6,4,6,4తో పేసర్‌ స్టార్క్‌కు చుక్కలు చూపించాడు. మరో ఓపెనర్‌ మార్‌క్రమ్‌ (15) ఐదో ఓవర్‌లో వెనుదిరిగినా.. పవర్‌ప్లేలో జట్టు 64/1 స్కోరుతో నిలిచింది. అటు 21 బంతుల్లోనే మార్ష్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయ్యింది. ఇక వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన పూరన్‌ సైతం ఎదురుదాడికి దిగి ఏడో ఓవర్‌లో మూడు సిక్సర్లతో చెలరేగాడు. అయితే అతడి సులువైన క్యాచ్‌ను రిజ్వీ వదిలేశాడు. ఈ ఓవర్‌లో 25 పరుగులు రావడం విశేషం. ఈ ఇద్దరి దూకుడుతో లఖ్‌నవూ జట్టు పదో ఓవర్‌లోనే 108 రన్స్‌ సాధించింది. అయితే 12వ ఓవర్‌లో మార్ష్‌ క్యాచ్‌ను లాంగాన్‌లో స్టబ్స్‌ పట్టేయడంతో రెండో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు పూరన్‌ మాత్రం తర్వాతి ఓవర్‌లోనే వరుసగా 6,6,6,6,4తో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. అలాగే 24 బంతుల్లోనే అతడి హాఫ్‌ సెంచరీ పూర్తయ్యింది. అయితే పంత్‌ లఖ్‌నవూ అరంగేట్రం డకౌట్‌తో ముగిసింది. లీగ్‌లోనే అత్యంత ఖరీదైన ఈ ఆటగాడిని 14వ ఓవర్‌లో కుల్దీప్‌ దెబ్బతీశాడు. ఆ వెంటనే ప్రమాదకర పూరన్‌ను స్టార్క్‌ బౌల్డ్‌ చేయడంతో లఖ్‌నవూ బ్యాటింగ్‌ లయ తప్పింది. చివరి ఐదు ఓవర్లలో 39 పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇందులో ఆఖరి ఓవర్‌లోనే మిల్లర్‌ (27 నాటౌట్‌) రెండు సిక్సర్లతో 15 రన్స్‌ ఉండడం గమనార్హం.


స్కోరుబోర్డు

లఖ్‌నవూ: మార్‌క్రమ్‌ (సి) స్టార్క్‌ (బి) విప్రజ్‌ 15, మిచెల్‌ మార్ష్‌ (సి) స్టబ్స్‌ (బి) ముకేశ్‌ 72, పూరన్‌ (బి) స్టార్క్‌ 75, పంత్‌ (సి) డుప్లెసి (బి) కుల్దీప్‌ 0, మిల్లర్‌ (నాటౌట్‌) 27, బదోని (సి) స్టబ్స్‌ (బి) కుల్దీప్‌ 4, శార్దూల్‌ (రనౌట్‌) 0, షాబాజ్‌ (సి/సబ్‌) విజయ్‌ (బి) స్టార్క్‌ 9, బిష్ణోయ్‌ (బి) స్టార్క్‌ 0, దిగ్వేశ్‌ రాఠి (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 209/8; వికెట్ల పతనం: 1-46, 2-133, 3-161, 4-169, 5-177, 6-177, 7-194, 8-194; బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-42-3, అక్షర్‌ పటేల్‌ 3-0-18-0, విప్రజ్‌ నిగమ్‌ 2-0-35-1, ముకేశ్‌ కుమార్‌ 2-0-22-1, కుల్దీప్‌ యాదవ్‌ 4-0-20-2, మోహిత్‌ శర్మ 4-0-42-0, స్టబ్స్‌ 1-0-28-0.


ఢిల్లీ: మెక్‌గుర్క్‌ (సి) బదోని (బి) శార్దూల్‌ 1, డుప్లెసి (సి) మిల్లర్‌ (బి) బిష్ణోయ్‌ 29, అభిషేక్‌ పొరెల్‌ (సి) పూరన్‌ (బి) శార్దూల్‌ 0, సమీర్‌ రిజ్వీ (సి) పంత్‌ (బి) సిద్దార్థ్‌ 4, అక్షర్‌ (సి) పూరన్‌ (బి) రాఠి 22, స్టబ్స్‌ (బి) సిద్దార్థ్‌ 34, అశుతోష్‌ శర్మ (నాటౌట్‌) 66, విప్రజ్‌ నిగమ్‌ (సి) సిద్దార్థ్‌ (బి) రాఠి 39, మిచెల్‌ స్టార్క్‌ (సి) పంత్‌ (బి) బిష్ణోయ్‌ 2, కుల్దీప్‌ (రనౌట్‌) 5, మోహిత్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 19.3 ఓవర్లలో 211/9; వికెట్ల పతనం: 1-2, 2-2, 3-7, 4-50, 5-65, 6-113, 7-168, 8-171, 9-192; బౌలింగ్‌: శార్దూల్‌ ఠాకూర్‌ 2-0-19-2, సిద్దార్థ్‌ 4-0-39-2, దిగ్వేశ్‌ రాఠి 4-0-31-2, రవి బిష్ణోయ్‌ 4-0-53-2, ప్రిన్స్‌ యాదవ్‌ 4-0-47-0, షాబాజ్‌తి అహ్మద్‌ 1.3-0-22-0.

ఇవి కూడా చదవండి..

MS Dhoni: ఐపీఎల్ బాగానే ఉంది.. మరింత మసాలా అవసరం లేదు: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ స్పందన

Harbhajan Singh: నల్ల ట్యాక్సీ అంటూ ఆర్చర్‌పై వివాదస్పద వ్యాఖ్యలు.. హర్భజన్‌పై తీవ్ర ఆగ్రహం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2025 | 03:18 AM