క్రీడలకు రూ.465 కోట్ల భారీ బడ్జెట్
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:59 AM
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో క్రీడా రంగానికి రికార్డు స్థాయిలో రూ.465 కోట్ల భారీ కేటాయింపులు చేశారు. 206 ఎకరాల విస్తీర్ణంలోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లోనే క్రీడా విశ్వవిద్యాలయాన్ని...

హకీంపేటలోనే స్పోర్ట్స్ వర్సిటీ
శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి హర్షం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో క్రీడా రంగానికి రికార్డు స్థాయిలో రూ.465 కోట్ల భారీ కేటాయింపులు చేశారు. 206 ఎకరాల విస్తీర్ణంలోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లోనే క్రీడా విశ్వవిద్యాలయాన్ని నిర్మించనున్నామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి క్రీడా రంగానికి రూ.137 కోట్లు అదనంగా కేటాయించారు. ఈ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పన్నెండు ఎంపిక చేసిన క్రీడాంశాల్లో ప్రత్యేక అకాడమీలను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నడూ లేని విధంగా తొలిసారి రూ.465 కోట్లు క్రీడలకు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చరిత్రలో నిలిచిపోతారని ‘శాట్’ చైర్మన్ శివసేనా రెడ్డి కొనియాడారు.
ఎల్బీ స్టేడియంలో పలువురు క్రీడాకారులతో కలిసి ఈ ఇరువురి చిత్ర పటాలకు శివసేనా రెడ్డి క్షీరాభిషేకం చేశారు. శాట్ సిబ్బంది, క్రీడాకారులతో కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. రాష్ట్రంలో కొత్త స్టేడియాల నిర్మాణం కోసం రూ.81.81 కోట్లు, ప్రతిభావంతులైన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించేందుకు రూ.16.6 కోట్లు, స్పోర్ట్స్ స్కూల్స్ అభివృద్ధికి రూ.51.68 కోట్లు ప్రత్యేకంగా కేటాయించినట్టు తెలిపారు.