Share News

IPL 2025: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ బ్యాటింగ్ మాఫియా కుట్రనా

ABN , Publish Date - Mar 22 , 2025 | 10:33 AM

ఐపీఎల్ వచ్చిందంటే బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతుంది. సామాన్య ప్రజలను బెట్టింగ్ ఊబిలోకి నెట్టి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈ బెట్టింగ్ మాఫియా కారణమవుతోంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై ఆర్థికంగా నష్టపోయి జనవరి, ఫిబ్రవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 మందికి పైగా ..

IPL 2025: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ బ్యాటింగ్ మాఫియా కుట్రనా
Betting Mafia

ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22వ తేదీ శనివారం నుంచి ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ సీజన్ పండుగలాంటిదని చెప్పొచ్చు. ఏ మ్యాచ్‌లో ఎలాంటి అద్భుతం జరుగుతుందో ఊహించలేము. కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నా నిన్నటి వరకు పెద్దగా పేరులేని ఆటగాళ్లు సైతం ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌తో ఫేమస్‌గా మారిన ఘటనలు గతంలో ఎన్నో చూశాం. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆటగాళ్లు పెద్దగా రాణించక ఫ్యాన్స్‌కు కోపం తెప్పించిన ఉదంతాలు చూశాము.


ఐపీఎల్ వచ్చిందంటే బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతుంది. సామాన్య ప్రజలను బెట్టింగ్ ఊబిలోకి నెట్టి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈ బెట్టింగ్ మాఫియా కారణమవుతోంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై ఆర్థికంగా నష్టపోయి జనవరి, ఫిబ్రవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నట్ల తెలుస్తోంది. తాజాగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సాయి తేజ ఆన‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి స్తోమతకు మించి అప్పులు చేశారు. ఆర్థికంగా చితికిపోవడంతో మూడు రోజుల క్రితం గడ్డి మందు తాగగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ ఏదో మూలన జరుగుతూనే ఉన్నాయి. మార్చ 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగ్ మాఫియా ఎత్తులను తెలుసుకుందాం.


ఫిక్సింగ్‌ అంటూ

ఐపీఎల్ మ్యాచ్‌లు కమర్షియల్ గేమ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ప్రచారం భారీ ఎత్తున జరుగుతోంది. ఓ విధంగా చెప్పాలంటే ఐపీఎల్‌లో ఫిక్సింగ్ జరుగుతుందనడానికి ఎలాంటి నిర్థిష్ట ఆధారాలు లేవు. ఆట ప్రారంభమయ్యే సమయానికి పిచ్ పరిస్థితి, వాతావరణ పరిస్థితులు, ఆటగాళ్ల ఫామ్‌పై జయపజయాలు ఆధారపడి ఉంటాయి. ఇటీవల కాలంలో బెట్టింగ్ మాఫియా పలానా మ్యాచ్ ఫిక్స్ అని, టాస్ గెలిచే టీమ్ ఇదేనంటూ ప్రచారం చేస్తోంది. నిజంగా బెట్టింగ్ మాఫియా అంచనా నిజమైతే ఫిక్సింగ్ నిజమేనన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దీంతో బెట్టింగ్ మాఫియా మాటున ప్రిడిక్షన్స్ ఇస్తున్న వారి మాయలో పడి వారు చెప్పిన విధంగా బెట్టింగ్ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫిక్సింగ్‌ జరుగుతుందనడానికి స్పష్టమైన ఆధారాలు మాత్రం లేవు. అలాగే ఫిక్సింగ్ పక్కాగా జరగదని చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రిడక్షన్స్ మాయలో పడి బెట్టింగ్‌కు బానిసలుగా మారే ప్రమాదం ఉంది.


గతంలో

ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు ఇప్పటివి కావు. 2013లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చందిలా, అంకిత్ చవాన్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టయ్యారు. ఈ ఘటన తర్వాత బీసీసీఐ యాంటీ- కరప్షన్ యూనిట్‌ను బలోపేతం చేసింది. ఆటగాళ్లకు కఠిన నిబంధనలు విధించింది. ఇవ్వన్నీ చేసినా ఫిక్సింగ్ ఆరోపణలు నేటికీ కొనసాగుతున్నాయి.


బెట్టింగ్ మాఫియా కుట్ర

ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతుంది. ఆన్‌లైన్ యాప్‌లు, టెలిగ్రామ్ చానల్స్, సోషల్ మీడియా ద్వారా మ్యాచ్ ఫిక్స్ అయింది. పలానా టీమ్ గెలుస్తుందంటూ ప్రచారం చేస్తూ సామాన్యులను బెట్టింగ్ ఊబిలోకి లాగుతుంది. ఈ ప్రచారంతో ఫిక్సింగ్ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. గతంలో దుబాయి, కరాచీ నుంచి నడిచే బెట్టింగ్ మాఫియా ఐపీఎల్ మ్యాచ్‌లపై వేల కోట్లలో బెట్టింగ్ నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి.


బెట్టింగ్ జోలికి పోవద్దు

ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతోంది. క్రికెట్‌ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడంలో తప్పులేదు. కానీ బెట్టింగ్ జోలికి వెళ్లడం వలన జీవితాలను నాశనం చేసుకునే అవకాశం ఉంది. బెట్టింగ్ ద్వారా లాభపడేది మాఫియా, బుకేలు తప్పితే సామాన్య జనం కాదనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి.. బెట్టింగ్‌కు దూరంగా ఉండటం మంచిది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 22 , 2025 | 10:33 AM