Share News

ACB: ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ సంస్థకు ఏసీబీ నోటీసులు

ABN , Publish Date - Jan 17 , 2025 | 03:11 AM

ఫార్ములా ఈ కారు రేస్‌ ప్రమోటర్‌గా వ్యవహరించిన ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ సంస్థకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ ప్రతినిధులను కోరింది.

ACB: ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ సంస్థకు ఏసీబీ నోటీసులు

  • ఫార్ములా ఈ కేసులో రేపు విచారణకు రావాలని పిలుపు

హైదరాబాద్‌, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ కారు రేస్‌ ప్రమోటర్‌గా వ్యవహరించిన ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ సంస్థకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ ప్రతినిధులను కోరింది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ అప్పటి చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిలను ఏసీబీ విచారించింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఫిర్యాదుదారు దాన కిశోర్‌ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఆ అంశాల ఆధారంగా తుది విచారణ ప్రారంభించింది. 2022 అక్టోబరు 25న జరిగిన తొలి త్రైపాక్షిక ఒప్పందంలో ప్రమోటర్‌గా ఉన్న ఏస్‌ నెక్ట్స్‌జెన్‌.. ఫార్ములా ఈ సీజన్‌ 9, 10, 11, 12లకు సంబంధించిన ఖర్చులను భరించాలి. హైదరాబాద్‌లో 2023 ఫిబ్రవరిలో జరిగిన సీజన్‌9 వ్యయాన్ని భరించింది. 10వ సీజన్‌ ప్రారంభానికి ముందే రూ.90 కోట్లను మూడు విడతల్లో ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ చెల్లించాలి.


ఆ ఏడాది మే నెలలో 50 శాతం అడ్వాన్స్‌ మొత్తం ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈవో) సంస్థకు వెళ్లాల్సి ఉంది. కానీ, ఒప్పందం నుంచి నెక్ట్స్‌జెన్‌ తప్పుకొంది. దీంతో పురపాలక శాఖ, ఎఫ్‌ఈవో మధ్య 2023లో మరో ఒప్పందం జరగ్గా.. తొలి విడతగా సుమారు రూ. 45.71 కోట్లను రెండు విడతలుగా విదేశీ కంపెనీకి హెచ్‌ఎండీఏ నుంచి చెల్లించారు. అయితే, ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ ఒప్పందం నుంచి ఎందుకు బయటకొచ్చింది? అలా తప్పుకొంటున్నట్లు పురపాలక శాఖకు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చిందా? మధ్యలో తప్పుకొంటే ప్రమోటర్‌ కంపెనీ ఎఫ్‌ఈవోకు చెల్లించాల్సిన పరిహారం సంగతేమిటి? స్పోర్టింగ్‌లో అనుభవం లేని గ్రీన్‌ కో డైరెక్టర్లు.. ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ పేరిట హడావుడిగా మూడు కంపెనీలను ఎందుకు రిజిస్ట్రేషన్‌ చేయించారనే అంశాలపై ఏసీబీ విచారణలో ప్రశ్నలడిగే అవకాశం ఉంది. గ్రీన్‌ కో డైరెక్టర్లయిన చలమలశెట్టి అనిల్‌, హరీశ్‌ కొల్లి ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు. కాగా, మాజీ మంత్రి కేటీఆర్‌కు చలమలశెట్టి అనిల్‌కు స్నేహ సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

Updated Date - Jan 17 , 2025 | 03:13 AM