Share News

‘యువ వికాసం’లో అర్హులందరికీ అవకాశం

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:42 PM

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు చేయూత అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకంలో అర్హులందరికీ అవకాశం కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

 ‘యువ వికాసం’లో అర్హులందరికీ అవకాశం
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా

- ఉపముఖ్యమత్రి మల్లు భట్టి విక్రమార్క

ఆసిఫాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు చేయూత అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకంలో అర్హులందరికీ అవకాశం కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాజీవ్‌ యువ వివకాస పథకం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు అయిదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వెనకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకం ద్వారా చేయూత అందిస్తామన్నారు. తద్వారా రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుతుందని వివరించారు. అర్హులైన వారు ఏప్రిల్‌ 14 లోపు దరఖాస్తు చేసుకునే విధంగా అధికారులు నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. రూ.50 వేల లోపు రుణాలకు 100 శాతం రాయితీ, లక్ష నుంచి రెండు లక్షల వరకు 80 శాతం, రెండు నుంచి నాలుగు లక్షల వరకు 70 శాతం రాయితీ లభిస్తుందని వివరించారు. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణాల ద్వారా అందిస్తామని తెలిపారు. ఈ పథకం కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల లోపు ఉండాలని, పట్టణ ప్రాంతాల వారికి రెండు లక్షల రూపాయల లోపు ఉండాలన్నారు. అంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రాజీవ్‌ యువశక్తి వికాసం పథకానికి వీలైనంత ఎక్కువ మంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. దినపత్రికలు, ప్రసార సాధనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా హాజరయ్యారు.

Updated Date - Mar 31 , 2025 | 11:42 PM