ఎట్టకేలకు మోక్షం
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:30 PM
గోదావరి వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో కరకట్టలు కట్టాలనే ప్రతిపాదనకు ఎట్టకేలకు మోక్షం లభించింది. జిల్లా కేంద్రంలోని రాళ్లవాగులో కరకట్టల నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.

- కరకట్టల నిర్మాణ పనులు ప్రారంభం
- రాళ్లవాగులో మట్టి చదును
- రూ. 250 కోట్లు కేటాయింపు
- రాళ్లవాగు బ్యాక్ వాటర్‌తో తప్పనున్న ముంపు గండం
మంచిర్యాల, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): గోదావరి వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో కరకట్టలు కట్టాలనే ప్రతిపాదనకు ఎట్టకేలకు మోక్షం లభించింది. జిల్లా కేంద్రంలోని రాళ్లవాగులో కరకట్టల నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. కరకట్టల నిర్మాణం పూర్తయితే ఇన్నేళ్లుగా ముంపు బాధలు పడుతున్న జిల్లా కేంద్రంలోని పలు కాలనీల ప్రజలకు ఆ బాధలు తప్పుతాయి. వర్షాకాలంలో రాళ్లవాగు ఉప్పొంగి ఏడెనిమిది కాలనీలు నీట మునుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నీటిపారుదలశాఖ అధికారులు వాగుకు ఇరువైపులా కరకట్టల నిర్మాణానికి ప్రతిపాదనలను అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అందజేశారు. వరద రక్షణ గోడల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు, భూసేకరణ అవసరం అవుతుండగా తలకు మించిన భారంగా భావించిన కేసీఆర్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసింది.
ఫ రెండు సంవత్సరాలుగా ముంపు....
వరుసగా రెండు సంవత్సరాలుగా జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లా కేంద్రంలో జనజీవనం అతలాకుతలం అవుతోంది. 2022 జూలై 13న కుండపోతగా వర్షం కురవడంతో జిల్లా కేంద్రంలోని వాగులు పొంగిపొర్లి గోదావరి ఉప్పొంగింది. వాగుల్లో నీరు ఎదురెక్కి గృహాల్లోకి చేరింది. అర్ధరాత్రి ఒక్కసారిగా వరదలు రావడంతో ప్రజలు తేరుకొనేలోపే కాలనీలు నీట మునిగాయి. భారీ వరదల కారణంగా ఏడెనిమిది కాలనీలు 48 గంటల పాటు నీటిలోనే మగ్గాయి. తిరిగి గత సంవత్సరం జూలైలో కురిసిన వర్షాలకు మళ్లీ ఆయా కాలనీలు నీట మునిగాయి. దీంతో ముందస్తుగా ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న అధికార యంత్రాంగం పునరావాస కాలనీలను ఏర్పాటు చేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఫ రాళ్లవాగులో మునిగిన కాలనీలు.....
భారీ వర్షాల కారణంగా గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. నదిలో చేరే అవకాశం లేక రాళ్ల వాగు, తోళ్లవాగుల్లో వరదనీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి, పోటు కమ్మాయి. జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు బ్యాక్ వాటర్ కారణంగా పాత మంచిర్యాల, రెడ్డి కాలనీ, ఎల్‌ఐసీ కాలనీ, రాంనగర్, ఎన్టీఆర్ నగర్, బైపాస్ రోడ్డు, ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో పెద్దమొత్తంలో ఇళ్లు మొదటి అంతస్థు వరకు నీట మునిగాయి. అలాగే తోళ్లవాగు నీరు కూడా నివాస గృహాల దరిదాపుల్లోకి చేరింది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు గత సంవత్సరం ఆగస్టు 22, 23 తేదీల్లో సర్వే జరిపి నీటి ప్రవాహాన్ని అంచనా వేశారు. కాసిపేట మండలంలోని దేవాపూర్‌లో పుట్టిన రాళ్లవాగు అటవీ ప్రాంతం గుండా ప్రవహించి జిల్లా కేంద్రానికి చేరుకుంటుంది. స్థానిక ఆర్‌ఆర్ నగర్, కార్మెల్ హైస్కూల్, గౌతమీనగర్, రెడ్డి కాలనీ, పాత మంచిర్యాల, రాంనగర్, ఎన్టీఆర్ కాలనీల మీదుగా ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. గత జూలైలో కురిసిన వర్షాల కారణంగా రాళ్లవాగులో 139.20 మీటర్ల ఎత్తున నీరు ప్రవహించినట్లు అధికారులు గుర్తించారు. పాత మంచిర్యాల వంతెన వద్ద 48006.35 క్యూసెక్కుల నీరు వాగు గుండా ప్రవహించినట్లు నిర్ధారణకు వచ్చారు. అలాగే తోళ్లవాగుపై ఉన్న చింతల చెరువు నుంచి వరద తాకిడి పెరగడంతో నివాస గృహాల్లోకి నీరు చేరింది.
ఫ రూ. 234.86 కోట్ల అంచనాతో....
మంచిర్యాల పట్టణంలోని రాళ్లవాగుకు కరకట్టల నిర్మాణం చేపట్టడం ద్వారా వరదను నివారించడానికి పట్టణంలోని కార్మెల్ స్కూల్ బ్రిడ్జి నుంచి 5.7 కిలోమీటర్ల పొడవున 140 మీటర్ల ఎత్తుతో ఇరువైపులా కరకట్టలు నిర్మించాలని.. అలాగే గోదావరి నది ఎడమవైపు ఒడ్డున రాళ్లవాగు కలిచే చోట రెండు కిలోమీటర్ల పొడవున కూడా కరకట్ట నిర్మాణం చేపట్టవలసి ఉండగా, ఆ మేరకు నివేదిక తయారు చేశారు. ఇందు కోసం ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం సుమారు రూ. 234 కోట్ల 86 లక్షల 33 వేలు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో కరకట్టల నిర్మాణానికి అవసరమైన పట్టా భూముల సేకరణకు సుమారు రూ. 200 కోట్ల 86 లక్షలు వెచ్చించాల్సి రాగా, కరకట్టల నిర్మాణానికి రూ. 20 కోట్ల 21 లక్షల 31వేలు, సీవోటీ ఎక్సవేషన్, పూడిక ఖర్చు రూ. 2 కోట్ల 48 లక్షల 43 వేలు, కరకట్ట రివిట్‌మెంట్‌కు రూ. 5 కోట్ల 25 లక్షల 51 వేలు, జీఎస్టీ, సీనరేజ్ చార్జీలు, డీఎంఎఫ్టీ, ఎస్‌ఎంఎఫ్, తదితరాలకు రూ. 6 కోట్ల 91 లక్షల 44 వేలు ఖర్చవుతుందని అంచనా వేశారు. వాగు మధ్య నుంచి ఇరువైపులా 65 ఫీట్ల వెడల్పుతో కరకట్టలు నిర్మించాల్సి ఉంది. ఇదిలా ఉండగా తోళ్లవాగులో రూ. 25 లక్షల అంచనా వ్యయంతో పూడిక తీత పనులు చేపట్టడం ద్వారా కరకట్టలు నిర్మించాల్సిన అవసరం లేకుండానే పరిస్థితిని చక్కదిద్దవచ్చునని అధికారులు ప్రతిపాదించారు.
ఎమ్మెల్యే చొరవతో....
రాళ్లవాగు బ్యాక్ వాటర్ కారణంగా మంచిర్యాల పట్టణం నీట మునుగుతుండటంతో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు కరకట్టల నిర్మాణం చేపట్టవలసిందిగా గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీన్ని పరిశీలనలోకి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధిత అధికారుల నుంచి నివేదికను తెప్పించుకుంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ. 250 కోట్లను కేటాయించారు. దీంతో కరకట్టల నిర్మాణానికి మార్గం సుగమం కాగా, కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. కరీంనగర్‌లోని మానేరు డ్యాం కరకట్టలు నిర్మించిన కాంట్రాక్టర్‌కే మంచిర్యాల పనులు అప్పగించినట్లు తెలుస్తోంది. కరకట్టల నిర్మాణం కోసం రాళ్లవాగులో ప్రస్తుతం మట్టిని చదును చేస్తున్నారు. గరిష్టంగా సంవత్సరం కాలపరిమితితో కరకట్టల నిర్మాణం పూర్తి కానుండగా, జిల్లా కేంద్రంలోని ముంపు ప్రజలకు బాధలు తప్పనున్నాయి.