GPS Location: బెట్టింగ్ ఇక్కడే.. లొకేషన్ ఎక్కడో..!!
ABN , Publish Date - Mar 25 , 2025 | 04:34 AM
మన దేశంలో పలు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ నిషేధించగా.. మరికొన్ని చోట్ల అనుమతి ఉంది. బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు తమ దందాకు అనుమతి ఉన్న రాష్ట్రాల లొకేషన్లతో.. ఇతర రాష్ట్రాల కస్టమర్లకూ గాలమేస్తున్నారు.

బెట్టింగ్ యాప్ నిర్వాహకుల వ్యూహం
వినియోగదారులతో.. ఫేక్ జీపీఎస్ ఇన్‌స్టాల్ చేయించి దందా
సెలబ్రిటీల విచారణలో వెల్లడి
హైదరాబాద్ సిటీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ‘మాకేపాపం తెలియ దు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు సిద్ధమయ్యే కస్టమర్ల జీపీఎస్ లొకేషన్ స్థానికంగా ఉండదని యాప్‌ల నిర్వాహకులు చెప్పారు. బెట్టింగ్ అనుమతి గల రాష్ట్రాల లొకేషన్‌నే వారు వాడతారన్నారు. దీంతో బెట్టింగ్ యాప్‌ల తరఫున ప్రచారం చేసినా.. చట్టపరమైన సమస్యలు ఎదురు కావని మాకు భరోసా ఇచ్చారు’ అని బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ప లువురు సెలబ్రిటీలు/ఇన్‌ఫ్లూయెన్సర్లు చెప్పినట్లు తెలిసింది. బెట్టింగ్ యాప్‌ల్లో కస్టమర్లు నమోదు కాగానే.. వారి లొకేషన్ మార్చేలా యా ప్స్ ఇన్‌స్టాల్ చేయిస్తారని దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు సమాచారం. మన దేశంలో పలు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ నిషేధించగా.. మరికొన్ని చోట్ల అనుమతి ఉంది. బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు తమ దందాకు అనుమతి ఉన్న రాష్ట్రాల లొకేషన్లతో.. ఇతర రాష్ట్రాల కస్టమర్లకూ గాలమేస్తున్నారు. బెట్టింగ్ ఆడే కస్టమర్లూ.. తమ రాష్ట్రంలో నిషేఽ దం ఉందని తెలిసీ.. నిర్వాహకులు చెప్పినట్లు ఫేక్ లొకేషన్లు వాడి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు.
ఫేక్ జీపీఎస్‌తో..
యూజర్లు బెట్టింగ్ యాప్‌ల్లో రిజిస్టర్ కాగానే.. వాటి ప్రతినిధులు ఏయే రాష్ట్రాల్లో నిషేధం ఉందో వివరిస్తారు. ‘‘మీ రాష్ట్రంలో నిషేధం ఉన్నా.. మీరు ఈ యాప్ వాడొచ్చు కానీ మీరు ఫేక్ జీపీఎస్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని, లొకేషన్ మార్చుకోవాలి’ అని సూచిస్తారు. లేదా.. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(వీపీఎన్) ప్రీమియం సేవలను వాడాలని, అందుకు రూ.500 ఖర్చు పెట్టుకోవాలని సలహా ఇస్తారు. ఈ చర్యలతో బెట్టింగ్ యాప్‌లకు అనుమతి ఉన్న రాష్ట్రాలతోపాటు.. విదేశాల లొకేషన్లూ ఎంచుకునే అవకాశం ఉంటుందని, దాన్ని గుర్తించడం సాధ్యం కాదని దర్యాప్తు అధికారులు తెలిపారు.
సెల్ ఆపరేటర్ల సహకారం!
సెల్‌ఫోన్ ఆపరేటర్లూ బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులకు పరోక్షం గా సహకరిస్తున్నారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ‘‘బెట్టింగ్ యాప్ ఉన్న వారు వైఫైతో ఇంటర్నెట్‌కు కనెక్టైతే.. ఫేక్ జీపీఎస్ యాప్‌లు పనిచేయవు. వాస్తవ లొకేషన్ మాత్రమే కనిపిస్తుంది. అందుకే బెట్టింగ్ చేసేవారు మొబైల్ డాటా వాడతారు. ని జానికి సెల్‌ఫోన్ ఆపరేటర్లు ఫేక్ జీపీఎస్, వీపీఎన్‌లు కట్టడి చే యొచ్చు. కానీ, బెట్టింగ్ ఆడేవారు గంటల కొద్దీ డాటా వాడడంతో ఆపరేటర్లకు రూ.కోట్లలో అదనపు ఆదాయం వస్తుంది. కొన్ని సెల్ సంస్థలైతే డాటా ప్యాక్‌లనూ ప్రకటించాయి. అంటే.. సెల్ సంస్థలు ఆదాయం కోసం బెట్టింగ్ యాప్‌లకు పరోక్ష సహకారం అందిస్తున్నట్లవుతోంది. ఈ లొసుగును బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు తమ దందాకు యథేచ్ఛగా వాడుకుంటున్నారు’’ అని కేసు దర్యాప్తులో పాలుపంచుకుంటున్న ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.