హై వేగానికి బలి
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:01 AM
మన్యంలో ఇరుకుగా, మలుపులు కనిపించని విధంగా ఉండే ఘాట్ మార్గాల్లో ప్రమాదాలు జరుగుతుండడం ఇన్నాళ్లూ చూశాం. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు వెడల్పుగా, ఎంతో చదునుగా ఉన్న జాతీయ రహదారిలో ప్రమాదాలు చోటుచేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా పాడేరు నుంచి అరకులోయ వెళ్లే జాతీయ రహదారిలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. అతివేగం, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం కారణంగానే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు.

- అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌తో ప్రాణాలు గాల్లోకి..
- జాతీయ రహదారిపై ప్రయాణమంటే బెంబేలెత్తిపోతున్న వాహనచోదకులు
- హుకుంపేట మండలం గడుగుపల్లి, కొట్నాపల్లి మధ్యలోనే అధికంగా ప్రమాదాలు
- గత ఏడాది ఐదుగురు, గత మూడు నెలల్లో మరో ఐదుగురు మృత్యువాత
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో ఇరుకుగా, మలుపులు కనిపించని విధంగా ఉండే ఘాట్ మార్గాల్లో ప్రమాదాలు జరుగుతుండడం ఇన్నాళ్లూ చూశాం. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు వెడల్పుగా, ఎంతో చదునుగా ఉన్న జాతీయ రహదారిలో ప్రమాదాలు చోటుచేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా పాడేరు నుంచి అరకులోయ వెళ్లే జాతీయ రహదారిలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. అతివేగం, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం కారణంగానే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. తాజాగా హుకుంపేట మండలం కొట్నాపల్లిలో లారీ ఢీకొన్న ఘటనలో పాస్టర్ దంపతులు అక్కడికక్కడే మృతి చెందడంతో హైవేపై ప్రమాదాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. ప్రధానంగా పాడేరు, హుకుంపేట మండలాల్లోనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
హుకుంపేట మండలం కొట్నాపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి డుంబ్రిగుడ మండలం పాములపుట్ట గ్రామానికి చెంది పాస్టర్ నూకరాజు(45), ఆయన భార్య దొసుద(39), మనుమడు అభిషేక్(10) కొట్నాపల్లిలో పార్థనలు ముగించుకుని బైక్‌పై స్వగ్రామం బయలుదేరుతుండగా, అరకులోయ నుంచి చింతపల్లి వెళుతున్న లారీ వారిని కొట్నాపల్లి గ్రామంలోనే ఢీకొట్టగా నూకరాజు, దొసుద అక్కడికక్కడే మృతి చెందగా, మనుమడు అభిషేక్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. రాత్రి వేళ కావడంతో వాహనాల రాకపోకలు అంతగా లేకపోవడంతో లారీ డ్రైవర్ అతివేగంగా నడిపి బైక్‌ను ఢీకొట్టడం వల్లే పాస్టర్ దంపతులు ప్రాణాలు కోల్పోయారని కొట్నాపలి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 18న ముల్యాపుట్టు గ్రామానికి చెందిన శ్రీకాంత్(25) బైక్‌పై పాడేరు వస్తూ పాటిమామిడి సమీపంలో హైవేలో కల్వర్ట్ గోడను ఢీకొన్న ఘటనలో మృతి చెందాడు. రెండు వారాల క్రితం ఆటో ప్రమాదంలో ఒకరు, బైక్ ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాదాలు ఈ ఏడాది మూడు నెలల్లోనే జరిగాయి.
గతేడాది ఐదుగురుమృతి
పాడేరు- అరకులోయ జాతీయ రహదారిలో ముఖ్యంగా హుకుంపేట మండలంలోనే గతేడాది జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదాలు జరిగే ఆయా ప్రదేశాలు సాధారణ మలుపులు, సమాంతరంగా ఉన్న ప్రాంతాలు కావడం విశేషం. అయితే అతివేగం, నిర్లక్ష్యంతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది గడుగుపల్లి వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో జాంకారంవలస గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త మృతి చెందగా, లారీ.. ఆటోలను ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే కొట్నాపల్లికి సమీపంలోనే వ్యాన్ బోల్తాపడిన ఘటనలో హైవే పనులు చేపడుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక యువ ఇంజనీర్ మృతి చెందగా, అరకులోయ నుంచి పాడేరుకు బైక్‌పై వెళుతున్న పర్యాటకుడు అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే బైక్ ప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు. ఇవి కేసులు నమోదై, వెలుగులోకి వచ్చినవి మాత్రమే. పాడేరు నుంచి అరకులోయ వరకు ఉన్న మొత్తం 46 కిలోమీటర్ల హైవే మార్గంలో కేవలం పాడేరు, హుకుంపేట మండలాల పరిధిలోకి వచ్చే సుమారు 15 నుంచి 18 కిలోమీటర్ల పరిఽధిలోనే అధికంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం విశేషం.
ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు
- మితి మీరిన వేగంతో వెళ్లే వాహనాలపై చర్యలు చేపట్టాలి.
- రాత్రి వేళల్లో కచ్చితంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేయాలి.
- గ్రామాల పరిధిలో వాహనాలు నెమ్మదిగా రాకపోకలు సాగించాలి.
- ప్రతి వాహనచోదకుడు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.
- జాతీయ రహదారిలో హైవే లేదా పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలి.