Share News

మందకొడిగా ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:09 AM

భూక్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల ఆనలైన ప్రక్రియ ముందుకు సాగడంలేదు.

మందకొడిగా ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ
మిర్యాలగూడలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తును స్వీకరిస్తున్న మునిసిపల్‌ అధికారులు

భూక్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల ఆనలైన ప్రక్రియ ముందుకు సాగడంలేదు. అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం 2020లో ప్లాట్లు, భూయజమానుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 2020 ఆగస్టు 26 నాటికి వచ్చిన దరఖాస్తులకు మోక్షం కలిగించడంతో పాటు ఆదాయ పెంపుకోసం విధివిధానాలను సమూలంగా మార్చింది. ఈ క్రమంలో గత నెలలో అందుకు ప్రత్యేక మాడ్యూల్‌ను సిద్ధం చేసిన ప్రభుత్వం రిజిస్ట్రేషన శాఖకు సైతం అప్పగించింది. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ ఆనలైన ప్రక్రియ మాత్రం నెమ్మదిగా సాగుతోంది.

- (ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ టౌన)

భూముల క్రమబద్ధీకరించడంతో పాటు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం యూజర్‌ మ్యాన్యువల్‌ ప్రీ రిజిస్ట్రేషన ఎల్‌ఆర్‌ఎస్‌-2020 పేరుతో వెబ్‌సైట్‌ రూపొందించింది. అంతేగాక క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకొచ్చిన దరఖాస్తుదారులకు వన టైం సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) విధానం అమలుచేయడంతో పాటు నిర్ధారించిన ఫీజులో 25శాతం రాయితీ ప్రకటించింది. ‘రిజిస్ట్రేషన.తెలంగాణ.గవ్‌.ఇన’ పోర్టల్‌లో ఈ సర్వీసెస్‌ మెనూ కింద ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రీ రిజిస్ట్రేషన సదుపాయాన్ని పొందుపరిచింది. ఈ లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాటు క్రమబద్ధీకరణకు అవసరమైన ఫీజు (రాయితీ పోను)చెల్లించే ఏర్పాటు చేసింది.

మూడంచెల విధానంలో..

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల క్రమబద్ధీకరణ కోసం మూడంచెల(లెవల్‌-1, లెవల్‌-2,లెవల్‌-3) విధానాన్ని అమలుచేస్తోంది. క్రమబద్ధీకరణ ప్రక్రియ లెవల్‌-1 దగ్గరే బ్రెక్‌ పడుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటు న్నారు. 25శాతం ఫీజురాయితీ పొందేందుకు చివరి తేదీ ఈ నెల 31 కాగా చివరలో రెండు రోజులు ఉగాది, రం జాన పండుగలు రావడంతో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకుంటాయో లేదోనన్న ఆందోళన నెలకొంది.

ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులిలా

ఉమ్మడి జిల్లాలోని 19 మునిసిపాలిటీలలో 1,93,213 దరఖాస్తులు వచ్చాయి. అయితే మొత్తంలో పరిష్కరించిన దరఖాస్తులు నేటికీ 50వేలు దాటలేదు. అధికారయంత్రాంగం ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు రాయితీపై ప్రచారం విస్తృతం చేయడంతో పాటు కరపత్రాలు, వాల్‌పోస్టర్లను సైతం ముద్రించింది.

ఉమ్మడి జిల్లాలో ...

జిల్లా ముసిపాలిటీలు దరఖాస్తు

నల్లగొండ ఎనిమిది 72,642

యాదాద్రి ఆరు 55,362

సూర్యాపేట ఐదు 65,209

మిర్యాలగూడ పరిధిలో...

మిర్యాలగూడలో 14,320 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు రాగా 302 దరఖాస్తులు పరిష్కరించారు. మరో 576 దరఖాస్తులకు సరైనపత్రాలు లేవని గుర్తించారు. 33 దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా, 4,112 దరఖాస్తులు నిషేధిత స్థలాల్లో ఉన్నట్లు నిర్ధారించారు. మొత్తం 8,143 దరఖాస్తులు క్రమబద్ధీకరించేందుకు సిద్ధంగా ఉండగా వారందరికీ ఆటో జనరేటెడ్‌ మెసేజెస్‌ నేరుగా వెళ్లాయి. దీంతో దరఖాస్తుదారులు మునిసిపల్‌ కార్యాలయానికి బారులుదీరుతుండగా సర్వర్‌లు ససేమిరా అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫీజు రాయితీ గడువు పెంచాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

ముందుకు వస్తున్న దరఖాస్తుదారులు

ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న దరఖాస్తుదారు రాయితీ ప్రకటించడంతో ముందుకు వస్తున్నారు. క్రమబద్ధీక రణకు ముందు ఫీల్డ్‌ ఇన్సపెక్షన చేయాల్సి ఉంటుంది. అయితే సమయం ఎక్కువగా లేకపోవడం, దరఖాస్తుదారులకు నేరుగా సంక్షిప్త సమాచారం అందడంతో ఫీజు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రక్రియ లెవల్‌-కు రాగానే నిలిచిపోతున్నాయి. ఎల్‌-1లో మూడు శాఖలుండగా ఎవరు ప్రాసెస్‌ చేసినా సదరు దరఖాస్తు మిగతా ఇద్దరికీ కనిపించాలి. కానీ కనిపించడం లేదు. దీంతో క్రమబద్ధీకరణ వేగంగా సాగడం లేదు.

Updated Date - Mar 28 , 2025 | 12:09 AM