Kavitha: హామీలను నెరవేర్చకుండా సీఎం టైం పాస్ చేస్తున్నారు
ABN , Publish Date - Mar 17 , 2025 | 04:39 AM
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్‌రెడ్డి టైం పాస్ చేస్తున్నారని.. రైతు భరోసా, ఉద్యోగాలు ఇవ్వకుండా మభ్యపెడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

రైతు భరోసా, ఉద్యోగాలు ఇవ్వడమే లేదు: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, సుభా్‌షనగర్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్‌రెడ్డి టైం పాస్ చేస్తున్నారని.. రైతు భరోసా, ఉద్యోగాలు ఇవ్వకుండా మభ్యపెడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం కవిత ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన హామీలను మరచిపోయిందని, బీఆర్‌ఎస్ హయాంలో రంజా న్ మాసంలో మసీదులకు లక్ష రూపాయలు ఇచ్చేదని, కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.
కాగా, గ్రూప్-1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న అనుమానాలను ప్రభుత్వం, టీజీపీఎస్సీ నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో పలు వర్సిటీ ల విద్యార్థులు, ప్రతినిధులు కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిసి చర్చించారు. తమ అనుమానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, శాసనమండలిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని వారు కోరారు. అనంతరం హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ భాష లో కవితలు, కథల పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.