Rythu Bharosa: టకీ టకీ భరోసా..
ABN , Publish Date - Jan 28 , 2025 | 03:52 AM
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ పథకం కింద 561 మండలాల్లోని 577 గ్రామాలకు చెందిన 4,41,911 మందికి పెట్టుబడి సాయం అందింది. మొత్తం 9,48,333 ఎకరాలకు సంబంధించి రూ.569 కోట్లు ఖాతాల్లో జమయ్యాయి.

రైతుల ఖాతాల్లో నగదు జమ.. 4.41 లక్షల మందికి 569 కోట్ల సాయం
రైతు కూలీలకు రూ.10 కోట్ల ఆత్మీయ భరోసా
ఒకే రోజు నాలుగు పథకాల అమలు ప్రారంభం
561 మండలాల్లో 577 గ్రామాల్లో లబ్దిదారులు
15,414 కుటుంబాలకు కొత్త రేషన్‌కార్డుల జారీ
పాత కార్డుల్లో అదనంగా 1.03 లక్షల మంది చేర్పు
72 వేల మందికి ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు
ఇండ్ల కోసం 80.50 లక్షల మంది దరఖాస్తులు
ఇప్పటికి 40 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తి
ఇళ్ల స్థలాలున్న వారు 21.30 లక్షల మంది
స్థలాలు లేనివారు 18.7 లక్షల మందిగా నిర్ధారణ!
వారంలో పూర్తి కానున్న పరిశీలన ప్రక్రియ
ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం: తుమ్మల
అచ్చంపేట మార్కెట్ కమిటీ ఘటనపై మంత్రి ఆరా
హైదరాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా పథకం నిధులు ఆదివారం (ఈ నెల 26) అర్ధరాత్రి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో టకీ టకీమని పడతాయంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగానే సోమవారం ఆయా రైతులకు నగదు జమ అయింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ పథకం కింద 561 మండలాల్లోని 577 గ్రామాలకు చెందిన 4,41,911 మందికి పెట్టుబడి సాయం అందింది. మొత్తం 9,48,333 ఎకరాలకు సంబంధించి రూ.569 కోట్లు ఖాతాల్లో జమయ్యాయి. వీరితోపాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు కూడా సాయం అందింది. మొదటి విడతగా తొలి రోజు 18,180 మంది వ్యవసాయ కూలీల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున జమ చేశారు. ఈ రెండు పథకాలకు కలిపి రూ.579 కోట్లను ఆర్థికశాఖ విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఆదివారం ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు శ్రీకారం చుట్టిన రేవంత్ సర్కారు.. వీటి ద్వారా తొలిరోజు మొత్తం 6,15,677 మంది అర్హులకు లబ్ధి చేకూర్చింది. ఆయా గ్రామాల్లోని రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతోపాటు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు కార్డులు జారీ చేశారు. ఇల్లు లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. 26న బ్యాంకులకు సెలవు కావడంతో సోమవారం ఉదయం నుంచి ఈ నిధులు రైతుల ఖాతాల్లోకి చేరాయి.
భూమిలేని రైతు కూలీలకు రూ.6 వేలు..
తొలిసారిగా ప్రభుత్వం భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు అమలు చేస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం మొదటి విడతకుగాను రూ.10.91 కోట్లను విడుదల చేసింది. తొలి రోజు 18,180 మంది వ్యవసాయ కూలీల ఖాతాల్లో ఒక్కో కుటుంబానికి రూ.6 వేల చొప్పున ఈ నగదును జమ చేశారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కాగా, గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన వారి నిరీక్షణ ఫలించింది. అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డుల జారీని ప్రభుత్వం ప్రారంభించింది. వీటితోపాటు పాత రేషన్ కార్డుల్లో అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేశారు. తొలి రోజు మొత్తం 15,414 కొత్త కార్డులు ఇచ్చారు. వీటి ద్వారా 51,912 మందికి లబ్ధి చేకూరనుంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అదనపు సభ్యుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో అదనంగా 1,03,674 మంది కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేశారు. వచ్చే నెల నుంచి వీరికి రేషన్ పంపిణీ చేయనున్నారు. ఇక ఇల్లులేని వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా 72 వేల మందికి తొలి రోజు ఇంటి పత్రాలను అందజేశారు.
ఇండ్ల దరఖాస్తుల పరిశీలన వారంలో పూర్తి..
ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తుల పూర్తిస్థాయి పరిశీలన ప్రక్రియ మరో వారంలో పూర్తి కానుంది. ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సర్వే కొనసాగుతోంది. 2023 డిసెంబరులో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 69,83,895 దరఖాస్తులు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 10,70,659 దరఖాస్తులు కలిపి మొత్తం 80,54,554 దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 7.77లక్షల దరఖాస్తుల పరిశీలన జరగ్గా.. మిగిలినవాటిని పరిశీలిస్తున్నారు. పథకం ప్రారంభానికి ముందుగానే దరఖాస్తుదారుల పరిశీలనతో పాటు, సర్వే చేసిన వాటిలో అర్హులు, అనర్హులను కూడా తేల్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మొదటిదశలో క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల వివరాలను సేకరించాలని, రెండో దశలో వాటిని 360 డిగ్రీల సాఫ్ట్‌వేర్‌లో ఉంచి క్షుణ్ణంగా పరిశీలించి పథకానికి అర్హులో, కాదో తేల్చాలని నిర్ణయించింది. కాగా, ఈ నెల 26న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి ముందు.. మొదటి విడత అర్హులుగా తేల్చినవారి జాబితాలను ప్రకటించేందుకు గ్రామసభలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ గ్రామసభల్లోనే మరోసారి పథకానికి దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దాంతో పూర్తిస్థాయి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నిలిచిపోయింది.
40 లక్షల దరఖాస్తుల పరిశీలన..
మండలానికో గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు ప్రారంభమైన నేపథ్యంలో.. మళ్లీ ఇప్పుడు పూర్తిస్థాయి పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. పథకం కోసం వచ్చిన మొత్తం 80.50 లక్షల దరఖాస్తుల్లో ఇప్పటివరకు సుమారు 40 లక్షల వరకు పూర్తిస్థాయి పరిశీలన జరిగింది. ఇందులో 21.30 లక్షల మందికి ఇళ్ల స్థలాలుండగా.. మరో 18.70 లక్షల మందికి ఇళ్ల స్థలాలు లేవని తేలినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆర్‌సీసీ ఇండ్లలో ఉంటున్నట్టు వచ్చిన దరఖాస్తులను అధికారులు పక్కనబె ట్టారు. మొదటి ప్రాధాన్యం కింద ఎంచుకున్న కేటగిరీల వారికి ఇళ్లను కేటాయించిన తరువాత ఆర్‌సీసీ ఇండ్లలో ఉంటున్న వారిలోనూ నిజమైన అర్హులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసింది. పూర్తిస్థాయి పరిశీలనలో వచ్చిన వివరాల ప్రకారం 28-30 శాతం రేకుల షెడ్లు, 25 శాతం గుడిసెలు, పూరిళ్లు, మిగిలిన వారు జీఐ షీట్లు, టార్పాలిన్ పట్టాలు కప్పుకొన్న ఇళ్లు, టైల్డ్ రూఫ్ ఇళ్లలో ఉంటున్నట్లు తేలింది. ఇక తాజాగా నిర్వహించిన గ్రామసభల్లోనూ ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు లక్షల్లో వచ్చాయి. వీటి పరిశీలనకు అవసరమైన సూచనలను త్వరలో విడుదల చేయనున్నారు. పరిశీలన పూర్తయ్యాక అర్హులుగా తేలిన వారికి పథకం అందనుంది.
తొలిరోజు రైతు భరోసా కింద
జమ అయిన నగదు జిల్లాలవారీగా..
జిల్లా ఎకరాలు రూ. కోట్లలో
ఆదిలాబాద్ 24150 14.49
కొత్తగూడెం 65117 39.07
హన్మకొండ 23833 14.3
జగిత్యాల 25817 15.49
జనగాం 26517 15.91
భూపాలపల్లి 14450 8.67
గద్వాల 20783 12.47
కామారెడ్డి 13917 8.35
కరీంనగర్ 26600 15.96
ఖమ్మం 47367 28.42
ఆసిఫాబాద్ 14367 8.62
మహబూబాబాద్ 30233 18.14
మహబూబ్‌నగర్ 28783 17.27
మంచిర్యాల 14533 8.72
మెదక్ 23433 14.06
మేడ్చల్ 5233 3.14
ములుగు 13767 8.26
నాగర్ కర్నూలు 38417 23.05
నల్లగొండ 78217 46.93
నారాయణపేట 23117 13.87
నిర్మల్ 17600 10.56
నిజామాబాద్ 30950 18.57
పెద్దపల్లి 16900 10.14
రాజన్న సిరిసిల్ల 20433 12.26
రంగారెడ్డి 33867 20.32
సంగారెడ్డి 40250 24.15
సిద్దిపేట 61267 36.76
సూర్యాపేట 63067 37.84
వికారాబాద్ 18633 11.18
వనపర్తి 20417 12.25
వరంగల్ 21383 12.83
భువనగిరి 44917 26.95
మొత్తం 948333 569 కోట్లు
హామీలను అమలు చేస్తున్నాం: మంత్రి తుమ్మల
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి.. సోమవారం రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిందని తెలిపారు. మొదటి విడతగా ప్రతి మండలానికి ఒక్కో గ్రామం చొప్పున 9,48,333 ఎకరాలకు పెట్టుబడి సాయం అందించినట్లు పేర్కొన్నారు. వీటికి సంబంధించి 4,41,911 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.569 కోట్లు జమ చేశామన్నారు. జిల్లాల వారీగా వివరాలను మంత్రి సోమవారం విడుదలచేశారు. కాగా, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన రైతుల ఆందోళన ఘటనపై అచ్చంపేట ఎమ్మెల్యేతోపాటు అధికారులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
Ajay Missing: హుస్సేన్‌సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్