CM Revanth Reddy: కలిసికట్టుగా వెళ్లి ప్రధానిని కలుద్దాం
ABN , Publish Date - Mar 18 , 2025 | 03:45 AM
బీసీ రిజర్వేషన్లకు పార్లమెంటు ఆమోదమే లక్ష్యంగా అన్ని పార్టీల నాయకులూ కలిసికట్టుగా వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.

42% రిజర్వేషన్ సాధనకు నేను నాయకత్వం వహిస్తా
ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాతో కలిసి రావాలి
ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పించే బాధ్యత బీజేపీదే
ఈ పార్లమెంట్ సెషన్‌లోనే ఆమోదం పొందేలా చేద్దాం
రిజర్వేషన్ సాధించే వరకూ విశ్రమించేది లేదు: సీఎం
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లకు పార్లమెంటు ఆమోదమే లక్ష్యంగా అన్ని పార్టీల నాయకులూ కలిసికట్టుగా వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు తాను నాయకత్వం వహిస్తానని, ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పించే బాధ్యతను రాష్ట్ర బీజేపీ నాయకులు తీసుకోవాలని కోరారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చించేందుకు తాను రాహుల్ గాంధీతో మాట్లాడతానని, అందరూ ఏకమైతే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ ఆమోదం పొందేలా చేయవచ్చని అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలనూ కలుపుకొని వెళతానని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నాయకులంతా కలిసి ప్రధానిని కలుద్దామన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ తమ లెక్క ఎంతో చెప్పాలని బలహీనవర్గాలు కోరుతున్నాయి. జనాభా లెక్క తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని గతంలో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని పాదయాత్ర సమయంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రిజర్వేషన్లను పెంచి బలహీన వర్గాలకు అండగా నిలవాలని కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేసింది. అందుకు తగ్గట్లుగానే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టగానే గత ఏడాది ఫిబ్రవరి నాలుగో తేదీన బీసీ కులగణన ప్రక్రియ ప్రారంభించాం. రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, మేధావులు తదితరులందరితో చర్చించి 42ు రిజర్వేషన్ అమలుకు నిర్ణయం తీసుకున్నాం. ఈ ఏడాది ఫిబ్రవరి 2న బీసీ కమిషన్ క్యాబినెట్‌కు నివేదిక అందించింది.
సరిగ్గా, ఒక్క ఏడాదిలోనే అంటే.. ఈ ఏడాది ఫిబ్రవరి 4న క్యాబినెట్లో దానిని ఆమోదించడమే కాకుండా అదే రోజు శాసనసభలో ప్రవేశపెట్టాం’’ అని సీఎం రేవంత్ వివరించారు. అందుకే, ఫిబ్రవరి నాలుగో తేదీని సామాజిక న్యాయ దినంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించేందుకు బిల్లులను సభలో ప్రవేశపెట్టామని, జెండాలు, ఎజెండాలకు అతీతంగా పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో సహకరించినందుకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో పారదర్శకంగా కుల గణన సర్వే చేపట్టామని, ఈ లెక్కలు నూటికి నూరు శాతం కరెక్ట్ అని అన్నారు. 56.36ు ఉన్న బలహీన వర్గాలకు 42ు రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లులో ప్రతిపాదించామని చెప్పారు. ‘‘గత ప్రభుత్వం 2017లో బిల్లు నంబరు 6 ద్వారా బీసీలకు 37 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించి.. శాసనసభలో ఆమోదించి గవర్నర్‌కు పంపింది. దానిని ఆయన రాష్ట్రపతికి పంపారు. ఇప్పటికే రాష్ట్రపతి ఆమోదానికి ప్రతిపాదనలు వెళ్లినందున తాజా ప్రతిపాదనలకు చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
వీటిని పరిహరించేందుకు గత ప్రభుత్వ ప్రతిపాదనలను ఉపసంహరిస్తూ.. తాజా ప్రతిపాదనల్ని పంపిస్తున్నాం’’ అని వివరించారు. వివాదాలకు తావు లేకుండా బలహీనవర్గాలకు న్యాయం చేయడమే తమ ప్రభుత్వ విధానమన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం తయారు చేసుకున్న చట్టాల్లో అవసరమైతే రాజ్యాంగ సవరణ చేపట్టి బలహీన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42ు రిజర్వేషన్ పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని, అందరి అభిప్రాయం ఒకటే అయినప్పుడు సాధ్యం కాక ఎందుకు ఆగుతుందని ప్రశ్నించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని, ఈ సమావేశాల్లోనే బిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకుందామని తెలిపారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇప్పించే బాధ్యతను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇతర బీజేపీ నాయకులు తీసుకోవాలని కోరారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం లేఖ పంపించాలని సీఎస్, అధికారులను ఆదేశించిన సీఎం.. దాని కాపీని బీజేపీ నాయకులకు అందజేయాలని సూచించారు. తక్షణం ప్రధాన మంత్రిని కలిసి రిజర్వేషన్లలో మార్పులకు అవసరమైన సవరణలు చేసేందుకు అడుగు ముందుకు వేయాలన్నారు. రిజర్వేషన్ సాధించే వరకూ విశ్రమించేది లేదని, సాధించేందుకు అవసరమైన నాయకత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.