Share News

Yadagirigutta: గుట్ట స్వర్ణ గోపురం ప్రారంభోత్సవం నేడు

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:05 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపుర ప్రారంభోత్సవం ఆదివారం జరగనుంది. దేశంలోనే అత్యంత ఎత్తయిన స్వర్ణ విమాన గోపురంగా రికార్డులకెక్కిన ఈ గోపుర ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారు.

Yadagirigutta: గుట్ట స్వర్ణ గోపురం ప్రారంభోత్సవం నేడు

  • హాజరుకానున్న సీఎం రేవంత్‌ రెడ్డి

యాదాద్రి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపుర ప్రారంభోత్సవం ఆదివారం జరగనుంది. దేశంలోనే అత్యంత ఎత్తయిన స్వర్ణ విమాన గోపురంగా రికార్డులకెక్కిన ఈ గోపుర ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారు. ఆదివారం ఉదయం 11.54 గంటలకు మూలా నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహుర్తాన శ్రీసుదర్శన లక్ష్మీనరసింహ స్వామివారికి గోపురాన్ని అంకితం చేయనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మఠాధిపతులు పాల్గొంటారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజ జీయర్‌ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు సీఎం హెలికాప్టర్‌లో గుట్టకు రానున్నారు. స్వర్ణ విమానగోపురం ప్రతిష్ఠామహోత్సవం, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు భదత్రా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొండపై జరిగే సంప్రోక్షణ పూజల్లో సుమారు 25వేల మంది భక్తులు పాల్గొంటారని అంచనా.


50.5 అడుగుల ఎత్తు.. 68 కిలోల బంగారం

స్వర్ణ విమాన గోపురం ఎత్తు 50.5 అడుగులు ఉంటుంది. విమానగోపుర వైశాల్యం 10,759 చదరపు అడుగులు. గోపురం మొత్తానికి స్వర్ణతాపడం చేసేందుకు 68 కిలోల బంగారాన్ని వినియోగించారు. చెన్నైకి చెందిన మెసర్స్‌ స్మార్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ ఈ పనులు నిర్వహించింది. బంగారం తాపడం చేసేందుకు మొత్తం రూ.3.90 కోట్లు ఖర్చు చేశారు. తాపడం అమర్చే పనులకు మొత్తం 68కిలోల బంగారం, గోల్డ్‌ ఫ్లేటింగ్‌ తయారీ, అమరికకు రూ.8కోట్లు వరకు వెచ్చించారు. మార్చి 1 నుంచి జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే స్వర్ణతాపడం పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులు సకాలంలో పూర్తి చేసి సంప్రోక్షణ పూజలు నిర్వహించారు.


కేసీఆర్‌ పిలుపు.. రూ.25 కోట్ల విరాళాలు

మాజీ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభు త్వం దాదాపు రూ.1280కోట్లతో యాదగిరి గుట్ట ఆలయాన్ని పునర్నిర్మించింది. ప్రధాన ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయిస్తామని 2021 అక్టోబరు 19న కేసీఆర్‌ ప్రకటించారు. ఇందుకు సుమారు 125కిలోల బంగారం అవసరమని, రూ.65కోట్ల మేర ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగం కావాలని పిలుపునిచ్చిన కేసీఆర్‌.. తమ కుటుంబం తరఫున స్వామివారికి 1కిలో 16తు లాల బంగారాన్ని సమర్పించారు. వివిధ వర్గాల నుంచి స్వర్ణతాపడం పనులకు రూ.25 కోట్ల మేర వి రాళాలు అందాయి. అలాగే, 10కిలోల 577.390గ్రా ముల బంగారాన్ని కూడా భక్తులు అందజేశారు.

Updated Date - Feb 23 , 2025 | 04:05 AM