CM Revanth Reddy: దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి
ABN , Publish Date - Feb 10 , 2025 | 03:47 AM
రాజ్యాంగపరమైన హక్కుల సాధనకు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జనాభా దామాషా పద్ధతిలో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రంలోని మోదీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు.

కుటుంబ నియంత్రణ పాటిస్తే.. శిక్షిస్తారా?
జనాభా దామాషాతో పునర్విభజన చేస్తే
బిమారు రాష్ట్రాలతోనే కేంద్రంలో సర్కారు
దక్షిణాది రాష్ట్రాల అవసరం ఉండదు
ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి విఘాతం
పునర్విభజనలో రాష్ట్రాల్లో ఉన్న సీట్లను 50ు
పెంచాలి.. దీంతో అన్ని రాష్ట్రాల్లో పెరుగుతాయి
ఒకే దేశం.. ఒకే ఎన్నికకు మేం అంగీకరించం
ఈ విధానంతో స్థానిక సంస్థలుగా రాష్ట్రాలు
ప్రధాని మోదీ అసలు ఉద్దేశం అదే
మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్
లెటర్స్ సదస్సులో సీఎం రేవంత్
బీజేపీ, ప్రధాని మోదీ ప్రతిదాన్నీ తమ నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ముప్పు. దీన్ని తిప్పికొట్టేందుకు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరి ప్రజలు ఏకమవ్వాలి.
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగపరమైన హక్కుల సాధనకు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జనాభా దామాషా పద్ధతిలో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రంలోని మోదీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు తగ్గుతాయని.. బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి బిమారు రాష్ట్రాల్లో గెలిచే సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని, దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరమే పార్టీలకు ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తిరువనంతపురంలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. మాతృభూమి ఎడిటర్, ఆహూతుల ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ.. కుటుంబ నియంత్రణను పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తారా?’’ అని కేంద్రాన్ని నిలదీశారు. ఈ చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘జనాభా లెక్కల ప్రకారం కాకుండా.. ప్రతి రాష్ట్రానికి 50ు సీట్లను పెంచాలి. దీనివల్ల అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి’’ అని సూచించారు. ఇదే సూచనను మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఒకే దేశం.. ఒకే ఎన్నిక విధానానికి తాము వ్యతిరేకమని, ఇది ఒకే వ్యక్తి.. ఒకే పార్టీకి నిదర్శనమని.. ఇదే మోదీ రహస్య అజెండా అని ఆరోపించారు. ‘‘బీజేపీ, ప్రధాని మోదీ ప్రతిదాన్నీ తమ నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ముప్పు. దీన్ని తిప్పికొట్టేందుకు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ప్రజలు ఏకమవ్వాలి’’ అని పిలుపునిచ్చారు. హరియాణాలో కాంగ్రె్‌సను కేజ్రీవాల్ దెబ్బతీశారని, అది ఆయనకు ఢిల్లీలో ప్రతికూలమైందని, అంతిమంగా బీజేపీ లబ్ధి పొందిందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రాలపై పెత్తనానికి యత్నం
రాష్ట్రాలను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘‘రాష్ట్రం అనేది ఒక యూనిట్. రాష్ట్రాల సమాఖ్య ఈ దేశం. రాష్ట్రాల ప్రాథమిక హక్కులను మోదీ విస్మరించలేరు. రాష్ట్రాలను స్థానిక సంస్థలుగా మార్చి, తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని మోదీ ఆకాంక్షిస్తున్నారు. ఇప్పుడు విద్యారంగంలో మార్పు లు అందుకు నిదర్శనం. భవిష్యత్‌లో రాష్ట్ర వర్సిటీల ఉపకులపతులను సైతం కేంద్రమే నిర్ణయించేలా నిబంధనలను మారుస్తున్నారు. నదుల అనుసంధా నం విషయంలోనూ రాష్ట్రాల అధికారాలను లాక్కొంటున్నారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలను రాజ్యాంగం స్పష్టంగా పేర్కొన్నా.. మోదీ మాత్రం అన్నీ తన చేతుల్లోకి తీసుకుంటున్నారు. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ అన్నది ఏ విధంగానూ సరైంది కాదు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఎన్నికలు వేర్వేరు. తప్పనిసరైతే ‘ఒకే రాష్ట్రం.. ఒకే ఎన్నిక’ నినాదంతో.. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్, మునిసిపాలిటీ, సహకార ఎన్నికలను నిర్వహించవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. ప్రజలు, రాజకీయపార్టీలు దీన్ని అర్థం చేసుకోవడం లేదని, మేధావులు దీనిపై ఆలోచన చేయాలని కోరారు.
పీవీపై బీజేపీ వాట్సాప్ వర్సిటీ ప్రచారం
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇవ్వలేదన్నది బీజేపీ, మోదీ వాట్సాప్ వర్సిటీ సృష్టించిన భావన మాత్రమేనని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘పీవీని గ్రామపంచాయతీ సర్పంచ్ నుంచి ప్రధాని స్థాయికి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కూడా ఏఐసీసీ అధ్యక్షుడిగా, కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. వీరిద్దరినీ కాంగ్రె స్‌కు దూరం చేసే కుట్ర జరుగుతోంది. పటేల్‌కు ఆరెస్సెస్ ముద్ర వేశారు. తామే పటేల్ వారసులమని బీజేపీ నేతలు చెప్పుకొంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు కాంగ్రెస్ ఎన్నో అవకాశాలిచ్చింది. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యారు. జైపాల్‌రెడ్డి కేంద్ర మంత్రిగా పనిచేశారు. వాట్సాప్ వర్సిటీ ద్వారా బీజేపీ, మోదీ సృష్టించే మాయాజాలంలో ఎవరూ పడొద్దు’’ అని కోరారు.
ప్రజలు మూడో పార్టీకి అవకాశం ఇవ్వట్లేదు
ఇటీవలికాలంలో ప్రజలు మూడోపార్టీకి అవకాశం ఇవ్వడం లేదని, అయితే అధికార పార్టీ, లేదంటే విపక్షం వైపు మొగ్గుచూపుతున్నారని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఎన్నికలు కూడా ఓ జాతీ య, మరో ప్రాంతీయ పార్టీ మధ్యే కేంద్రీకృతమైందని గుర్తుచేశారు. ‘‘ప్రజలు తమ ఓటు వృథా కావొద్దని భావిస్తున్నారు. దాంతో.. రెండు పార్టీల మధ్యే ఎన్నికలు కేంద్రీకృతమవుతున్నాయి. తెలంగాణలో బీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిలిచింది. ప్రధాని మోదీ స్వయంగా ప్రచారం చేసినా.. బీజేపీకి 13ు ఓట్లే వచ్చాయి. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన రెండు ఉప ఎన్నికల్లో బీజేపీనే గెలిచింది. ఆ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు డిపాజిట్లు కూడా రాలేదు. కానీ, సాధారణ ఎన్నికలు వచ్చేసరికి, కాంగ్రెస్ ఓటు బ్యాంకు 40శాతానికి పెరిగింది. అధికారంలోకి వచ్చింది’’ అని చెప్పారు. ప్రజలను జాతీయ నాయకుల పేరుతో ఓట్లు అడిగితే ఫలితం ఉంటుందని రేవంత్ అభిప్రాయపడ్డారు. ‘‘సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీజేపీ మోదీ పేరుతో ఓట్లడుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రేవంత్‌రెడ్డి పేరుతో ఓట్లడిగితే.. ఓటర్లు అగ్రకులాన్ని చూస్తారు. తాము బీసీలమని, రేవంత్‌కు ఎందుకేయాలని అడుగుతారు. అదే సోని యా పేరుతో ఓట్లడిగితే.. కులాన్ని పెద్దగా పట్టించుకోరు. మేం అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా గాంధీ పేరుతోనే ఓట్లడిగాం. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాను గెలిపించాలని కోరాం’’ అని వివరించారు.
ట్రిలియన్ డాలర్ల జీఎ్‌సడీపీనే లక్ష్యం
తెలంగాణ జీఎ్‌సడీపీ ప్రస్తుతం సుమారు 200 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉందని, 2035 నాటికి దానిని ట్రిలియన్ యూఎస్ డాలర్లుగా మార్చాలనుకుంటున్నామన్నారు. ‘‘తెలంగాణ రా ష్ట్రాన్ని హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అనే మూడు జోన్లుగా విభజించాం. 160 కిలోమీటర్ల పొడవైన ఔవుటర్ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్) పరిధిలోని కోర్ అర్బన్ ఏరియాలో 1.2 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాలకు కేంద్రంగా ఉంది. చా ర్మినార్, హైదరాబాద్ బిర్యానీ, ముత్యాలకు హైదరాబాద్ ప్రసిద్థి. ఓఆర్‌ఆర్ పరిధిలోని ఈ కోర్ అర్బన్ ఏరియాను సర్వీస్ సెకార్ట్స్‌తో 100ు నెట్ జీరోగా మార్పు చేయనున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నాం. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం. ఇందులో ఏఐ సిటీ ఉంటుంది. యువత కోసం యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ నిర్మిస్తున్నాం. దావో్‌సలో రూ.1,82,000 కోట్లకు పైగా పెట్టుబడులను సాధించాం. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేప ట్టాం. మూసీ ఒడ్డున 200 ఎకరాల్లో గాంధీ సరోవర్‌ను నిర్మిస్తున్నాం. మాకు తీరప్రాంతం లేదు. అందుకే.. డ్రైపోర్టులను నిర్మిస్తాం. వాటిని ఏపీలోని సీపోర్టులతో లింక్ చేస్తాం. హైదరాబాద్ వృద్ధి చెందితే.. తెలంగాణ రైజింగ్ సాధ్యమవుతుంది. రీజనల్ రింగ్‌రోడ్డు, రీజనల్ రింగ్ రైల్వేను నిర్మించాలని నిర్ణయించాం. ఇటీవల ఎనర్జీ పాలసీని తీసుకొచ్చి, ఈవీలపై ఉన్న అన్ని పన్నులను తొలగించాం. ఈవీల అమ్మకాల్లో తెలంగాణ తొలిస్థానంలో ఉంది. 3 వేల ఆర్టీసీ బస్సులను దశలవారీగా ఈవీగా మారుస్తున్నాం. ఔషధాలు, విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ ముందంజలో ఉంది’’ అని రేవంత్ రెడ్డి వివరించారు.
ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినం!
సమగ్ర కుల సర్వే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, దాన్ని అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టామని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణపైనా తీర్మానం చేశామన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ఫిబ్రవరి 4ను సామాజిక న్యాయ దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ తాజా ఆర్థిక సర్వే ప్రకారం అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, గ్లోబల్ ఏఐ యూసేజ్ నివేదిక ప్రకారం ఏఐలో తామే మొదటి స్థానంలో ఉన్నామని గుర్తుచేశారు. తలసరి ఆదాయంలోనూ తెలంగాణ టాప్‌లో ఉందని, 2035 కల్లా తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారితే.. అది దేశ వృద్ధికి ప్రయోజనం కాదా? అని ఆయన ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..