Cyber Crime: కన్నీరే ఆనందబాష్పాలై..
ABN , Publish Date - Apr 05 , 2025 | 05:01 AM
సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ రికవరీ చేక్కులను బాధితులకు అందజేశారు. కాగా సైబర్ క్రిమినల్స్ చేతికి చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్న బాధితులు.. సకాలంలో స్పందించి మొదటి గంటలోపు (గోల్డెన్ అవర్) పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుందని సీపీ పేర్కొన్నారు.

సైబర్ వలకు చిక్కి లక్షలు పోగొట్టుకున్న బాధితులు
వెంటనే ఫిర్యాదు చేసిన కేసులకు సంబంధించి రూ.3.75 కోట్లు రికవరీ చేసిన సైబర్ క్రైం పోలీసులు
కోర్టు అనుమతితో 55 మంది బాధితులకు చెక్కులు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయనో, రుణాలిప్పిస్తామనో, క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని ఓటీపీ చెప్పాలనో ప్రలోభపెట్టడం ద్వారా.. డ్రగ్స్ పార్శిల్ దొరికిందనో, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని బెదిరించడం ద్వారానో ఎంతోమంది అమాయకులను సైబర్ నేరగాళ్లు నిండా ముంచుతున్నారు. అయితే తాము మోసపోయామని వెంటనే గుర్తెరిగి.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదుచేస్తే వారు పోగొట్టుకున్న డబ్బు రికవరీ అయ్యే అవకాశాలెవక్కువగా ఉంటాయి.
ఇలా ఫిర్యాదులొచ్చిన వివిధ కేసులకు సంబంధించి సాంకేతిక ఆధారాల ప్రకారం సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాల్లోని డబ్బును ఫ్రీజ్ చేసి బాధితుల కళ్లలో ఆనందాన్ని నింపారు పోలీసులు. ఇటీవల కాలంలో నమోదైన 55 కేసుల్లో రూ. 3.75 కోట్లు రికవరీ చేసి కోర్టు అనుమతితో బాధితుల ఖాతాల్లో జమ చేశారు. సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ రికవరీ చేక్కులను బాధితులకు అందజేశారు. కాగా సైబర్ క్రిమినల్స్ చేతికి చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్న బాధితులు.. సకాలంలో స్పందించి మొదటి గంటలోపు (గోల్డెన్ అవర్) పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుందని సీపీ పేర్కొన్నారు.