CM Revanth Reddy: పంచుకు తింటే.. పట్టు వచ్చినట్లా?
ABN , Publish Date - Mar 21 , 2025 | 03:30 AM
మరి మేం ఎక్కడ విఫలమయ్యామని నిలదీశారు. కొలువుల పండుగ పేరిట రవీంద్ర భారతిలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖలో 588 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు.

వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ
ప్రతిసారీ మా ఎమ్మెల్యేల లేఖలతో దర్శనం ఇప్పించండని అడుక్కోవడం ఎందుకు? వాళ్లకు టీటీడీ ఉంటే.. మనకు వైటీడీ (యాదగిరిగుట్ట) ఉంది. భద్రాచలంలో రాముడు లేడా? రామప్ప లేదా!?
- ముఖ్యమంత్రి రేవంత్
దళితులను, బీసీలను క్యాబినెట్ నుంచి తీసేస్తే పాలనపై పట్టు చిక్కినట్టా!?
రోజుకు 18 గంటలు పని చేస్తుంటే నాకు పట్టు రాలేదట
హుందాగా ఉంటే అర్థం చేసుకునేవాళ్లు ఉండాలిగా
మాకు మానవత్వం, విజ్ఞత ఉంది. మీకు అవి లేవు
అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సర్కారుపై దుష్ప్రచారం
11% వడ్డీకి అప్పు తెస్తే నేను దాన్ని 5 శాతానికి మార్పించా
నోటిఫికేషన్లు ఇచ్చి.. కేసులు వేసి భర్తీ చేయకుండా ఆపేశారు
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ ధ్వజం
టెంపర్‌మెంట్ విషయంలో తగ్గేదే లేదని స్పష్టీకరణ
588 మందికి కారుణ్య.. 334 మందికి కొలువు పత్రాలు
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ‘‘రేవంత్ రెడ్డికి పాలనలో పట్టు రాలేదని అంటున్నారు. దళితుడు రాజయ్యను, బలహీన వర్గాలకు చెందిన ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తప్పిస్తే పట్టు వచ్చినట్లా!? వాళ్లను తీసేయడానికి సహేతుకమైన కారణం చెప్పి ఉంటే నీకు పట్టు ఉన్నట్లు! తప్పు చేసిన నీ సొంత మనుషులను అయినా లోపల వేయిస్తే పట్టు వచ్చినట్లు!? అంతే తప్ప.. పంచుకు తింటే పట్టు వచ్చినట్లా!?’’ అంటూ మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్లు సచివాలయానికే రాని వ్యక్తికి పాలనపై పట్టు వచ్చిందని అంటున్నారని, ప్రతి రోజూ 18 గంటలు పని చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న తనకు పట్టు రాలేదని అంటున్నారని విమర్శించారు. అప్పుడూ ఇప్పుడూ అధికారులు వాళ్లేనని, వ్యవస్థ కూడా అదేనని, మారింది కేవలం 11 మంది మంత్రులు మాత్రమేనని తెలిపారు. అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ తదితరులు ఉంటే.. ఇప్పుడు రేవంత్, సీతక్క, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు తదితరులు ఉన్నారని చెప్పారు. మరి మేం ఎక్కడ విఫలమయ్యామని నిలదీశారు. కొలువుల పండుగ పేరిట రవీంద్ర భారతిలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖలో 588 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. అదేవిధంగా పురపాలక శాఖ, మిషన్ భగీరథ విభాగాల్లో పలు ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు. ‘బిల్డ్ నౌ’ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. ‘‘నేను రాజకీయాల్లోకి వచ్చి 20 ఏళ్లు దాటింది. సీఎం అయ్యారు కాదా మారాలంటున్నారు. హుందాగా వ్యవహరించాలంటున్నారు. నేను హుందాగా వ్యవహరిస్తే.. అర్థం చేసుకునే వాళ్లు ఉండాలి కదా..?’’ అని వ్యాఖ్యానించారు. జానారెడ్డి పెద్ద మనిషిలా హుందాగా వ్యవహరించారని, దృతరాష్ట్ర కౌగిలితో కేసీఆర్ ఆయన గౌరవాన్ని మంటగలిపారని ఆరోపించారు. మీ పాలనలో కోదండరామ్ తలుపులు పగులగొట్టించారని, మీలాగే మేం కూడా పోలీసులను ఆదేశిస్తే.. ఇళ్లలో నుంచి బయటకు రానీయకుండా తాళమేసి ఒంగోబెట్టి దంచరా? అని ప్రశ్నించారు. కేటీఆర్ తలుపులు పగులగొట్టి వీపులు వలగ దంచరా? అని మండిపడ్డారు. ‘‘పోలీసులకు మీరు చెప్పారు. నేను చెప్పలేదు. అలాంటి విధానానికి మేం వ్యతిరేకం. గడీల్లో దొరల్లాగా పెరగకపోవచ్చు. మాకు మానవత్వం ఉంది. మీకు అది లేదు. నేను విజ్ఞతను ప్రదర్శిస్తున్నా. అది మీరు చూపలేదు. మీకు మాకు అదే తేడా’’ అని స్పష్టం చేశారు.
ప్రజలకు నాపై కోపమెందుకు?
తనపై అన్ని వర్గాల ప్రజలు కోపంగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారని, రుణ మాఫీ చేసినందుకు రైతులు, ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినందుకు ఆడబిడ్డలు, 57 వేల ఉద్యోగాలు కల్పించినందుకు నిరుద్యోగులు కోపంగా ఉన్నారా అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ఎస్‌హెచ్‌జీ సంఘాలకు ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుదుత్పత్తి కాంట్రాక్టు ఇస్తున్నందుకు కోపంగా ఉంటారా? అని ప్రశ్నించారు. అడ్డగోలుగా సంపాదించారని, ఆ డబ్బుతో ఇప్పుడు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నల్ల ధనాన్ని వాట్సాప్ వర్సిటీలో పెట్టుబడిగా పెట్టి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందాల పోటీలు హైదరాబాద్‌లో ఎందుకని ఒకాయన అంటున్నారని, ఆయన బాధ అర్థం కావడం లేదు కానీ.. హైదరాబాద్‌కు, పర్యాటక రంగానికి ఇది అందివచ్చిన అవకాశమని చెప్పారు. 140 దేశాలకు చెందిన ప్రతినిధులు, 3000 చానళ్లు, పత్రికల ప్రతినిధులు రానున్నారని, రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తారని, తద్వారా, ప్రపంచంలోనే హైదరాబాద్ ల్యాండ్ మార్క్ కానుందని స్పష్టం చేశారు. ఇంత మంచి సందర్భం వస్తే అభినందించాల్సిందిపోయి విమర్శలు చేయడం తగదని అన్నారు. ‘‘ఫార్ములా ఈ రేస్ ముసుగులో ప్రభుత్వ డబ్బులు కొల్లగొట్టావ్ సామీ.. ఉద్యమం ముసుగులో ఉన్నదంతా ఊడ్చుకుపోయే ఆలోచనలో మీరున్నారు. ప్రజాకోణంలో వారి సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనలో నేనున్నా. మీకు, నాకు తేడా ఇదే’’ అని వ్యాఖ్యానించారు.
11 శాతం వడ్డీతో అప్పులు తెచ్చారు..
‘‘ప్రాజెక్టు డీపీఆర్ సమర్పిస్తే.. నాలుగైదు శాతం వడ్డీతో రుణాలిచ్చే సంస్థలు చాలా ఉన్నాయి. కానీ, కమీషన్ల కోసం.. డీపీఆర్ ఇస్తే దొంగతనం బయటపడుతుందని ఇంతకు ముందాయన 11 శాతం వడ్డీతో అప్పులు తెచ్చారు. దీనిపై నేను ఢిల్లీ వెళ్లి.. కాళ్లా వేళ్లా పడి దానిని 5 శాతం వడ్డీకి రీస్ట్రక్చర్ చేయించాను’’ అని సీఎం రేవంత్ చెప్పారు. ఇతర అప్పులనూ ఇలాగే పునర్వ్యవస్థీకరణ చేయిస్తున్నానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షన్నర కోట్ల అప్పు కూడా 11 శాతం వడ్డీతో తెచ్చారని మండిపడ్డారు. తెలంగాణ పేరు గొప్పగా ఉందని, కానీ ఇప్పుడు అప్పు పుట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లలో 8 లక్షల కోట్ల అప్పు చేశారని, ఏడాదిలోనే తాను 88 వేల కోట్ల అసలు; 64 వేల కోట్ల మిత్తి కలిపి రూ.1.53 లక్షల కోట్లు చెల్లించాల్సి వచ్చిందని వివరించారు. ఆ డబ్బులే ఉంటే 75 లక్షల మంది రైతులకు రుణ మాఫీ, 30 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇచ్చి ఇళ్లు కట్టించేవాడినని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచి రూ.8 వేల కోట్ల బకాయిలు పెట్టి పోయారని, వారి బాధలు చూసి నెలకు రూ.200 కోట్ల చొప్పున సర్దుబాటు చేస్తున్నానని చెప్పారు. ఇసుకలో అవినీతికి పాల్పడి రూ.7000 కోట్లు దోచేశారని, తాము ఆన్‌లైన్ విధానం పెట్టి ఇంటికే ఇసుక వచ్చేలా చేశామని, ప్రభుత్వానికి ఆదాయమూ పెరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం రికార్డుల్లో చేర్చకుండా పెద్దోళ్ల నిర్మాణాలకు అడ్డదారిలో అనుమతులిచ్చిందని, భూమి చెరువులో ఉందా? నాలాలో ఉందా!? ప్రభుత్వానిదా? ప్రైవేటుదా అని చూడకుండా ఆమోదం తెలిపిందని తప్పుబట్టారు. తాము తీసుకొచ్చిన బిల్డ్ నౌ పోర్టల్ ద్వారా ఎంత పెద్దోడయినా నిబంధనల ప్రకారం నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకోవలసిందేనని చెప్పారు.
నోటిఫికేషన్లు ఇచ్చి ఆపేశారు
తాము నోటిఫికేషన్లు ఇచ్చామని, వాటినే రేవంత్ రెడ్డి భర్తీ చేస్తున్నాడని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారని, కానీ, నోటిఫికేషన్లు ఇచ్చి దొడ్డిదారిన వాటిపై కేసులు వేయించి భర్తీ చేయకుండా ఆపేశారని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. కొన్నిటికి పరీక్షలు నిర్వహించకుండా.. ఫలితాలు విడుదల చేయకుండా.. కోర్టు చిక్కు ముడుల్లో ఇరుక్కోవడంతో నియామకాలు నిలిచిపోయాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్నే ప్రధాన సమస్యగా తీసుకుని 15 నెలల్లోనే 57,924 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని వివరించారు. 30, 40 రోజుల్లోనే గ్రూప్ 1, 2, 3 నియామకాలను పూర్తి చేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ వాళ్లు ఉద్యోగాలు ఇవ్వలేదని, తాను పని చేయకుండా కాళ్లల్లో కట్టెలు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
నాలో మానవత్వం ఉంది
‘‘కారుణ్య నియామకాలు మీ హక్కు. గత ప్రభుత్వం వీటిని చేపట్టకపోవడంతో మీరు పదేళ్లు నష్టపోయారు. వాళ్లలో మానవత్వం లేదు. నాలో ఉంది. కాబట్టే... జాబ్ క్యాలెండర్‌తోపాటు కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలని నిర్ణయించా’’ అని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ బిడ్డ, బంధువు ఎన్నికల్లో ఓడిపోతే ఆరు నెలలు తిరక్కుండానే కారుణ్య నియామకాలు ఇచ్చుకున్నారని, కానీ, 20, 30 ఏళ్లు ప్రభుత్వానికి సేవ చేసి మరణించిన వారి కుటుంబాల్లోని పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న సోయి వాళ్లకు లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన వాటిపై దృష్టిపెట్టి.. పేద కుటుంబాల్లో ఆనందం కలిగించేందుకు పాటుపడుతున్నామని చెప్పారు.
టెంపర్‌మెంట్‌లో తగ్గేదే లేదు
‘‘తొలిసారి ఉద్యోగ నియామక పత్రం పొందడం, బాధ్యతలు చేపట్టడం మధుర జ్ఞాపకం. నేను కూడా తొలిసారి జడ్పీటీసీగా గెలిచి బాధ్యతలు చేపట్టినప్పుడు ఎంతో ఆనందమేసింది. సీఎం అయినప్పటి కంటే అప్పుడే ఎక్కువ సంతోషం పొందా’’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారు ప్రజల కోసం పని చేయాలని, ప్రభుత్వ ఉద్యోగి 30 ఏళ్లలో గరమ్, నరమ్, బేషరమ్‌గా మారతారన్న నానుడిలోకి చేరవద్దని సూచించారు. అందరిలా కాకూడదనే 20 ఏళ్లయినా రాజకీయాల్లో తన టెంపర్‌మెంట్ మార్చుకోలేదని, మొదటి రోజు నుంచీ నైపుణ్యాలు పెంచుకుంటున్నానని, టెంపర్‌మెంట్‌లో మాత్రం ఏమాత్రం తగ్గేదేలేదని చెప్పారు.
నాడు కేసీఆర్‌కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయి: సీతక్క
హైదరాబాద్ సిటీ: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 57 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన ఘనత ఒక్క రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని మంత్రి సీతక్క కొనియాడారు. ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన కుటుంబ సభ్యులకు కేసీఆర్ కొలువులు ఇచ్చారేగానీ కారుణ్య నియామకాలు చేపట్టి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పించలేదని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. గురువారం రవీంద్రభారతి వేదికగా ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మంత్రి సీతక్క మాట్లాడారు. కాగా, ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో భాగంగా పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలలో మొత్తం 922 మందికి నియామక పత్రాలు అంజేశారు. ఇందులో 588 కారుణ్య నియామకాలు ఉన్నట్లు ప్రతినిధులు తెలిపారు.
ఉత్తరాది వాళ్లు ఉద్యోగాల కోసం వస్తున్నారేం!?
దేశంలో అభివృద్ధి అంతా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుకు చేరింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఉద్యోగావకాశాల కోసం దక్షిణాది రాష్ట్రాలకు వస్తున్నారు. దేశాన్ని అభివృద్ధి చేశామని ప్రధాని మోదీ చెబుతున్నారు. పదేళ్లు ప్రధానిగా చేశారు. వేరే ప్రాంతాల వారు ఉద్యోగాల కోసం మీ దగ్గరకు ఎందుకు రావడం లేదు. అభివృద్ధి మేం సాధించినట్లా..? మీరు సాధించినట్లా.. మోదీ నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి