Medak: ఆగి ఉన్న యాత్రికుల బస్సును ఢీకొన్న వ్యాన్
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:21 AM
ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన దాదాపు 40 మంది ఈ నెల 13న ట్రావెల్స్ బస్సులో తీర్థయాత్రలకు బయలుదేరారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పలు దేవాలయాలను సందర్శించారు.

ఏపీకి చెందిన ఇద్దరు మహిళల మృతి
పెద్దశంకరంపేట, మార్చి 20(ఆంధ్రజ్యోతి): తీర్థయాత్రకు బయలుదేరిన బృందంలోని ఇద్దరు మహిళలను మృత్యువు వ్యాన్ రూపంలో వచ్చి కబళించింది. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట శివారు కోలపల్లి వద్ద 161వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన అప్పలనారాయణమ్మ (50), సూరప్పమ్మ (62) మరణించారు. ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన దాదాపు 40 మంది ఈ నెల 13న ట్రావెల్స్ బస్సులో తీర్థయాత్రలకు బయలుదేరారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పలు దేవాలయాలను సందర్శించారు.
బుధవారం రాత్రి తుల్జాపూర్ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం హైదరాబాద్ వైపు బయలుదేరారు. కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం కోలపల్లి వద్ద బస్సును ఆపడంతో పలువురు కిందకు దిగారు. ఆ సమయంలో ఓ డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి ఆగి ఉన్న బస్సును ఢీకొంది. కింద ఉన్న నారాయణమ్మ, సూరప్పమ్మ మరణించగా.. బస్సులో ఉన్న పలువురికి గాయాలయ్యాయి.