KTR: వచ్చే ఏడాది పాదయాత్ర!
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:28 AM
రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా వచ్చే ఏడాది పాదయాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.

బీఆర్‌ఎ్‌సను మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యం
ఈ ఏడాదంతా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి
రేవంత్‌ను కాపాడుతున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్
తెలుగు వారి కోసం నాడు ఎన్టీఆర్.. తెలంగాణ కోసం
నేడు కేసీఆర్.. సూర్యాపేటలో బీఆర్‌ఎస్ శ్రేణులతో కేటీఆర్
సూర్యాపేట(కలెక్టరేట్)/హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా వచ్చే ఏడాది పాదయాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. గురువారం సూర్యాపేటలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం సందర్భంగా ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పాదయాత్ర చేయాలని కార్యకర్తలు, నాయకులు కోరుతున్నారని.. దీనిపై పార్టీలో కసరత్తు జరుగుతోందని తెలిపారు. ఈ ఏడాదంతా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడుతున్నామన్నారు. అంతకుముందు సూర్యాపేటలో జరిగిన సభలోనూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.. కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కోరారు. ఆ సమయంలో కార్యకర్తలు చప్పట్లు కొట్టగా కేటీఆర్ తల ఊపారు. కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘకాలం పాదయాత్ర చేపడతారని, అందుకోసం పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత శారీరక దృఢత్వంపైనా దృష్టి పెట్టనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో గురువారం జిల్లా ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో సాగు నీరందక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువని ఆరోపించారు. కేసీఆర్‌పై కోపంతో కావాలనే కాళేశ్వరాన్ని ఖాళీ చేసి పంటలు ఎండిపోయేలా చేశారన్నారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లోని సుమారు 2.50లక్షల ఎకరాలకు రెండు పంటలకూ నీళ్లిచ్చారని గుర్తుచేశారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సూర్యాపేట జిల్లాకు చెందిన వాడైనా ఎందుకు నీళ్లివ్వడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో కృష్ణా జలాలను 36శాతం వాడుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి 24శాతం కూడా వాడుకునే తెలివి లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సను లేకుండా చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్ర పన్నుతున్నాయని అన్నారు. సీఎం రేవంత్‌ను కాపాడుతున్నది బండి సంజయ్, కిషన్‌రెడ్డి అని ఆరోపించారు. అవినీతిపై ఆధారాలతో కేంద్రానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.
నాడు ఎన్టీఆర్.. నేడు కేసీఆర్
తెలుగు వారి కోసం నాడు ఎన్టీఆర్ పోరాడితే.. తెలంగాణ కోసం నేడు కేసీఆర్ పోరాడారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ కోసం 2001లో కేసీఆర్ మంత్రి పదవులను వదులుకొని ఒక్కడే పార్టీని ఏర్పాటు చేశారన్నారు. కేసీఆర్ 14 ఏళ్లు తెలంగాణ కోసం అన్నివర్గాల ప్రజలనూ ఏకం చేశారని తెలిపారు. శూన్యం నుంచి సునామీని సృష్టించిన మొనగాడు కేసీఆర్ అని.. ఆయన ఆనవాళ్లు చెరిపివేయడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పారు.భూమికి మూడు ఫీట్లు లేనోడు, కేసీఆర్ మోకాళ్ల ఎత్తు లేనోడు ఆయన్ని ఉద్దేశించి అసెంబ్లీలో ఇష్టానుసారం మాట్లాడడం ఎంతవరకు సమంజసమని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాక ముందు ఎకరం భూమి ధర రూ.3-5లక్షల వరకు ఉంటే వచ్చాక రూ.20-50 లక్షల వరకు పెరిగిందన్నారు. దీంతో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు బాగా సంపాదించారనే అసూయ ప్రజలకు కలిగిందని.. అలాగే కేసీఆర్ కుటుంబంలోనే ఎక్కువ మందికి పదవులు వచ్చాయని, వారే బాగుపడ్డారంటూ విష ప్రచారం చేశారని చెప్పారు. చిన్న వయసులో రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాడని, అతనికి అదృష్టం కలిసి వచ్చిందని అన్నారు. ఇప్పుడైనా పర్సనాలిటీ పెంచుకుంటాడనుకుంటే పర్సంటేజీలు పెంచుకుంటున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డి దళితుల పక్షపాతి అన్నారు. కావాలనే ఆయన్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. మజ్లిస్ ఎమ్మెల్యే అసెంబ్లీని గాంధీభవన్ లెక్క నడిపితే బాగుండదంటే వారినేమీ అనలేదని, అంత ధైర్యం కూడా లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ రజతోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్‌లో నిర్వహించే సభను చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలని అన్నారు. ఆ సభకు ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. మేలో పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. ఆ తర్వాత పార్టీ కమిటీలను నియమిస్తామని చెప్పారు.
పాదయాత్ర చేస్తే వెంట నడుస్తాం
కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ పాదయాత్ర చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కోరారు. అవసరమైతే పాదయాత్రను కోదాడ నుంచే ప్రారంభించాలన్నారు. పాదయాత్ర పొడవునా రామబంటు హనుమంతుడి సైన్యంలాగా తాము వెంట నడుస్తామని చెప్పారు.