CIA: ఢిల్లీ, కోల్‌కతాల్లో సీఐఏ స్థావరాలు
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:23 AM
దీనికోసం ఢిల్లీ, కోల్‌కతాల్లో ప్రత్యేకంగా స్థావరాలు ఏర్పాటు చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు సంబంధించిన 1963 నాటి రహస్య నివేదికలను ఇటీవల అక్కడి అధికారులు బహిరంగపరచగా, ఈ వివరాలు బయటకొచ్చాయి. ఈ పత్రాలను అనుసరించి.. న్యూఢిల్లీ, కోల్‌కతాల్లోని సీఐఏ రహస్య స్థావరాలను బ్లాక్ సైట్స్ అని వ్యవహరించేవారు.

ఇక్కడినుంచి గతంలో రహస్య ఆపరేషన్లు
కలకలం రేపుతున్న‘కెన్నడీ’ పత్రాలు
న్యూఢిల్లీ, మార్చి 20: అమెరికాకు చెందిన నిఘా సంస్థ సీఐఏ భారత్‌లో రహస్య కార్యకలాపాలు సాగించినట్టు బయటపడింది. దీనికోసం ఢిల్లీ, కోల్‌కతాల్లో ప్రత్యేకంగా స్థావరాలు ఏర్పాటు చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు సంబంధించిన 1963 నాటి రహస్య నివేదికలను ఇటీవల అక్కడి అధికారులు బహిరంగపరచగా, ఈ వివరాలు బయటకొచ్చాయి. ఈ పత్రాలను అనుసరించి.. న్యూఢిల్లీ, కోల్‌కతాల్లోని సీఐఏ రహస్య స్థావరాలను బ్లాక్ సైట్స్ అని వ్యవహరించేవారు. అనుమానిత ఉగ్రవాదులను ఈ కేంద్రాలకు తరలించి విచారించేవారు. ఇక్కడినుంచి సీక్రెట్ ఆపరేషన్లు జరిపేవారు. నిజానికి, స్వాతంత్య్రం పొందిన రోజునుంచీ సీఐఏతో భారత్‌కు బలమైన బంధం ఉంది. ప్రపంచ ఆధిక్యత కోసం అమెరికా, రష్యాలు సాగించిన ప్రచ్చన్నయుద్ధ కాలంలో ఈ బంధం మరింత బలపడింది. 2013లో అమెరికా కొన్ని రహస్య పత్రాలను విడుదల చేసింది. వాటిని అనుసరించి.. చైనాతో 1962లో భారత్‌కు సరిహద్దు వివాదం తలెత్తింది. భారత్‌కు అండగా సీఐఏ అప్పట్లో ఒడిశాలోని చార్‌బాటియాలో రహస్యంగా వైమానిక స్థావరం నడిపింది. సీఐఏకు చెందిన యూ-2 విమానాలు ఇక్కడ ఇంధనం నింపుకొని చైనా గగనతలంపై చక్కర్లు కొడుతూ అక్కడి సమాచారం భారత్‌కు చేరవేసేవి.స్వాతంత్ర్యానంతరం తన నిఘా వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకు అమెరికా సహకారం భారత్ తీసుకుంది. కమ్యూనిస్టు దేశంగా మారిన చైనా అంతర్గత వ్యవహారాలను 1949లో సీఐఏ సాయంతో అప్పటి ఐబీ డైరెక్టర్ టీజీ సంజీవి తెలుసుకొనేవారు. టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా 1959లో టిబెట్ నుంచి తప్పించుకని భారత్‌కు రావడంలోనూ సీఐఏ కీలక భూమిక పోషించింది. కాగా, భారతీయ నగరాలతో పాటు పాకిస్థాన్ రాజధాని రావల్పిండీ, శ్రీలంక రాజధాని కొలంబో, జపాన్ రాజధాని టోక్యో, ఇరాన్ రాజధాని టెహ్రాన్, దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో సీఐఏకు 1960ల్లో స్థావరాలు ఉండేవని తాజాగా బయటపడిన పత్రాలు వెల్లడించాయి.