Share News

Karimnagar: పట్టభద్రుల హోరాహోరీ

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:51 AM

కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. సిటింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డుతుండగా...

Karimnagar: పట్టభద్రుల హోరాహోరీ

  • సిటింగ్‌ స్థానాన్ని దక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్‌

  • ఎలాగైనా సత్తా చాటాలన్న పట్టుదలతో బీజేపీ

  • బీసీ నినాదంతో దూసుకెళ్తున్న బీఎస్పీ అభ్యర్థి

  • త్రిముఖ పోరుగా మారడంతో సర్వత్రా ఉత్కంఠ

  • మరో రెండు రోజుల్లో ముగియనున్న ప్రచారం

కరీంనగర్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. సిటింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డుతుండగా... ఉత్తర తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయనున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రానున్న కాలం తమదేననే సంకేతాలివ్వాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. గ్రాడ్యుయేట్‌ ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు ఈ రెండు ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండగా.. బీఎస్పీ, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థులు రంగంలో నిలిచి ప్రధాన పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో కాంగ్రె్‌సకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీకి మద్దతుగా కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌ ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో 15 కొత్త జిల్లాలు... 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధి విస్తరించి ఉంది. 3,55,159 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈనెల 27న పోలింగ్‌ జరుగనుండగా 25న సాయంత్రం అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. ఈ స్థానం నుంచి 100 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినా... ఉపసంహరణ అనంతరం 56 మంది బరిలో మిగిలారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికకు దూరంగా ఉండగా, కాంగ్రెస్‌, బీజేపీ మాత్రం వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి.


కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉన్న అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధిపతి నరేందర్‌రెడ్డి మొదటి నుంచి ప్రచారంలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. నాలుగు నెలల ముందునుంచే ఆయన తన విద్యాసంస్థల సిబ్బంది సహకారంతో లక్షకుపైగా పట్టభద్రులను ఓటర్లు నమోదు చేయించుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా కానీ, ఇండిపెండెంట్‌గా గానీ పోటీలో ఉంటానని చెబుతూ.. పట్టభద్రుల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాలు చేశారు. పార్టీ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ లు, ఎమ్మెల్సీలను కలుపుకొని ప్రచారాన్ని వేగవంతం చేశారు. మరోవైపు.. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్‌ నేత చిన్నమైల్‌ అంజిరెడ్డి పార్టీ అధిష్ఠానం ఆశీస్సుతో అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. పట్టణ ప్రాంత ఓటర్లలో సహజంగానే బీజేపీపై సానుకూలత ఉంటుందన్న భావనతో ఆయన ముందుకు సాగుతున్నారు. అంజిరెడ్డికి మద్దతుగా కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌ విస్తృత స్థాయి లో ప్రచారంలో పాల్గొంటున్నారు. తన సొంత నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని బండి సంజయ్‌ పట్టుదలతో ఉన్నారు.


మరోవైపు.. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. పోటీకి దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించుకోవడంతో ఆ పార్టీ టికెట్‌ ఆశించిన కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వీరు సైతం అధికార పార్టీలకు దీటుగా నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రసన్న హరికృష్ణకు పలు బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సం ఘాలు ఆయనకు మద్దతు ప్రకటించడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికే కాంగ్రెస్‌, బీజేపీ పెద్ద పీట వేశాయని, బీసీ బిడ్డగా పోటీలో ఉన్న ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని బీసీ సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో స్థానికుడైన నరేందర్‌రెడ్డినే గెలిపించాలంటూ రెడ్డి సంఘం రంగంలోకి దిగింది. ఇదంతా త్రిముఖ పోరుగా మారడంతో ఉత్కంఠ నెలకొంది. అదేసమయంలో బీఎస్పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థులు.. ప్రధాన పార్టీల్లో ఎవరి విజయావకాశాలను గండి కొడతారోనన్న చర్చ జోరుగా సాగుతోంది. కాగా, 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి ఓటరును కలుసుకునే అవకాశం లేకపోవడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు సోషల్‌మీడియా ద్వారానే ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు తమ ఎజెండా, చేయబోయే పనులను వివరిస్తూనే.. మరోవైపు ప్రత్యర్థులను బలహీనతలను ఎండగడుతున్నారు.

Updated Date - Feb 23 , 2025 | 04:51 AM

News Hub