6 నెలల్లో ఐదుగురు కార్యదర్శులు
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:44 PM
నార్కట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పేరు చెబితేనే పంచాయతీ కార్యదర్శులు విముఖత వ్యక్తం చేస్తున్నారు.

6 నెలల్లో ఐదుగురు కార్యదర్శులు
అమ్మో..ఎల్లారెడ్డిగూడెం పంచాయతా..!
అక్కడ పనిచేయలేమంటున్న కార్యదర్శులు
జీపీ ప్రత్యేకాధికారిని మార్చాలని డిమాండ్
నార్కట్‌పల్లి, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): నార్కట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పేరు చెబితేనే పంచాయతీ కార్యదర్శులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామ పంచాయతీ మా కొద్దు బాబు... మేం అక్కడ పనిచేయలేమంటున్నారు. గత 6 నెలల వ్యవధిలోనే ఐదుగురు పంచాయతీ కార్యదర్శులు మారారంటేనే అక్కడ పనిచేయడానికి కార్యదర్శులు ఎంతగా విముఖత చూపుతున్నారో అర్థమవుతోంది. గ్రామ పంచాయతీ పాలనా వ్యవహారాల్లో మితిమీరిన రాజకీయ జోక్యం... సమస్యలపై నిత్యం ప్రశ్నించే జనం... గత పంచాయతీ పాలకవర్గ పాలన అస్తవ్యస్తం... వెరసి గ్రామ పంచాయతీని చుట్టుముట్టిన రాజకీయ, ఆర్థిక వివాదాల నేపథ్యంలో ఇక్కడ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ అధికారుల ఒత్తిడితో వచ్చినా కొన్నాళ్ల పాటే ఉంటున్నారు.
వేలం వివాదాలకు కారణం
గ్రామ పంచాయతీకి సింహభాగం ఆదాయాన్ని స మకూర్చే కొబ్బరికాయల విక్రయ వేలమే ఇక్కడ ప్ర ధానంగా రచ్చకు దారితీసింది. గ్రామ సమీపంలో జి ల్లాలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం ఉంది. భక్తు లు ఈ క్షేత్రానికి ఎల్లారెడ్డిగూడెం నుంచే వెళ్లాల్సి ఉం ది. ఈ అవకాశాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ఎల్లారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఏడాది కాలపరిమితి కింద కొబ్బరికాయల విక్రయ వేలం హక్కును బహిరంగ వేలం నిర్వహించి ఇస్తున్నారు. అయితే కొబ్బరికాయల విక్రయ వేలం హక్కు ను పొందిన వేలందారులు వేలం డబ్బుల్లో కొంత మొత్తాన్ని చెల్లించకుండా రాజకీయ పరపతి ని ఉపయోగిస్తున్నారు. అప్పుడు మీరు... ఇపుడు మే ము...అన్నట్లుగా గ్రామ పంచాయతీ కొబ్బరి కాయల విక్రయ వేలం హక్కు డబ్బులు పూర్తిగా చెల్లించకపో వడం వివాదాలకు కారణమవుతోంది. ఇప్పటి వరకు సుమారు రూ.30లక్షలకు పైగా వేలం బకాయిలు కాంట్రాక్టర్లు నుంచి రావాల్సి ఉన్నట్లు సమాచారం.
నలిగిపోతున్న కార్యదర్శులు
ఇదిలా ఉంటే వేలం డబ్బుల బకాయి వసూళ్లతో పాటు కొన్ని పాలనా పరమైన నిర్ణయాల్లో పంచాయతీ కార్యదర్శులు నలిగిపోతున్నారు. కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం... అనే చందంగా పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి నెలకొంది. బకాయిల వసూళ్ల విషయంలోనే కార్యదర్శులు రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. పైగా గ్రామంలో ప్రతీ సమస్యను పెద్దదిగా చేసి సోషల్ మీడియా వేదికగా కొందరు నిలదీస్తున్న తీరుతో పాటు సమస్యను పరిష్కరించే అవకాశం లేకపోవడంతో కార్యదర్శులు ఇక్కడ పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో రెండు నెలలకొకరు చొప్పున ఇనచార్జీలే కొనసాగుతున్నారు.
ప్రత్యేకాధికారి ఉన్నా...
ఎల్లారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారిగా తహసీల్దార్ ఎల్.వెంకటేశ్వర్‌రావు ఉన్నారు. కానీ ప్రభుత్వ ప్రాధాన్యాలకు భూ సేకరణ, ప్రతీ రోజూ భూముల రిజిస్ర్టేషన, ఇతర ప్రొటోకాల్ విధుల కారణంగా గ్రామ పంచాయతీ పాలనా వ్యవహారాలపై ఆయన ఎక్కువగా సమయం ఇవ్వలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మరో మండల స్థాయి అధికారిని జీపీ ప్రత్యేకాధికారిగా నియమించాలనే సూచన గ్రామస్థుల నుంచి వినిపిస్తుంది.