Share News

Pension Fraud: చనిపోయిన ఉద్యోగి పెన్షన్‌ డ్రా

ABN , Publish Date - Mar 29 , 2025 | 04:27 AM

ఇద్దరు వ్యక్తుల పేర్లు, వాళ్ల తండ్రి పేర్లు ఒకేలా ఉండటాన్ని కొంత మంది అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు చనిపోగా.. ఆ వ్యక్తికి వచ్చే ప్రభుత్వ పెన్షన్‌ను.. బతికున్న వ్యక్తితో డ్రా చేయించారు.

Pension Fraud: చనిపోయిన ఉద్యోగి పెన్షన్‌ డ్రా

  • 8 12 ఏళ్లుగా రూ.40 లక్షలు స్వాహా

హసన్‌పర్తి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఇద్దరు వ్యక్తుల పేర్లు, వాళ్ల తండ్రి పేర్లు ఒకేలా ఉండటాన్ని కొంత మంది అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు చనిపోగా.. ఆ వ్యక్తికి వచ్చే ప్రభుత్వ పెన్షన్‌ను.. బతికున్న వ్యక్తితో డ్రా చేయించారు. ఇలా 12 ఏళ్లలో రూ.40 లక్షలకు పైగా తీసుకున్నారు. ఈ బాగోతం హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో వెలుగుచూసింది. వేల్పుల రాములు అనే వృద్ధుడికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.2,000 వృద్ధాప్య పెన్షన్‌.. గత మేలో నిలిచిపోయింది. దీనిపై రాములు కుటుంబ సభ్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగితే అసలు సంగతి బయట పడింది. రాములుకు సర్వీస్‌ పెన్షన్‌ వస్తున్నందున వృద్ధాప్య పెన్షన్‌ నిలిపేశామని అధికారులు చెప్పడంతో ఆయన కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.


దీనిపై వారు ఆరా తీయగా, అదే గ్రామానికి చెందిన వేల్పుల రాములు అనే మరో వ్యక్తి పంచాయతీ రాజ్‌శాఖలో రిటైరై 2012లో మృతి చెందాడని తేలింది. వీళ్లిద్దరి తండ్రి పేర్లు ఒక్కటే. దీంతో అక్రమార్కులు కూడబలుక్కున్నారు. వృద్ధాప్య పెన్షన్‌ పొందుతున్న రాములుకు మాయ మాటలు చెప్పి యేటా లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించి సర్వీస్‌ పెన్షన్‌ కాజేస్తున్నారు. ఇలా 2012 నుంచి 2024 మే వరకు రూ.40 లక్షలకు పైగా స్వాహా చేసినట్లు తెలుస్తోంది. మరణించిన రాములు కుమారులు కొమరయ్య, మనోహర్‌. 2024లో మనోహర్‌ చనిపోయాక రాములు వృద్ధాప్య పెన్షన్‌ నిలిచిపోవడం గమనార్హం.

Updated Date - Mar 29 , 2025 | 04:28 AM