మళ్లీ కొలువుల జాతర!
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:34 AM
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబరు నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో 58,868 పోస్టులను భర్తీ చేసింది.

55,418 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
అంగన్వాడీల్లో 14236.. జీపీవోలు 10954
వివిధ శాఖల్లో 30,228 ఖాళీల గుర్తింపు
ఈ 15 నెలల్లోనే 58,868 పోస్టుల భర్తీ
గ్రూప్ 1, 2, 3ల్లో ఎంపికైన 2,711 మందికి త్వరలోనే నియామక పత్రాల అందజేత
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు శుభవార్త! రాష్ట్రంలో కొలువుల జాతర జోరందుకుంది! త్వరలో మరో 55,418 పోస్టులను భర్తీ చే సేందుకు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. వీటిలో మహిళా, శిశు సంక్షేమ శాఖలోని 6,399 అంగన్వాడీ టీచర్, 7,837 హెల్పర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పరిపాలన అఽధికారుల (జీపీవో) నియామకాల భర్తీకి కార్యాచరణ ప్రారంభమైంది. ఇవి కాకుండా వివిధ శాఖలన్నింటిలో కలిపి మరో 30,228 పోస్టులను భర్తీ చేయాలని ఆయా శాఖల అధికారులు గుర్తించారు. వీటి భర్తీ దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబరు నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో 58,868 పోస్టులను భర్తీ చేసింది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న కారుణ్య నియామకాలు కూడా వీటిలో ఉన్నాయి. అడ్డంకులన్నిటినీ తొలగించి రాష్ట్ర ప్రభుత్వం వీటిని భర్తీ చేయడం విశేషం. అలాగే, గ్రూప్-1, 2, 3ల్లో ఎంపికైన 2,711 మందికి త్వరలోనే నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ కూడా పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలోనే 61,579 పోస్టులను భర్తీ చేసినట్లు అవుతుంది. ఇక, 55,418 పోస్టులకూ నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని కూడా భర్తీ చేస్తే.. నియామకాల సంఖ్య 1.16 లక్షలను దాటనుంది. నిజానికి, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా నిర్ణయించడంతో రిటైర్ అయ్యేవారి స్థానంలో కొత్తవారిని నియమించడంతోపాటు ఖాళీ స్థానాలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
అర్హతలు కలిగిన హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి కల్పించనున్నారు. మొత్తంగా 14,236 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై ఆ శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే సంతకం చేశారు కూడా. దాంతో త్వరలోనే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. అలాగే, గ్రామ పరిపాలన అఽధికారి (జీపీవో) పేరుతో 10,954 పోస్టులను భర్తీ చేయాలని ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటి భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే, గతంలో వీఆర్వోలుగా పని చేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉంటున్న వారిలో దాదాపు 6000 మందిని ఇప్పుడు జీపీవోలుగా నియమించన్నారు. మిగిలిన 4 వేలకుపైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారు. ఇక, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్ ఇనిస్టిట్యూట్‌లను ఏర్పాటు చేయడంతోపాటు ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా మార్చింది. వీటిలో అవసరమైన పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అలాగే, ఆర్థిక, న్యాయ శాఖ, సచివాలయం, సమీకృత గురుకులాలు తదితరాలన్నిటిలో కలిపి దాదాపు 30,228 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని ఆయా శాఖలు ఇప్పటికే గుర్తించి, అ వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. వీటి భర్తీకి ఆర్థిక శాఖతో చర్చలు జరిపి ఆ తర్వాత శాఖలవారీగా నోటిఫికేషన్లు జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.
నెలల సమయంలోనే నోటిఫికేషన్లు, భర్తీలు
గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పరీక్షకు నోటిఫికేషన్లు విడుదల చేసినా.. ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయన్న కారణంగా రెండుసార్లు రద్దయ్యాయి. ఆ తర్వాత ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టుల సంఖ్యను పెంచి 563 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక, గ్రూప్-2 పోస్టుల భర్తీకి కూడా గత ప్రభుత్వ హయంలోనే నోటిఫికేషన్ ఇచ్చినా.. వివిధ కారణాలతో రద్దయింది. వీటికి మరికొన్ని పోస్టులను జత చేసి 783 గ్రూప్-2 ఖాళీల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక, గ్రూప్-3 కింద 1,365 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించింది. ఫలితంగా, గ్రూప్-1, 2, 3ల్లో మొత్తం 2,711 పోస్టులకు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయడమే కాకుండా నెలల సమయంలోనే ఫలితాలనూ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడమే తరువాయి. మరోవైపు, వివిధ శాఖల్లో 922 పోస్టులకు సంబంధించి గురువారం సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందించారు. వీటిలో 582 పోస్టులు కారుణ్య నియామకాలు కావడం గమనార్హం.
ఇప్పటి వరకు భర్తీ చేసిన పోస్టులు
వ్యవసాయ, సహకార శాఖ 208
పశు సంవర్థక, మత్య్స, డెయిరీశాఖ 173
బీసీ సంక్షేమ శాఖ 5,578
మైనార్టీ సంక్షేమం 1584
ఎస్సీ సంక్షేమం 2,235
ఇంధన శాఖ 850
వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ 7,517
ఉన్నత, సాంకేతిక విద్య 3,893
హోం శాఖ 15,526
నీటిపారుదల శాఖ 1,235
పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ 3,148
రెవెన్యూ శాఖ 2,696
ఆర్ అండ్ బీ 442
విద్యా శాఖ 10,209
ఎస్సీ సంక్షేమ శాఖ 1,290
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి 722,
ఉపాధి కార్మిక శాఖ 128
ఇతర శాఖలు 512