Urban Parks: సకల సదుపాయాలతో అర్బన్ పార్కులు
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:20 AM
హైదరాబాద్ చుట్టూ 59 బ్లాక్‌లను గుర్తించి అర్బన్ పార్కులుగా అభివృద్ధి చేయడానికి ఇప్పటికే అటవీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, టూరిజం శాఖ సైతం కొత్త ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాలని సూచించారు.

హైదరాబాద్ చుట్టూ 59 చోట్ల
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పని చేసుకునేలా తీర్చిదిద్దాలి
పీపీపీ పద్ధతిలో టూరిజం ప్రాజెక్టులు
అధికారులతో భట్టి విక్రమార్క, జూపల్లి
హైదరాబాద్, మార్చి4 (ఆంధ్రజ్యోతి): ప్రజల మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి హైదరాబాద్ చుట్టూ సకల సదుపాయాలతో అర్బన్ పార్కులను అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. హైదరాబాద్ చుట్టూ 59 బ్లాక్‌లను గుర్తించి అర్బన్ పార్కులుగా అభివృద్ధి చేయడానికి ఇప్పటికే అటవీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, టూరిజం శాఖ సైతం కొత్త ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాలని సూచించారు. సచివాలయంలో మంగళవారం ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక, పురావస్తు శాఖలకు సంబంధించిన ప్రీ బడ్జెట్ సమావేశంలో వారు మాట్లాడారు. వర్క్ ఫ్రం హోం చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని, ఆయా ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులను తీసుకురావాలన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అక్కడికి వచ్చి పని చేసుకోవడానికి కావలసిన ఆహ్లాదకరమైన వాతావరణం, వసతులు, తగిన భద్రత, వైఫై తదితర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. పీపీపీ పద్ధతిలో టూరిజం ప్రాజెక్టులను చేపట్టడానికి చాలా సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని, ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
కాగా, వచ్చే ఏడాది నిర్వహించనున్న సమ్మక్క-సారలమ్మ జాతర, సరస్వతి (గోదావరి) పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని, ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. దేవాదాయ, అటవీ-పర్యావరణ శాఖల బడ్జెట్ ముందస్తు సమావేశం సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.వందల కోట్లతో నిర్మించనున్న రహదారులు, పుష్కర ఘాట్లు భవిష్యత్తులోనూ ఉపయోగపడేలా ఉండాలన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా టైగర్ రిజర్వ్‌ఫారెస్ట్ ప్రాంతాలను తీర్చిదిద్దాలని సూ చించారు. ఆరు ప్రధాన ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై చర్చించారు.